Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల్లో ఒక కులం -రాజకీయాలను మార్చేయగలదు…. ఎందుకలా ?

Karnataka Assembly Elections 2023: కర్నాటక రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. అక్కడ జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. ఎప్పుడు కింగ్ మేకర్ గా ఉండే జేడీఎస్ సైతం గట్టిగానే పోరాడుతోంది. గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కర్నాటకలో కుల రాజకీయాలు అధికం. అక్కడ లింగాయత్ కులం ఎటు మొగ్గుచూపితే వారితే అధికారం. దశాబ్దాలుగా అక్కడ సామాజికవర్గం ప్రభావం చూపుతోంది. అందుకే రాజకీయ పక్షాలు గుర్తెరిగి […]

Written By: Dharma, Updated On : April 1, 2023 12:28 pm
Follow us on

Karnataka Assembly Elections 2023

Karnataka Assembly Elections 2023: కర్నాటక రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. అక్కడ జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. ఎప్పుడు కింగ్ మేకర్ గా ఉండే జేడీఎస్ సైతం గట్టిగానే పోరాడుతోంది. గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కర్నాటకలో కుల రాజకీయాలు అధికం. అక్కడ లింగాయత్ కులం ఎటు మొగ్గుచూపితే వారితే అధికారం. దశాబ్దాలుగా అక్కడ సామాజికవర్గం ప్రభావం చూపుతోంది. అందుకే రాజకీయ పక్షాలు గుర్తెరిగి ఆ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నాయి. ఆ వర్గ నాయకులను ముందుపెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా లింగాయత్ కులానికి చెందిన యడ్యూరప్పను ప్రచార సారధిగా వినియోగించుకుంటోంది. సీఎం బసవరాజు బొమ్మై సైతం లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం బీజేపీకి కలిసొచ్చే అంశం.

100 నియోజకవర్గాల్లో లింగాయత్ ల ప్రభావం..
మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్న కర్నాటకలో దాదాపు 100 నియోజకవర్గాల్లో లింగాయత్ ల ప్రభావం అధికం. రాష్ట్ర జనాభాలో వీరు 17 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పక్షాలు లింగాయత్ లకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. ఇప్పటివరకూ కర్నాటక రాష్ట్రానికి 23 మంది సీఎంలు పనిచేశారు. అందులో పది మంది లింగాయత్ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. 1989 వరకూ లింగాయత్ లు కాంగ్రెస్ వైపే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లింగాయత్ లను తప్పించి బీసీ వర్గానికి ముఖ్యమంత్రి పదవి కేటాయించడంతో బీజేపీ వ్యూహాత్మకంగా యాడ్యూరప్పకు ప్రోత్సాహం అందించింది. దీంతో అప్పటి నుంచి బీజేపీ వైపు లింగాయత్ లు టర్న్ అయ్యారు. ఆ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారిపోయారు. అయితే మిగిలిన సామాజికవర్గాలకు సంబంధించి వక్కలిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18 శాతం, ముస్లింలు 12.9 శాతం, బ్రాహ్మణులు 3 శాతంగా ఉన్నారు. అయితే లింగాయత్ లు 9 శాతం, వక్కలిగలు 8 శాతం మాత్రమే ఉన్నట్టు మిగతా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

బీజేపీకి అదే టర్నింగ్ పాయింట్…
దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేసిన తొలి రాష్ట్రం కర్నాటక. 1989 వరకూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1989 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడు వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సొంతం చేసుకుంది. 224 స్థానాలకుగాను 178 సీట్లను సొంతం చేసుకుంది. కానీ వీరేంద్ర పాటిల్ అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్న సమయంలో రాజీవ్ గాంధీ వెనుకబడిన తరగతులకు చెందిన బంగారప్పను సీఎంగా డిక్లేర్ చేశారు. ఇదే బీజేపీ బలపడానికి టర్నింగ్ పాయింట్ గా పరిశీలకులు అభివర్ణిస్తారు. తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 34 సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చింది. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పకు నాయకత్వ పగ్గాలు అప్పగించడంతో ఓట్లు, సీట్లు పెంచుకుంటూ వచ్చింది. దాదాపు లింగాయత్ వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి.

Karnataka Assembly Elections 2023

2008లో తొలిసారిగా పవర్ లోకి…
తొలిసారిగా 2003లో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ జేడీఎస్ తో అధికారాన్ని పంచుకోవడానికి డిసైడ్ అయ్యింది. కానీ యడ్యూరప్ప సీఎంగా అయ్యేందుకు జేడీఎస్ నేత కుమారస్వామి అభ్యంతరం తెలపడంతో అప్పటి ప్రభుత్వ కూలిపోయింది. 2008లో మాత్రం యాడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ 110 స్థానాల్లో గెలుపొంది తొలిసారిగా కర్నాటకలో అధికారంలోకి వచ్చింది. 2013లో మాత్రం బీజేపీ దారుణంగా దెబ్బతింది. 40 స్థానాలకే పరిమితమైంది. యడ్యూరప్ప బీజేపీకి దూరమై దారుణంగా దెబ్బతీశారు. కర్నాటక జనతా పక్ష పేరిట కొత్త పార్టీని ప్రారంభించి 10 శాతం ఓట్లు సాధించారు. కానీ సీట్ల పరంగా 6 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు. సరిగ్గా 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో 104 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. దీంతో యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 75 ఏళ్లు దాటిన వారు కీలక పదవుల్లో ఉండరాదన్న బీజేపీ నిబంధనతో సీఎం పదవిని వదులుకున్నారు. దీంతో లింగాయత్ వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైనే సీఎంగా బీజేపీ డిక్లేర్ చేసింది. లింగాయత్ లో మంచి పట్టున్న యడ్యూరప్పకే ఇప్పుడు బీజేపీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. దీంతో యడ్యూరప్పకు దీటుగా లింగాయత్ ల అభిమానాన్ని చూరగొనేందుకు కాంగ్రెస్, జేడీఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దీంతో కర్నాటక రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి.