
America Taliban :అప్ఘనిస్తాన్(Afghanistan) ను ఈనెల 15న తాలిబన్లు ఆక్రమించుకున్నారు. త్వరలో వారి పాలన ప్రారంభం కాబోతుంది. ముందుగా తాలిబన్లు ప్రజలకు క్షమాభిక్ష పెడుతున్నామని.. తాము అప్ఘన్ లో ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని చోట్ల మాత్రం తాలిబన్ల ఆగడాలు ఆగడం లేదు. తమ వ్యతిరేకులను కాల్పిపారేస్తున్నారు. ఈ పరిస్థితి చూసిన చాలా మంది అప్ఘాన్ వాసులు దేశం విడిచి పారిపోతున్నారు. ఈ తరుణంలో తాలిబన్లపై మరో చర్చ మొదలైంది. నేటి తాలిబన్లు పాత వారిలా లేరని, ఇప్పుడున్న వారంతా అమెరికా తొత్తులని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనే మరో ఉగ్ర సంస్థ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కాబూల్ ఎయిర్ పోర్టుపై తాజాగా రెండు ఆత్మాహుతి దాడులు చేసింది. ఈ మేరకు కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. అలాగే అమెరికాతో తాలిబన్ల సీక్రెట్ ఒప్పందంపై కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఐఎస్ ఉగ్రసంస్థ బయటపెట్టడం సంచలనమైంది. అంతేకాకుండా వీరు జిహాదీని తొక్కిపెట్టడానికే ప్రయత్నిస్తున్నారని కొన్ని వీడియోలు ప్రసారం అవుతున్నాయి.
ఆగస్టు 15న తాలిబన్లు దేశాన్ని ఆక్రమించిన తరువాత ఈనెల 19 నుంచి ఈ వీడియోలు ప్రసారం అవుతున్నాయి. అమెరికా తొత్తులుగా, తోడుదొంగలుగా తాలిబన్లు కొనసాగుతున్నారని ఐఎస్ ప్రధాన ఆరోపణ. ఎందుకంటే తాలిబన్లతో ఒప్పందం చేసుకునే అమెరికా అప్ఘనిస్తాన్ నుంచి వైదొలిగింది. వాళ్లు డేట్ ఫిక్స్ చేసిన మరుక్షణం తాలిబన్లు దేశాన్ని ఆక్రమించేశారు. ఈక్రమంలోనే అప్ఘనిస్తాన్లో పరిణామాలు అమెరికా వ్యూహాత్మకంగా చేసిందని ఇది తాలిబన్ల విజయం కాదని ఐఎస్ ఆరోపిస్తోంది. ఎందుకంటే అమెరికా జిహాద్ కన్నా చర్చలు మేలు అనే భావనను ప్రోత్సహించడంతో విజయం సాధించిందని అంటున్నారు. మొత్తం 22 రకాల ప్రచార కథనాలతో కూడిన ఐఎస్ పోస్టర్లు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఇవన్నీ ఐఎస్ అనుకూల మీడియా నుంచే రావడం గమనార్హం.
అయితే ఈ కథనాలపై కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. అంతకుముందు ఐఎస్ కథనాల్లో ఒక నిర్ధిష్ట హ్యాష్ ట్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు వెలువడిన వాటిలో అలాంటిది కనిపించలేదు. మరోవైపు ఐఎస్ అనుకూల మీడియా గ్రూప్ అయిన ‘తలై అల్ అన్సాన్’ ఈ అంశంపై ‘అపోస్టేట్ తాలిబాన్’ అని హ్యాట్ ట్యాగ్ పెట్టింది. మరో మీడియా అన్ అసవిర్తి నుంచి విడుదల చేసిన వీడియోలో ఓ వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడుతుంటాడు. తాలిబన్లు అమెరికా తొత్తులుగా మారారని అంటాడు. అయితే ఆల్ ఖైదా మద్దతుదారులు, అలాగే యెమెన్ గ్రూపుకు చెందిన వారు మాత్రం తాలిబన్లది ‘చారిత్రాత్మక విజయం’ అని అంటున్నారు.
ఇక ప్రచారంలో ఉన్న చాలా పోస్టర్లలో దోహాలో జరిగిన సమావేశాలకు సంబంధించినవే ఉన్నాయి. అలాగే షియా పండుగలకు హాజరు కావడం వంటి తాలిబాన్ ‘అతిక్రమణ’ల చిత్రాలను పోస్టర్లతో జతపరిచారు. ఐఎస్ అనుకూల వ్యక్తులే ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారని తెలుస్తోంది. వీరిలో అల్ బత్తర్, తలాయే అల్ అన్సార్ ప్రధానంగా ఉన్నారు. ఇక పోస్టర్లు విడుదల చేసిన వారిలో అల్ ముర్హాఫత్, అల్ తక్వా, హదమ్ అల్ అశ్వర్, అల్ అడియాత్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడున్న తాలిబన్లు 20 సంవత్సరాల కింద ఉన్నవారు కాదని ఈ వీడియోల్లో కొందరు ఆరోపిస్తున్నారు. అప్పుడు ముల్లా ఒమర్ నాయకత్వంలో ఉండేదని, ఇప్పుటి తాలిబన్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఇక ఇప్పుడున్న తాలిబన్లను ‘ముల్లా బ్రాడ్లీ ప్రాజెక్టు’ అని ఐఎస్ మద్దతుదారులు పేర్కొంటున్నారు. అంటే జిహాదీ ఉద్యమాన్ని లోపలి నుంచే నిర్వీర్యం చేసేందుకు అమెరికాయే స్వయంగా కొందరు జిహాదీస్టులను రంగంలోకి దించారని అంటున్నారు. అమెరికా నియమించిన కొందరితో పాటు కొందరు ముస్లిం ప్రముఖులు జిహాదిస్టుల ప్రాజెక్టును అమలు చేస్తున్నారన్నారు.
ఈ వీడియోల్లో ఇంగ్లీష్ మాట్లాడే జీహాదీ వ్యక్తి అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా తాను అనుకున్న పని చేసింది. తాలిబన్ కొత్త సిద్దాంతాన్ని ప్రవేశపెట్టి ముల్లా ఒమర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసేలా ప్లాన్ వేసింది. ఈ ప్రణాళికతో వారు ఇస్లామిక్ ఖలీఫా స్థాపనను కోరుకుంటున్నారు. తద్వారా ప్రపంచంలోని ఇస్లామిక్ స్టేట్ తో అమెరికా పోరాటం సులభతరం అవుతుంది’ అని అన్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే అమెరికానే తాలిబన్లను ప్రోత్సహించి అక్కడ వారికి అధికారం దక్కేలా చేసిందని.. తాలిబన్ల వెనుక అమెరికా ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది.