Huzurabad By Poll Results: హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితంతో ఒకటి క్లియర్ గా అర్థమైంది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం ఒక గట్టి మెసేజ్ ను తెలంగాణ రాజకీయాల్లో పంపింది. కేసీఆర్ అహంకారానికి.. పంతానికి మేం తలొగ్గం అన్న స్పష్టమైన సందేశాన్ని హుజూరాబాద్ ప్రజలు ఇచ్చేశారు. చెంప చెల్లుమనేలా.. గులాబీ గూబ గుయ్యిమనేలా ఒక సంచలన తీర్పునిచ్చారు.
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచినా.. నిజానికి గెలిచింది గెలిపించింది ప్రజలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్ లో మోహరించారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా టీఆర్ఎస్ విజయం కోసం పనిచేసింది. దళితబంధు, పథకాలు, అభివృద్ధి.. ఎన్నికల ముందు ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకూ పంచడాలు.. ఎన్ని అయితేనేమీ.. ఇన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలను నీతి తప్పలేదు. న్యాయాన్ని మరువలేదు. ధర్మాన్ని వీడలేదు.
డబ్బులు తీసుకొని ధర్మానికి ఓటేయండన్న ఈటల రాజేందర్ పిలుపునకు ప్రజలు స్పందించారు. కేసీఆర్ గెంటేసి పంపించిన ఈటల రాజేందర్ ను అక్కున చేర్చుకున్నారు. మేమున్నామని ఈటలను సాకారు. ఆదరించారు. గెలిపించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికతో కేసీఆర్ ఏదీ చెబితే తెలంగాణలో అదే నడుస్తుందన్న ధోరణికి చెక్ పడింది. నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందన్న వాస్తవాన్ని ప్రజలు నిరూపించారు. డబ్బులకు అమ్ముడు పోరు అన్నది తేటతెల్లమైంది.
తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కొందరికే న్యాయం చేస్తున్నాడన్న విమర్శ ఉంది. రైతులు, పింఛన్ దారులు , గ్రామస్థులను పట్టుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. పట్టణ ప్రజలకు ఉపాధి సౌకర్యాలు లేవు. మొన్నటి వరకూ ఉద్యోగులకు పీఆర్సీ లేవు. పథకాలు ఎన్నో ఉన్నా అవి సరైన టైంలో సరైన విధంగా అందరికీ పంచడం లేదన్న అపవాదు ఉంది. కేసీఆర్ ప్రజల నుంచి రెండు రూపాయలు తీసుకుంటూ పావలే పంచుతున్నాడన్న అపోహ ఉంది. టీఎస్ బీపాస్ సహా ఈ ఆన్ లైన్ విధానంలో ప్రజల నుంచి లక్షలు వసూలు చేయడం.. భూముల గొడవ, లావణీ, అటవీ భూములు, పోడు వ్యవసాయం.. ధరణి వెబ్ సైట్ తో భూ రికార్డుల తారుమారు.. ఇలా ఒక్కటేమిటి అన్నింటా నిర్లక్ష్యం పాతుకుపోయింది. అసలు పరిష్కారమే లేకుండా పోయింది.
అందుకే దళితబంధు, రైతు బంధు ఇచ్చినా మిగతా వాటితో లాగేసుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు వ్యతిరేకంగా మారారు. కేసీఆర్ మాయల మాటలకు ఇక లొంగమని తీర్పునిచ్చారు. ముఖ్యంగా బీజేపీ గెలుపులో యువత పాత్ర కీలకం. ఉద్యోగాలు దక్కని యువత అంతా కూడా బీజేపీ వెంట నడిచారు. అది హుజూరాబాద్ లో ఈటల విజయంలో కీలకంగా మారింది.
హుజూరాబాద్ గెలుపుతో తెలంగాణ రాజకీయాల్లో ఇక టీఆర్ఎస్ ఆడింది ఆట పాడింది పాట.. నే రాసిందే గీత అన్న ధోరణికి చెక్ పడనుంది. ప్రత్యామ్మాయంగా బీజేపీ ఉందన్న వాస్తవాన్ని హుజూరాబాద్ తీర్పుతో ప్రజలు ఇచ్చారు. కేసీఆర్ ఆదేశిస్తే ప్రజలు శాసిస్తారన్న దానికి చెక్ పడింది. తెలంగాణలో 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీగా బీజేపీ నిలబడుతుందన్న ధైర్యాన్ని హుజూరాబాద్ ఇచ్చింది. ప్రత్యామ్మాయం లేదంటూ ఇష్టారీతిన చేయడానికి వీల్లేదని కేసీఆర్ సర్కార్ కు ఈ తీర్పు చెంపపెట్టులా చెప్పేసింది. ఇదే ఊపును బీజేపీ కొనసాగిస్తే తెలంగాణలో 2023లో రాజ్యాధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు.. ఆదిశగా కమలదళం సాగితే తిరుగుండదు.. ఏం జరుగుతుందనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.
మొత్తంగా ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి ఆరోపణలతో తొలగించిన కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు బుద్ది చెప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలనే నమ్ముకొని ఎన్నికల కార్యక్షేత్రంలోకి వెళ్లిన ఈటలను గెలిపించి ప్రజలు తమ విశ్వసనీయతను నిరూపించుకున్నారు. తెలంగాణలో ఏకపక్ష రాజకీయాలకు చెక్ చెప్పారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉండనున్నాయన్న సంకేతాలు పంపారు. బలమైన ప్రత్యామ్మాయాన్ని తమకు తామే ప్రజలు తయారు చేసుకున్నారు.
హుజూరాబాద్ గెలుపుపై ‘రామ్ టాక్’ విశ్లేషణ వీడియోను కింద చూడొచ్చు.