Ambedkar Vardhanti: చెప్పేవి శ్రీరంగ నీతులు.. సొచ్చేవి —-గుడెసలు అన్నట్టుగా ఉంది నేతల తీరు. ఇప్పుడు దేశానికి సేవ చేసిన వారి జయంతులు, వర్థంతులు వస్తే చాలు మైక్ అందుకొని తెగ ఉపన్యాసాలిస్తారు. వారి చిత్రపటాలు, విగ్రహాలను పూలతో నింపేస్తారు. కానీ వారి ఆశలు, ఆశయాలు మాత్రం కొనసాగించడంలో విఫలం అవుతుంటారు.
ఈరోజు బాబాసాహేబ్ మరణించిన రోజు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నేతలంతా ఆయనను కొనియాడుతున్నారు. పూలదండలతో అంబేద్కర్ విగ్రహాలను ముంచెత్తుతున్నారు. ఆయన మార్గం ఆచరణీయం అని కొనియాడుతున్నారు.
దేశంలో దళితులు, బలహీన వర్గాలు, ఇతర పేదలకు రిజర్వేషన్లు దక్కి ఇప్పుడు వారంతా ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది అంబేద్కర్ చలవే. ఆయన రాసిన రాజ్యాంగమే భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ అసమానతలు తొలిగిపోయాయంటే అది అంబేద్కర్ చలవే.
అలాంటి అంబేద్కర్ ఇప్పుడు ముఖ్యంగా దళితుల పాలిట దేవుడయ్యారు. ప్రతీ దళిత నేత, సామాన్యులు సైతం అంబేద్కర్ ను ఓన్ చేసుకున్నారు. అయితే నేతలు మాత్రం ఆయన జయంతి, వర్థంతికే గుర్తు చేసుకుంటారు. ఇక ఎన్నికలు ఓట్ల కోణంలో దళితజపం చేస్తుంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో దళితులకు రాజ్యాధికారం కల్లేనని చెప్పొచ్చు. తెలంగాణ వస్తే తొలుత దళిత సీఎం అన్న కేసీఆర్ చివరకు తానే కూర్చున్నారు. ఇక ఏపీలో రెడ్డి సామాజికవర్గం సీఎం సీటులో కూర్చున్నారు. బలమైన అగ్ర వర్ణాలకే అధికారం దక్కింది. అల్పులైన దళితులు, బీసీలు వారి పల్లకీలు మోసే వారిగానే ఇప్పటికీ ఉన్నారు.
Also Read: ఆయనతో కలిసి పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు- గమనం హీరో
ఒక బీజేపీలో మాత్రమే బీసీలు, దళితులకు అగ్రతాంబూలం దక్కుతోంది.వారే ఇప్పుడు దేశాన్ని రాష్ట్రాలను ఏలుతున్నారు. మిగతా పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లో అగ్ర వర్ణాలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజకీయ నేతలంతా ఆయనను ఓన్ చేసుకుంటూ ఆహా ఓహో అంటూ కీర్తిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేస్తూ హల్ చల్ చేస్తున్నారు. అంబేద్కర్ అది చేశాడు ఇది చేశాడంటున్న నేతలు ఆయన ఆశయాలను మాత్రం కొనసాగించడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేతల మాటల్లో ఉన్నది చేతల్లో లేదని అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా అంబేద్కర్ ను జపించడం మాని ఆయన ఆశయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: ఎన్టీఆర్ కు వెన్నుపోటు: బాలయ్య కన్నీళ్లకు అర్థం ఉందా?