Visakhapatnam MP Seat : విశాఖ ఎంపీ రేసులో మరో కీలక నాయకుడు వచ్చాడు. బిజెపిలో ఉన్న ప్రో టిడిపి నాయకుడు సీఎం రమేష్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. మరోవైపు బిజెపి ఈ కూటమిలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కీలక ఎంపి స్థానాలు బిజెపికి కేటాయించాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది విశాఖ అని తెలుస్తోంది. పొత్తులో భాగంగా బిజెపి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు అడుగుతోందని ప్రచారం జరుగుతోంది. అందులో వైజాగ్ ఒకటి కావడంతో.. బిజెపి సీనియర్ నేతల దృష్టి పడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ కీలక నేత జిబిఎల్ నరసింహం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపి నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్ కూడా ఆశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంటు స్థానాన్ని బిజెపికి కేటాయించాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. శ్రీ భరత్ కు విశాఖ నగరంలో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని సర్దుబాటు చేస్తారని కూడా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం రమేష్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. 2014లో పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంటు స్థానాన్ని బిజెపికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ బరిలో దిగారు. అయినా టిడిపి మద్దతుతో బిజెపి అభ్యర్థి హరిబాబు ఘనవిజయం సాధించారు. ఇప్పుడు పొత్తులో భాగంగా అదే ఫలితం రిపీట్ అవుతుందని భావించి బిజెపి కీలక నేతలు విశాఖపై ఫోకస్ పెట్టారు.
అయితే విశాఖలో చాలా రోజులుగా బిజెపి ఎంపీ జీవీఎల్ మకాం పెట్టారు. మొన్నటికి మొన్న సంక్రాంతి సంబరాలు కూడా విశాఖలో జరిపించారు. అయితే పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ స్థానం బీజేపీకి దక్కితే పురందేశ్వరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడు సీఎం రమేష్ ఫ్లెక్సీలు విశాఖ నగరంలో వెలుస్తుండడంతో.. ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న విశాఖకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు సాగరనగరంలో వెలిశాయి. ముఖ్యంగా సీఎం రమేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం విశేషం. సీఎం రమేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు బిజెపి పొత్తుల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడం వెనుక సీఎం రమేష్ ఉన్నట్లు టాక్ నడిచింది. ఇప్పుడు అదే సీఎం రమేష్ పేరు విశాఖ ఎంపీ అభ్యర్థిగా వినిపిస్తోంది. అయితే అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.