Amit Shah- Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను పరామర్శించేందుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా కదిలివస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న.. బీజేపీ నేత అయిన కృష్ణంరాజు మరణంతో ఆ పార్టీ తరుఫున పరామర్శకు అమిత్ షా రానున్నారు. కృష్ణంరాజు వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన మరణం నేపథ్యంలోనే అమిత్ షా వస్తున్నట్టు తెలుస్తోంది.

ఈనెల 16న హైదరాబాద్ రానున్న అమిత్ షా అదే రోజు కృష్ణంరాజు కుటుంబసభ్యులను కలిసి పరామర్శించనున్నారు. అదేరోజు సాయంత్రం హీరో ప్రభాస్తో అమిత్ షా ప్రత్యేకంగా భేటి అవుతారు.
ఈనెల 17న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు అమిత్ షా వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఇంటికెళ్లి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఇప్పటికే మునుగోడు సభ కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా నాడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటి కావడం సంచలనమైంది. ఇప్పుడు ప్రభాస్ తో సానుభూతి భేటి ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ను పరామర్శించడంతోపాటు బీజేపీకి లబ్ధి కలిగేలా టాలీవుడ్ అంతా బీజేపీ వైపునకు తిప్పుకునేందుకు అమిత్ షా ఈ ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ భేటి కేవలం పరామర్శనేనా? ఏదైనా కోణముందా? అనేది తెలియాల్సి ఉంది.