Amit Shah: అమిత్ షా వచ్చారు. వెళ్లారు. కానీ ఆయన మీటింగ్ లపై అర్థాలు పరమార్థాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్లు అమిత్ షా మీటింగ్ ను అన్వయించుకుంటున్నారు. ఇంతటి భారీ చర్చకు దారితీసేలా అమిత్ షా వ్యూహాత్మకంగా వ్యవహించారు మరీ. అటు మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు.. ఇటు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఏకకాలంలో కలవడంతో ఎవరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం ద్వారా అమిత్ షా డైరెక్టుగా టీడీపీని ఇరుకునపెట్టినట్టైంది. ఎందుకంటే ఇదే టీడీపీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనపెట్టింది. వాళ్ల తాత స్థాపించిన పార్టీని హైజాక్ చేసిన చంద్రబాబు ఇప్పుడు వాళ్లకే ఇవ్వడానికి సిద్ధంగా లేడు. మరోవైపు తన వారసుడు లోకేష్ శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఇలాంటి టైంలో బామ్మర్ధి బాలయ్యను లొంగదీసుకొని ఎన్టీఆర్ ను దూరం పెట్టడంలో సక్సెస్ అయ్యారు.
ఇక రాజకీయాలు వదిలి జూనియర్ ఎన్టీఆర్ బుద్దిగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఒక్క మీటింగ్ తో అమిత్ షా.. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయ తెరపై ఊపు ఊపేస్తున్నారు. జూనియర్ కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేకున్నా కానీ ఈ బీజేపీ పెద్ద తెచ్చే పనిలో పడ్డారు. జూనియర్ ను కూడా టీడీపీని దెబ్బకొట్టడంతోపాటు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కమ్మవర్గాన్ని ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు.
తెలంగాణపై ఫోకస్ చేసిన అమిత్ షా ఇక్కడ బలంగా ఉన్న సీమాంధ్రులు, కమ్మ వర్గాన్ని ఆకర్షించే పనిలో పడ్డారు. డైరెక్టుగా చంద్రబాబు పంచన చేరడం బీజేపీకి ఇష్టం లేదు. ఓడిపోయి ఫేడ్ అవుట్ అయిన చంద్రబాబుతో దోస్తీకి బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు. అటు జగన్ ను దూరం పెట్టలేరు. అందుకే తెలంగాణలోని కమ్మ వారిని ప్రస్తుతం బీజేపీకి ఫేవర్ గా లాగడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కమ్మ వారిని బీజేపీకి అనుకూలంగా మార్చే ఎత్తుగడను అమిత్ షా చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలోని సీమాంధ్రుల మద్దతు కోసమే జూనియర్ ను, ఇటు రామోజీరావును మచ్చిక చేసుకునే పనిలో పడ్డట్టు అర్థమవుతోంది.
గత ఎన్నికల్లో కమ్మ వర్గం వారంతా గులాబీ పార్టీ వైపే నిలిచారు. చంద్రబాబు ఇక్కడ పోటీచేయకపోవడం.. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినా కానీ కమ్మ వారంతా గులాబీ పార్టీకే ఓటేశారు. ఈసారి వారందరినీ బీజేపీ వైపు తిప్పడానికి అమిత్ షా ఇలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి జూనియర్ తో, రామోజీతో కమ్మ వారంతా బీజేపీ వైపు టర్న్ అవుతారా? చంద్రబాబును కాదని మద్దతిస్తారా? అన్నది వేచిచూడాలి.