https://oktelugu.com/

H1-B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం: భారతీయులపై ఏ మేరకు ప్రభావమంటే..

అమెరికాలోని సాంకేతిక సంస్థలు ఏటా వేల సంఖ్యలో భారత్‌, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలను మరింత పారదర్శకం చేసేందుకు....

Written By:
  • Bhaskar
  • , Updated On : October 23, 2023 / 09:48 AM IST
    Follow us on

    H1-B Visa: అమెరికా లో ఎన్నికల వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్‌-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను క్రమబద్ధీకరించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అదేవిధంగా లాభాపేక్ష లేని సంస్థలను నిర్వహించే పారిశ్రామికవేత్తలకు మెరుగైన పని వసతులను కల్పించనుంది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌(వలసేతర) వర్కర్స్‌కు కూడా ఈ వీసా ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన విధివిధానాలను యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసె స్‌(యూఎ్‌ససీఐఎస్‌) అధికారులు ఫెడరల్‌ రిజిస్టర్‌లో ఈనెల 23న ప్రచురించనున్నారు. అదేసమయంలో వీసాలకు సంబంధించి కాంగ్రెస్‌ పేర్కొన్న ఏటా 60 వేల పరిమితిని మించరాదని నిర్ణయించారు. ఈ వీసా ఆయా సంస్థలకు మూడు నుంచి ఆరేళ్లపాటు విదేశీ కార్మికులను, ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఇస్తుంది. అయితే, హెచ్‌-1బీ వీసా ఉన్నవారు గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నిస్తూ తరచుగా తమ వర్క్‌ వీసాలను రెన్యువల్‌ చేయించుకుంటున్నారు.

    అమెరికాలోని సాంకేతిక సంస్థలు ఏటా వేల సంఖ్యలో భారత్‌, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలను మరింత పారదర్శకం చేసేందుకు బైడెన్‌ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై పెట్టుబడిదారులు, ప్రజలు, ఆయా సంస్థల యజమానులు తమ అభిప్రాయం చెప్పాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ కోరింది. కాగా, ఒక కంపెనీకి ఒకే వ్యక్తి ప్రొప్రైటర్‌గా ఉన్నట్టయితే సదరు వ్యక్తి ఎల్‌-1 విదేశీ వర్కర్‌ వీసాకు అనుర్హులని వెల్లడించింది. ఇదిలావుంటే, భారత సంతతికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది అజయ్‌ భుటోరియా ఈ ప్రతిపాదనలను స్వాగతించారు.

    కొత్త ప్రతిపాదనలతో లబ్ధి ఇదీ..

    మరింత సామర్థ్యం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తీసుకునేందుకు, సంస్థలపై భారం తగ్గించేందుకు దోహద పడతాయి. నకిలీ వీసాలు, అనర్హులు, అనధికార వలసలను నిరోధిస్తాయి. ప్రస్తుత విధానంలో ఒక వ్యక్తి ఎన్ని రిజిస్ట్రేషన్‌లు అయినా దాఖలు చేసే అవకాశం ఉంది. సదరు వ్యక్తి లాటరీలో పదేపదే ఎంపికయ్యే అవకాశముంది. కొత్త ప్రతిపాదనలో ఎన్ని రిజిస్ర్టేషన్లు చేసుకున్నా అభ్యర్థి ఒక్కసారి మాత్రమే ఎంపికవుతారు. సంబంధిత సంస్థల్లో ఉద్యోగం లభించని వారి హెచ్‌-1బీ వీసా పరిమితులకు మినహాయింపులు ఇచ్చేందుకు అవకాశం.
    విద్యార్థుల అవసరాన్ని బట్టి ఎఫ్‌-1 వీసాలను హెచ్‌-1బీగా మార్చుకునే చాన్స్‌ ఉంటుంది.
    ఎంటర్‌ప్రెన్యూర్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా హెచ్‌-1బీ అర్హతలను నిర్దేశించనుంది.

    భారతీయులపై ప్రభావం?

    హెచ్‌-1బీ వీసాల్లో చేసిన మార్పులు భారతీయులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి రావడం, పనిచేసే ప్రాంతాన్ని కచ్చితంగా సందర్శించడం, హెచ్‌-1బీ వీసా కోరుకునే భారతీయులను అదనంగా స్ర్కూటినీ చేయడం వంటివి భారతీయులకు ఇబ్బందిగా మారుతుందని తెలుస్తోంది. అయితే చట్టబద్ధమైన ఉపాధిని పొందే క్రమంలో ఎలాంటి నకిలీలకు అవకాశంలేకుండా చూసేందుకే మార్పులు చేసినట్టు అమెరికా చెబుతోంది.