Telangana BJP
Telangana BJP: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలకు ముందు.. రాష్ట్రంలో బిజెపి వర్సెస్ బిఆర్ ఎస్ అన్నట్టుగా ఉండేది. నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకునేవారు. భారత రాష్ట్ర సమితి నాయకులు బిజెపి నాయకుల మీద కేసులు పెట్టించేవారు. వాహనాలను మార్చి మార్చి కోర్టులకు తరలించేవారు. పోటాపోటీగా సమావేశాలు నిర్వహించేవారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడి కనిపించేది. ఆ పార్టీ ఉందా? లేదా? అనే అనుమానం ప్రజల్లో కలిగేది. ఒకానొక దశలో భారత రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ నే ప్రధాన పోటీదారు అనే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత మీద చర్యలు తీసుకోకపోవడం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించడం వంటి పరిణామాలు ఒకసారిగా కమలం పార్టీని కుంగదీశాయి. ఇది ఎంతవరకు వెళ్లిందంటే అసలు భారతీయ జనతా పార్టీ కి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? అనే దాకా పరిస్థితి దిగజారింది.
బీజేపీ అధినాయకత్వం తీరుపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న రాష్ట్రంలోని ఆ పార్టీ సీనియర్ నేతల అడుగులు ఎటువైపు పడనున్నాయి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది..పార్టీ సీనియర్ నేత వివేక్ సోమవారమే బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్‌తో సోమవారం రాత్రి సుదీర్ఘ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని అధినాయకత్వానికి తెలియజేయడమే తమ లక్ష్యమని సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలో ప్రచార సందడిని సృష్టించి ప్రజల్లోకి దూసుకెళుతుంటే, పార్టీ ఎజెండా ఏమిటో ఇప్పటికీ అధినాయకత్వం స్పష్టం చేయకపోవడంపై సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అధినాయకత్వం వైఖరి అంతుచిక్కక క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో పరిస్థితిని గట్టిగా చెప్పాలని, అప్పటికీ వైఖరి మారకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. అయితే అధినాయకత్వం తమకు సమయం ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సివస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేతలు మాజీ ఎంపీ వివేక్ నివాసంలో తరచూ భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, చాడా సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, రవీంద్రనాయక్ వంటి నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేతలు, పార్టీ తమకు అప్పగించిన బాధ్యతలను ఒకవైపు నిబద్ధతతో నిర్వర్తిస్తున్నా, మరోవైపు రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని అమలు చేయకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవినీతిని ఉపేక్షించబోమని తరచూ చెబుతున్నా, రాష్ట్రానికి సంబంధించి అందుకు అనుగుణంగా చర్యలు లేకపోవడం వల్ల ప్రజల్లో విశ్వాసాన్ని పొందడం కష్టతరమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, బీఆర్‌ఎస్ పట్ల గతంలో దూకుడు ప్రదర్శించి.. ఇప్పుడు మెతక వైఖరి అనుసరిస్తుండటం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయకపోవడం… బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై, చీకటి దందాలపై ఆధారాలు ఇచ్చినా జాతీయ నాయకత్వం నుంచి స్పందన లేకపోవడం.. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జాతీయ పార్టీ నేతలపై ఆరోపణలు చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించడం.. వంటి ఘటనలతో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఈ పరిణామాన్ని తాము ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని జాతీయ నాయకత్వం దృష్టికి నేరుగా తీసుకువెళ్దామంటే అవకాశమే ఇవ్వడం లేదని సీనియర్ నేతలు వాపోతున్నారు.
ప్రస్తుత తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకపోవడమే మేలని బీజేపీలో పలువురు నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా ఓడిపోతే, దాని ప్రభావం ఎంపీ ఎన్నికల్లో పోటీపైనా పడుతుందని, అందువల్ల, నేరుగా ఎంపీగా పోటీచేయడమే బెటర్.. అని వారు అభిప్రాయపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు సీనియర్ నేతలు తప్పనిసరిగా అసెంబ్లీకి పోటీచేయాలని పార్టీ అధినాయకత్వం, ఇప్పటికే అంతర్గతంగా ఆదేశించింది. దీంతో, ఈ పరిణామం కూడా సీనియర్ నేతలను ఇరకాటంలోకి నెట్టిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Anger at the leadership where are the steps of senior bjp leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com