TDP Janasena Alliance: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ లు పలుమార్లు సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై ప్రాథమికంగా చర్చించారు. అయితే ఇంతవరకు ఇది కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యిందని.. సోషల్ మీడియాలో జాబితాలు హల్ చల్ చేస్తున్నాయి. రెండు పార్టీలు వేర్వేరుగా ధృవీకరిస్తూ జారీచేసిన జాబితాలు వైరల్ అవుతున్నాయి.
టిడిపి-జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 112 స్థానాల్లో.. జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీల హై కమాండ్లు ఒక నిర్ణయానికి వచ్చాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఏయే స్థానాల్లో పోటీ చేస్తాయో జాబితాలో వెల్లడించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరిట ఈ ప్రెస్ నోట్లు విడుదల కావడం విశేషం. అచ్చం ఆ రెండు పార్టీలకు పోలిన లెటర్ హెడ్ లపై ఇరువురు అధినేతలు సంతకం చేస్తూ జారీ చేసినట్లుగా.. ప్రెస్ నోట్లు ఉండడంతో సీట్ల సర్దుబాటు పూర్తయిందని ప్రచారం చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల్లో అయోమయం నెలకొంది.
అయితే ఇది వైసీపీ సోషల్ మీడియా పనేనని.. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని.. ఎవరు దీనిని నమ్మొద్దని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. ఇదంతా వైసిపి కుట్రగా అభివర్ణించారు. ఆ జాబితా ఫేక్ అని తేల్చేశారు. అయితే గతంలో కూడా చంద్రబాబు, లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు పేరిట కొన్ని ప్రెస్ నోట్లు వైరల్ అయ్యాయి. చాలా సందర్భాల్లో వారు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అటు జనసేనకు సైతం ఈ ఫేక్ ప్రెస్ నోట్ల బెడద తప్పలేదు. అందుకే పవన్ ఒకటికి రెండుసార్లు పార్టీ శ్రేణులకు హెచ్చరించారు. ప్రత్యర్థుల ప్రచారాన్ని ధృవీకరించకుండా నమ్మవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా టిడిపి, జనసేన అధినేతల సంతకాలతో పాటు లెటర్ హెడ్లపై ఫేక్ ప్రకటనలు జారీ కావడం విశేషం. ఎన్నికల సమీపిస్తున్న కొలది ఈ ఫేక్ ప్రచారం మరింత ముదిరే అవకాశం ఉంది. తాజాగా అభ్యర్థుల ప్రకటన అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశానికి సంబంధించి టిడిపి, జనసేన సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల జాబితాతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన తామే స్వయంగా వెల్లడిస్తామని స్పష్టం చేసే పరిస్థితి ఉంది. మొత్తానికైతే టిడిపి, జనసేన అభ్యర్థుల ప్రకటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.అయితే ఇందులో నిజం లేదని తేలడంతో ఆ రెండు పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి.
— Telugu Desam Party (@JaiTDP) January 26, 2024