పీఎం కేర్స్ నిధిపై మరో వివాదం

కరోనా కట్టడి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు విరాళాల సేకరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన `పీఎం కెర్స్ నిధి’ కి ఒక వంక విశేషంగా విరాళాలు లభిస్తుండగా, ఇది తొలి నుండి వివాదాస్పదంగా మారింది. ప్రధాన మంత్రి సహాయ నిధి ఉండగా, దీనిని ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ రూపంలో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందనే విమర్శలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి సమాధానమే లేదు. మరోవంక దీనిని ప్రభుత్వ రంగ సంస్థల నుండి, […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 11:15 am
Follow us on


కరోనా కట్టడి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు విరాళాల సేకరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన `పీఎం కెర్స్ నిధి’ కి ఒక వంక విశేషంగా విరాళాలు లభిస్తుండగా, ఇది తొలి నుండి వివాదాస్పదంగా మారింది.

ప్రధాన మంత్రి సహాయ నిధి ఉండగా, దీనిని ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ రూపంలో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందనే విమర్శలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి సమాధానమే లేదు.

మరోవంక దీనిని ప్రభుత్వ రంగ సంస్థల నుండి, పారిశ్రామిక వేత్తల నుండి పెద్ద ఎత్తున నిధులను సమీకరించడంలో కేంద్ర మంత్రులు తలమునకలవుతున్నారు. అంతే కాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి కూడా ఈ నిధి కోసం వారి జీతాలనుండి కొత్త విధిస్తున్నారు.

పైగా, ఈ నిధికి నిధులు ఇచ్చే వారికి మాత్రమే ఆదాయపన్ను రాయితీ కల్పించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కరోనా వైరస్ కట్టడికి ఇస్తున్న నిధులకు అటువంటి రాయితీలు సమకూర్చడం లేదు. రాష్ట్రాల పట్ల వివక్షతకు నిదర్శనంగా ఈ నిధిని చూపుతూ విమర్శలు చెలరేగుతున్నాయి.

తాజాగా, అన్ని ప్రభుత్వ నిధుల వ్యయంపై జరిపే కాగ్ ఆడిట్ ను ఈ నిధికి జరిపే అవకాశం లేదని తెలియడంతో పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘వివిధ వ్యక్తుల నుంచి, వివిధ సంస్థల నుంచి వచ్చిన విరాళం కాబట్టి స్వచ్ఛంద సంస్థను ఆడిట్ చేయడానికి మాకు ఎలాంటి హక్కూ లేదు’’ అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత ట్రస్టు వ్యక్తులు ఆడిట్ చేయమని అడిగితేనే తాము ఆడిట్ చేస్తామని, లేదంటే వారి అకౌంట్స్‌ను ఆడిట్ చేసే ప్రసక్తే లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. అయితే సంబంధిత ట్రస్టీలు ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర ఆడిటర్లు మాత్రమే పీఎం కేర్ ఫండ్‌ను ఆడిట్ చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అంటే ఈ నిధికి విరాళాలు వసూలు చేయడంలో, వాటిని వ్యయం చేయడంలో పారదర్శకత లేదని స్పష్టం అవుతున్నది.