Amith Shaw AP BJP: తొందరపడి ఓ టీడీపీ కోయిలా ముందే కూసింది. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీతో, ఇటు జనసేనతో పొత్తు పెట్టుకొని వెళదామని చంద్రబాబు బోలెడు కలలుగన్నాడు. ఇక అధికార వైసీపీ.. కేంద్రంతో సయోధ్యతో ఉంటూ జగన్ కేసులు, ఇతర విషయాల్లో సహకార ధోరణితో వెళతున్నారు. బీజేపీ మద్దతు తమకంటే తమకు అని ఏపీలోని ప్రధాన పక్షాలైన వైసీపీ, టీడీపీలు తగవులాడుకుంటున్నాయి. కానీ ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు, జగన్ కు షాకిచ్చారు. ఏపీలో తమది ఇరు పార్టీలకు సమాన దూరం అని తేల్చిపడేశాడు. ఈ పరిణామం వైసీపీ, టీడీపీ నేతలకు షాకింగ్ గా మారింది.
ఇన్నాళ్లు రాష్ట్రంలో అధికార వైసీపీతో కేంద్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోందని అంతా భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ఏపీ పర్యటనతో దీనిపై క్లియర్ కట్ మెసేజ్ వచ్చేసింది. ఏపీలో ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని.. అలాగే టీడీపీతోనూ సమానదూరం కొనసాగించాలని బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్ధేశం చేశారు. అదేసమయంలో ఏకంగా మిషన్ 2024 కోసం బీజేపీ భవిష్యత్ కార్యాచరణపై కూడా అమిత్ షా ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. దీంతో అమిత్ షా తిరుపతి టూర్ తో ఏపీ రాజకీయాల్లో స్పష్టమైన క్లారిటీ వచ్చేసినట్టైంది.
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటి కోసం తిరుపతి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో బీజేపీ పరిస్థితిపై రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఇతర నేతలను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఏపీలో ఒంటరి పోరుకే అమిత్ షా మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించుకున్నట్టు తెలిసింది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని జనాల్లో నమ్మకం కలిగించాలని అమిత్ షా సూచించారు. ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పారు..
ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడాలని అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా హితబోధ చేశారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించారు. ఏపీ విభజన బిల్లు అంశాలపై కూడా చర్చించారు. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందన్నారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని.. దీనిపై కుడా పోరాటం చేయాలని సూచించారు.
మొత్తంగా అమిత్ షా పర్యటనతో ఒక్కటి మాత్రం క్లియర్ కట్ గా అర్థమైంది. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో కలిసేది లేదని.. పొత్తులకు ఆస్కారం లేదని.. ఒంటరిగానే బీజేపీ వెళ్లాలని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్టు అయ్యింది. మరి ఈ పరిణామంతో ముఖ్యంగా టీడీపీ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.