Delhi Liquor Scam- MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల వారసురాలు, బతుకమ్మకు బ్రాండ్ అంబాసిటర్‌గా చెప్పుకుంటున్న కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న వేళ.. ఆమె అనుచరుడు, ఇప్పటికే తీహార్‌జైల్లో ఉన్న అరుణ్‌పిళ్లై ట్విస్ట్ ఇచ్చారు. తాను కవితకు బినామీని అని పలుమార్లు ఈడీకి చెప్పిన పిళ్లై తాజాగా వాంగ్మూలం ఉప సంహరణకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది.
29 సార్లు ఈడీ ముందుకు..
ఏడాది క్రితం వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్‌గ్రూప్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ, సీబీఐ గుర్తించాయి. దీంతో దర్యాప్తు సంస్థల దృష్టంతా సౌత్‌గ్రూప్‌పై పడింది. ఈ కేసులో పలువురిని విచారణ చేసిన దర్యాప్తు సంస్థలు హైదరాబాద్‌కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేశాయి. అంతకుముందు పిళ్లైని ఈడీ 29 సార్లు విచారణ చేసింది. 11 సార్లు స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. ఈ క్రమంలో పిళ్లైని కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో రామచంద్ర పిళ్లైని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా పేర్కొంది. ఈ విషయాన్ని పిళ్లై అంగీకరించినట్లు తెలిపింది. రిమాండ్ రిపోర్టులోనూ భారీ కిక్‌బ్యాక్‌ల చెల్లింపులు మరియు సౌత్ గ్రూప్‌కు చెందిన అతిపెద్ద కార్టెల్ ఏర్పాటుకు సంబంధించిన మొత్తం స్కామ్‌లో పిళ్లై కీలకమైన వ్యక్తులలో ఒకరని పేర్కొంది.
కవిత విచారణ వేళ మాట మార్చి..
తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని పదే పదే ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చిన పిళ్లై తాజాగా ప్లేట్ మార్చారు. తాను గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఉప సంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవితను ఈడీ విచారణ చేయనున్న వేళ పిళ్లై పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
ముగ్గురినీ కలిపి విచారణ చేసే యోచనలో ఈడీ..
లిక్కర్ స్కాంలో దూకుడుగా ఉన్న ఈడీ ఈనెల 11న ఈ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లైతోపాటు తెలంగాణ ఎమ్మెల్యే కవితను కలిపి విచారణ చేయాలని భావిస్తోంది. ఇందులో మనీశ్ సిసోడియా, అరుణ్‌పిళ్లైని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో పిళ్లై ప్లేట్ ఫిరాయించడం ఆసక్తిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది.