MP Lavu Sri Krishna Devarayalu: వైసీపీ ఎంపీలో అసంతృప్త రగాలు పెరుగుతున్నాయి. పార్టీలో కనీస ప్రాధాన్యం దక్కడం లేదని వారంతా లోలోన రగిలిపోతున్నారు. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు పార్టీకి దూరమయ్యారు. పార్టీతో పాటు అధినేత జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. అయితే పార్టీలో రఘురామలాంటి వాళ్లు చాలామంది ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఎక్కడికక్కడే లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఎంపీలకు గ్యాప్ ఉంది. స్థానికంగా ఎంపీలను నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయని సందర్భాలున్నాయి. అటు ఢిల్లీలో కూడా ఎంపీలకు ఏ పని లేకుండా పోతోంది. ముఖ్యంగా బలహీనవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల పరిస్థితి అయితే మరింత బాధాకరంగా ఉంది. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలాంటి వారే లీడ్ చేస్తుంటారు. వారు ఇతర ఎంపీలను పట్టించుకోరన్న టాక్ ఉంది. దీంతో రాష్ట్రంలోనూ విలువ లేక.. అటు ఢిల్లీలో కూడా స్వేచ్ఛ లేకపోవడంతో పదవులు ఉన్నా ఎందుకు దండగ అన్న రీతిలో ఎంపీలు తెగ బాధపడుతున్నారు.

అయితే చాలామంది ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారు. అందులో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముందు వరుసలో ఉన్నారు. ఆ మధ్యన ఆయన ఎక్కువగా టీడీపీ ఎంపీలతోనే సన్నిహితంగా మెలిగారు. వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అయితే సాధారణంగా వైసీపీ ఎంపీలు ఢిల్లీ కదలికలపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. కానీ లావు కృష్ణదేవరాయలు విషయంలో లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రఘురామ విషయంలో తొలుత లైట్ తీసుకున్నారు. తరువాత మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఎంపీ లావు విషయంలో అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో నాయకుడికి తెరపైకి తేవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. అటు ఎంపీ లావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీచేయకపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఈసారి అక్కడ గెలిచే చాన్స్ లేకపోవడం, వైసీపీలో ఎంపీలకు ప్రాధాన్యత లేకపోవడం ఇందుకు కారణం.

అలాగే చాలా చోట్ల సిట్టింగ్ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నారు. అందులో కొందరు శాసనసభ స్థానాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో లోకల్ ఎమ్మెల్యేలతో ఎంపీలకు విభేదాలు ముదురుతున్నాయి. అధిష్టానం అటు ఎమ్మెల్యేకో, ఇటు ఎంపీకో సపోర్టు చేస్తోంది. సపోర్టు లేని వారు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. సంక్రాంతి తరువాత అధికార వైసీపీలో ఎంపీల కితకితలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ లైన్ ను దాటుకొని చాలామంది ఎంపీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రఘురామతో స్వరం కలిపే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.