AP New Districts: ఓ వైపు ఉద్యోగుల సమ్మె.. మరోవైపు ఏపీ మంత్రి కొడాలి నాని చుట్టూ బిగుసుకుంటున్న ‘క్యాసినో’ ఉచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిఫెన్స్ లో పడిపోయిన వైసీపీ ప్రభుత్వం చాకచక్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కొత్త జిల్లాలను’ ప్రకటించి మొత్తం ఫోకస్ ను ఇటు మళ్లించి డైవర్ట్ చేసింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు కరెక్ట్ టైంలో అమలు చేసి ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చకు దారితీసింది. మొత్తానికి కేసీఆర్ బాటలోనే జగన్ కూడా ప్రత్యర్థులకు అందని రీతిలో డైవర్ట్ పాలిటిక్స్ బాగానే చేస్తున్నాడని తెలుస్తోంది. ఎప్పుడు.? ఎక్కడ ఎలా రాజకీయాన్ని మార్చాలో జగన్ కూడా బాగానే వంటి పట్టించుకున్నాడని అర్థం చేసుకోవచ్చు.
ఇక కొత్త జిల్లాల విషయానికి వస్తే.. జగన్ ప్రభుత్వం ఏపీలో 26 జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తూ ఆమోదముద్ర వేసింది. మంగళవారం ఈ మేరకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇప్పటికే కొత్త జిల్లాలపై వేసిన రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసులను జిల్లా కలెక్టర్లకు పంపి సీఎస్, సీసీఎల్ ఏ ఆన్ లైన్ లోనే సమావేశం నిర్వహించి ఆగమేఘాల మీద కలెక్టర్లందరూ ఆమోదం తెలిపడం విశేషం. కేబినెట్ తోపాటు కలెక్టర్లను ఆన్ లైన్ లోనే తీసుకొని ఆమోదింపచేశారు. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ విభజన చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అవుతున్నాయి.
Also Read: సమ్మెకు రెడీ అయ్యి పనిచేయని టీచర్లకు ఇలా షాకిచ్చారు
తెలంగాణలో లాగానే ప్రజలకు పరిపాలనను చేరువ చేయడం.. ప్రజలకు దగ్గరిలోని కలెక్టర్ల ద్వారా సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా జగన్ ఈ కీలక సంస్కరణ చేశారు. విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో కలెక్టర్ కు రావడం ప్రజలకు చాలా కష్టంగా మారింది. చిత్తూరు, అనంతపురం లాంటి పెద్ద జిల్లాల్లోనూ చివరన ఉన్న ప్రజలకు కలెక్టర్లకు రాలేకపోతున్నారు. దూరభారంతో ప్రజలు మిన్నకుండిపోతున్నారు. కలెక్టర్లకు పర్యవేక్షణ చాలా కష్టంగా మారింది. ఇప్పుడు చిన్న జిల్లాలతో మెరుగైన ఫలితాలు రానున్నాయి.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టే ఏపీలో లోక్ సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ జగన్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. రాష్ట్ర కమిటీ సిఫారసుల మేరకు 26 జిల్లాలుగా ఏపీని విభజించారు. ఈ మేరకు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నోటీఫికేషన్ జారీ చేసింది.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకూ అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తారు.
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది అయిన ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర నిర్ణయించింది.
ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తేవాలని కమిటీ ప్రతిపాదించింది. 18-20 లక్షలకు ఒక జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.
-కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు ఇవీ..
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు విజయనగరం నుంచి ఎచ్చెర్లను తీసుకొని కొత్తగా శ్రీకాకుళంను ఏర్పాటు చేశారు. ఇక విశాఖలోని శృంగవరపు కోటను తీసుకొని విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. విజయనగరంలోని పెదగంట్యాడ మండలాన్ని విశాఖలోకి మార్చారు.
ఇక కొత్తగా అనాకపల్లి జిల్లాను విశాఖను విభజించి ఏర్పాటు చేశారు. అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని పార్వతీపురం, అరకు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. గిరిజన నియోజకవర్గాలను ఒక గూటికి తెచ్చారు. వారికి పాలనసౌలభ్యం కోసం.. విస్తీర్ణం పెద్దగా ఉండడంతో రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు.
పాడేరు కేంద్రంగా కొత్తగా ‘అల్లూరి సీతరామరాజు’ జిల్లాను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అమలాపురం కేంద్రంగా ‘కోనసీమ’ జిల్లా.. కాకినాడ కొత్త జిల్లా, రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా.. ఏలూరును కొత్తగా జిల్లా ఏర్పాటు చేశారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటు చేశారు.
-విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చారు.
-బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. దీనికి భావపురిగా పేరు పెట్టాలని నిర్ణయించారు.
-నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను .. ఒంగోలు కేంద్రంగా ప్రకాషం జిల్లాను ఏర్పాటు చేశారు.
-నెల్లూరు కేంద్రంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.. తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా..చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు చేశారు.
-రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాయచోటి కేంద్రంగా కొత్త జిల్లాను ప్రతిపాదించారు. ఈ జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టాలని నిర్ణయించారు.
-కడప లోక్ సభ స్థానం పరిధిలోని వైఎస్ఆర్ జిల్లా ఏర్పాటు. నంద్యాలను కొత్త జిల్లాగా చేశారు. అనంతపురం విభజించి పుట్టపర్తి కేంద్రంగా కొత్తగా ‘సత్యసాయి’ జిల్లాను ఏర్పాటు చేశారు.
Also Read: ఏపీలో కరోనా విలయమే.. రోజుకు 13వేల కేసులు.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు
-కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 10 నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.