ఏదైతేనేమీ.. కరోనా కల్లోలంలో అల్లోపతి మందులు తగ్గించలేని ఆ మహమ్మారి రోగాన్ని ఆనందయ్య ఆయుర్వేద మందు తగ్గిస్తోంది. దీనిపై మెడికల్ మాఫియా, పలు చానెల్స్ ఎంత దుష్ప్రచారం చేసినా మన సంప్రదాయ వన మూలికల ఔషధాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది.తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి ఓకే చెప్పింది. ఈ పరిణామం ఆనందయ్యకు మద్దతుగా నిలిచిన ఎంతో మందికి ఊరటనిచ్చింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి సంతోషం వ్యక్తమవుతుండగా.. అల్లోపతి, మెడికల్ మాఫియా మాత్రం రగిలిపోతోంది.
ప్రజల కోరిక.. మీడియా విజ్ఞప్తి.. కరోనా రోగుల డిమాండ్ నేపథ్యంలో ఎట్టకేలకు ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర ఆయూర్వేద సంస్థ పరిశోధించి మరీ ఈ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవని తేల్చింది.కంట్లో వేసే మందు గురించి పరిశోధన మరో రెండు మూడు వారాల్లో తేల్చాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య రూపొందించిన కరోనా నివారణ మందుతో చాలా మంది రోగులకు నయం అయిపోయింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇక్కడికి ఒక్కరోజులో 60వేల మంది బాధితులు వచ్చారు. ఇక ఆస్పత్రుల నుంచి తప్పించుకొని మరీ కృష్ణపట్నంలో ఆనందయ్య వద్దకు వచ్చారు. శాంతి భద్రతల సమస్యలు రావడంతో పోలీసులు ఆనందయ్య మందును ఆపు చేయించారు.
దీనిపై మొదట ఏపీ ఆయూష్ శాఖ పరిశోధన చేసింది. దీని వల్ల ఎలాంటి హాని లేదని.. ఒక నాటుమందుగా తేల్చింది. ఆ తర్వాత దీన్ని నిగ్గుతేల్చాలని ఏపీ ప్రభుత్వం జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) కు పంపించింది. ఆ కమిటీ ఆనందయ్య మందును పరిశీలించి.. రోగుల అభిప్రాయాలు తీసుకొని నివేదిక సమర్పించింది. ఈ మందు వల్ల ఎలాంటి హాని లేదని తేల్చింది.
ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్ధారణలు లేవని సీసీఆర్ఏఎస్ నివేదికలు తేల్చాయి. ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఆనందయ్య ఇచ్చే మందులు నిరభ్యంతరంగా వాడొచ్చని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇంతమందికి పంచడానికి ఆనందయ్య శక్తి సామర్థ్యాలు, ఆయన దగ్గరున్న వనమూలికలు సరిపోవు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, టీటీడీ లాంటి సంస్థలు ముందుకొచ్చి ఆ ఫార్ములాతో తయారు చేసి ప్రజలకు పంచితే అందరినీ బతికించిన వారు అవుతారు. ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక కంట్లో వేస్తున్న ఆనందయ్య మందుకు మాత్రం ఇంకా జాతీయ ఆయుర్వేద సంస్థ, ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ డ్రాప్స్ కు సంబంధించిన నివేదిక రావాల్సి ఉందని.. 3 వారాల సమయం పడుతుందని.. అప్పటివరకు ఆ మందు వేయడానికి అనుమతి లేదని సీసీఆర్ఏఎస్ స్పష్టం చేసింది. మిగతా మందులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఈ క్రమంలోనే అనుమతించిన ఆనందయ్య మందును ఏపీ ప్రభుత్వమే పంచాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనుమతి వస్తే టీటీడీ ఆయుర్వేద విద్యాలయం ద్వారా తాము భారీగా ఉత్పత్తి చేసి ప్రజలకు పంచుతామని వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇక ఏపీ ఆయూష్ శాఖ కూడా దీని ఫార్ములాతో ఆ మందును తయారు చేసి పంచాలని పలువురు కోరారు. సీఎం జగన్ సైతం ఆనందయ్య ఆయుర్వేద మందును ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచడానికి యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుంటే కరోనా రోగులకు ఉపశమనం లభిస్తుందని.. ప్రాణాలు నిలబెట్టవచ్చని రోగులు కోరుతున్నారు.