BRS Fight: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిన్న ఖమ్మంలో పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేరువేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. భారీగా కార్యకర్తలతో సమీకరణలు నిర్వహించారు. విందు భోజనం కూడా పెట్టారు.. ఇదే సమయంలో తేల్చకుంటే తేల్చుకుంటాం అనే సంకేతం వచ్చేలా వారిద్దరు మాట్లాడారు. అంతేకాదు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కూడా ఐదు మండలాల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసి అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. అయితే కారులో పోరు అనేది కేవలం ఈ జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అంతటా ఇదే పరిస్థితి ఉంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నప్పటికీ… అసమ్మతి లోపల నివురుగప్పిన నిప్పులా ఉంది.

50 నియోజకవర్గాల్లో..
ఎన్నికలకు ముందే అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిలో టికెట్లకు కుస్తీ మొదలైంది. కొన్నిచోట్ల బహిరంగంగానే వివాదాలు జరుగుతున్నాయి.. మరి కొన్నిచోట్ల అంతర్గతంగా చిచ్చు రాజుకుంటున్నది.. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోటే… పార్టీకి చెందిన ఇతర నేతలూ టికెట్ ఆశిస్తున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సభాపతులు, కార్పొరేషన్ పదవుల్లో కొనసాగిన వారు.. ఇలా చాలామంది వరుసలో ఉన్నారు.. బరిలో దిగే అవకాశం ఇస్తారా? లేకుంటే కారు దిగి దారి మార్చాలా? అన్న తెగింపు తోనూ కొందరు ఉన్నట్టు సమాచారం. గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు ఈసారి రాజీ పడే ప్రశ్న లేదని తమ అనుచరులతో చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు, టిడిపి తరఫున గెలిచిన వారిలో సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు, వైరాలో స్వతంత్రంగా గెలిచిన రాములు నాయక్, రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన కోరుట్ల చందర్ భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారంతా ఈసారి టికెట్ మాకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈసారి రాష్ట్రంలో రాజకీయం కొంత మారుతున్న పరిస్థితి ఉండడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రం పై బలంగా గురి పెట్టడం వంటి పరిణామాలు రేసులో ఉన్న తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి. ప్రత్యామ్నాయ అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తుండడంతో ఈసారి టికెట్ తెచ్చుకున్నాడో, లేక తెగించుడో అన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. స్థూలంగా చెప్పాలంటే కారు ఓవర్ లోడ్ పరిస్థితే ఆ పార్టీకి కొంత సమస్యగా మారనుంది.
ఈ నియోజకవర్గాల్లో కత్తి మీద సామే
హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్… ఏ ఉమ్మడి జిల్లా తీసుకున్నా భారత రాష్ట్ర సమితిలో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది.. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల విభేదాలు ఇప్పటికే రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఆ సీటు ఆశిస్తున్నారు. పరిగి నుంచి కొప్పుల మహేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా… డి సి సి బి చైర్మన్ మనోహర్ రెడ్డి ఇక్కడి నుంచే సీటు అడుగుతున్నారు. వికారాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉండగా.. జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ బరిలో నిలవాలనే ఆకాంక్షతో ఉన్నారు. ఇక్కడి నుంచే డాక్టర్ ఆనంద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉండగా… మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి టికెట్ అడుగుతున్నారు.. చేవెళ్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు పోటీగా మాజీ మంత్రి కేఎస్ రత్నం ఉన్నారు.. రాజేంద్రనగర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ ఉన్నారు.. ఇదే టికెట్ కావాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పట్టుబడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం సెగ్మెంట్ విషయంలో ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయంతో ఉన్నారు.. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

క్యామ మల్లేష్, చంద్రశేఖర్ రెడ్డి ఈ టికెట్ ఆశిస్తున్నారు. షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు పోటీగా మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి రేసులో ఉన్నారు . కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గా కెపి వివేకానంద ఉండగా.. ఈ సీటును ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కోరుతున్నారు. ఉప్పల్ లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ తో రామ్మోహన్ మధ్య పొసగ డం లేదు. అదే సమయంలో బండ లక్ష్మారెడ్డి కూడా ఇక్కడ సీటు అడుగుతున్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇక్కడ మొదటి నుంచి భారత రాష్ట్ర సమితి ఇన్చార్జిగా ఉన్న మన్నే గోవర్ధన్ రెడ్డి ఈ సీటు దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో మాత్రమే తక్కువ పోటీ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలకు ముందే భారత రాష్ట్ర సమితిలో లుకలుకలు మొదలయ్యాయి. దేశంలో చక్రాలు తిప్పాలని బయలుదేరుతున్న కేసీఆర్… ఇంట్లో పరిస్థితిని ఎప్పుడు చక్కదిద్దుకుంటారో మరి.