‘‘లాక్ డౌన్..’’ సంపన్నుల నుంచీ ఆర్థికంగా నెట్టుకు రాగల వారి వరకూ ఇబ్బంది లేదు. ఎటొచ్చీ.. రోజూ కూలీలకు, ఫుట్ పాత్ జీవులకు నరకం చూపిస్తుంది. చేయడానికి పని ఉండదు.. తినడానికి తిండి ఉండదు. ఇక భిక్షమెత్తే వారి పరిస్థితి అగమ్యగోచరం. జీవనం మొత్తం స్తంభించినా.. కడుపులో మెషీన్ తిరగడం ఆగదు కాబట్టి.. వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీకావు. అలాంటి వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అన్నపూర్ణ భోజన కేంద్రాలను గతంలోనే ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.5 కే భోజనం పెడతారు. ఈ పథకం పట్టణ నిరుపేదలకు ఎంతో ఉపశమనంగా ఉంది. కేవలం ఐదు రూపాయలతో భోజనం పెట్టి.. అభాగ్యుల ఆకలి తీర్చడంతో.. మంచి పథకంగా పేరుగాంచింది. అయితే.. గతేడాది లాక్ డౌన్ సమయంలో ఈ కేంద్రాలను కూడా సర్కారు మూసేసింది.
దీంతో.. అభాగ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకలికి తాళలేకపోయారు. రోజూ కూలీలు, చిరు వ్యాపారులు, మార్కెట్లలో పనిచేసి జీవనం సాగించేవారు రాజధానిలో వేల సంఖ్యలో ఉంటారు. వీరంతా నానా అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. కొంత కాలం తర్వాత ఈ కేంద్రాలను తెరిచింది. ఇప్పుడు సెకండ్ వేవ్ లాక్ డౌన్లో ఈ కేంద్రాలను ముందు నుంచే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
వీరికోసం ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కేంద్రాలను తెరిచి ఉంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. నిజానికి ఈ సమయంలో ఉపాధి కూడా ఉండదు కాబట్టి.. జనాలు తిండికి తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటి వారికోసం ప్రభుత్వం రూ.5 భోజన కేంద్రాలను అందుబాటులోకి తేవడం గొప్ప విషయమని అంటున్నారు.