Homeజాతీయ వార్తలుKCR: కేసీఆర్ ప్రకటించిన సన్న బియ్యం సరే.. ఈ ధాన్యం అక్రమానికి అడ్డుకట్టేదీ?

KCR: కేసీఆర్ ప్రకటించిన సన్న బియ్యం సరే.. ఈ ధాన్యం అక్రమానికి అడ్డుకట్టేదీ?

KCR: “తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం. రేషన్ ద్వారా వారికి ఈ బియ్యాన్ని అందజేస్తాం. తెలంగాణ ప్రజలు దొడ్డు బియ్యం తినకూడదు. తెలంగాణలో వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం” భారత రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. కెసిఆర్ ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి.. తను కూడా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన అక్రమాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నాడు. పైగా ప్రజలకు దక్కాల్సిన సన్నబియ్యం దర్జాగా బయటకి తరలిపోతోంది. అది కూడా పౌరసరఫరాల శాఖ అధికారుల సాక్షిగా..

రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌ మిల్లర్లకు అప్పగించిన ధాన్యం.. బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతోంది. రాష్ట్రంలో నెలకొన్న అసెంబ్లీ ఎన్నికల హడావుడిని, ప్రభుత్వ యంత్రాంగమంతా అదే పనిలో నిమగ్నమై ఉండడాన్ని రైస్‌ మిల్లర్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ చేయాల్సిన ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రంలోని వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతులకు డిమాండ్‌ ఉండటం, తూర్పుగోదావరి జిల్లా నుంచి వ్యాపారులు పోటెత్తుతుండడంతో ధాన్యాన్ని మిల్లర్లు తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి కేవలం కస్టోడియన్‌లా ఉండాల్సిన రైస్‌ మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా దానిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. గత యాసంగి సీజన్‌కు సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్‌ టన్నులధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు ఇటీవలే విక్రయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతేడాది యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఇందుకు.. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం 68 శాతం రికవరీ రేటు చొప్పున 45.56 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ, ఆ ధాన్యం మిల్లింగ్‌పై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంగానీ రైస్‌ మిల్లర్లుగానీ దృష్టి సారించలేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడానికి నిరాకరిస్తుండడంతో ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, రెండు మూడు నెలలుగా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రావడం లేదు.

విదేశాలకు ఎగుమతి అవుతుండడంతో..

బహిరంగ మార్కెట్లో ధాన్యానికి డిమాండ్‌ ఉండడం, కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతి అవుతుండడంతో తూర్పుగోదావరి సహా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు, మిల్లర్లు తెలంగాణలో నిల్వ ఉన్న ధాన్యంపై కన్నేశారు. యాసంగి ధాన్యాన్ని తమకు విక్రయించేలా రైస్‌ మిల్లర్లతో డీల్‌ కుదుర్చుకున్నారు. దీంతో మిల్లర్లు క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,500 చొప్పున ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. గడచిన మూడు వారాల్లో రూ.2 వేల కోట్ల విలువైన 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులకు వారు విక్రయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం 67 లక్షల టన్నుల ధాన్యంలో ఇప్పటివరకు 25 లక్షల టన్నులు ఆంధ్రాకు తరలి వెళ్లినట్లు సమాచారం. క్వింటాలుకు సగటున రూ.2 వేల చొప్పున 25 లక్షల టన్నుల ధాన్యం విలువ రూ.5 వేల కోట్ల ఉంటుంది. ఇంత భారీ ఎత్తున ధాన్యం.. పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం నిల్వలు, అక్రమ రవాణా, అడ్డగోలు విక్రయాలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఇదే అదనుగా రైస్‌ మిల్లర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ ప్రాంతాల నుంచి వచ్చే ట్రేడర్లు, బడా రైస్‌ మిల్లర్లు, ఎగుమతిదారులకు.. ఇక్కడి ధాన్యాన్ని అమ్మేస్తున్నారు.

తనిఖీలు లేకపోవడం వల్లే?

వాస్తవానికి గడచిన ఐదేళ్ల నుంచి కేసీఆర్‌ ప్రభుత్వం లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మద్దతు ధర కూడా చెల్లిస్తోంది. కానీ, తరుగు పేరుతో సెంటర్ల నిర్వాహకులు, రైస్‌ మిల్లర్లు, అధికారులు.. రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ధాన్యంతో రైస్‌ మిల్లర్లు వ్యాపారం చేస్తున్నా, బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకుంటున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మనీ లాండరింగ్‌ జరుగుతున్నట్లు, అక్రమ రవాణా చేస్తున్నట్లు, పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా.. ఎలాంటి విచారణ చేయడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలను పురమాయించి విచారణ చేపట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version