Botsa Satyanarayana: వైసీపీలో టిక్కెట్ల రగడ నెలకొంది. చాలామంది ఆత్మీయులకు సైతం జగన్ టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా సొంత సామాజిక వర్గం నేతలకు జగన్ షాక్ ఇస్తున్నారు. దీంతో వారంతా జగన్ వైఖరిని నిట్టూరుస్తూ ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నారు. వైసీపీలో టికెట్ అంటేనే కష్టమైన తరుణంలో.. సీనియర్ మంత్రి బొత్స కుటుంబానికి ఏకంగా ఐదు టిక్కెట్లు కేటాయించడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది పద్ధతేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వైసీపీ ప్రకటించిన మూడో జాబితాలో మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మికి చోటు దక్కింది. ఆమె విశాఖ పార్లమెంట్ స్థానం ఇన్చార్జిగా నియమితులయ్యారు. మంత్రి బొత్స స్వయంగా ఆమె పేరు ప్రకటించారు. అయితే ఒకే కుటుంబంలో ఎంతమందికి అవకాశం ఇస్తారా అని వైసిపిలో చర్చ ప్రారంభమైంది. జిల్లాలకు జిల్లాలే రాసిస్తే మరి మిగతా నాయకుల పరిస్థితి ఏమిటని ఎక్కువ మంది వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. సామాజిక సాధికారిత అంటూ ప్రకటనలు చేస్తున్న జగన్ కు ఇది తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి వెంట నడిచిన నాయకులను కాదని.. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన బొత్స కుటుంబానికి అంత ప్రాధాన్యం ఇవ్వడంఫై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. జగన్ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన మరోసారి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పేరు సైతం ఖరారు అయ్యే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఝాన్సీలక్ష్మీ విశాఖ ఇన్చార్జిగా ప్రకటించడంతో బొత్స కుటుంబానికి ఐదు టిక్కెట్లు అన్నమాట. ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గెలుపు గుర్రాల పేరిట ఉత్తరాంధ్రను బొత్స సత్యనారాయణ కు రాసిచ్చారా అని వైసిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఇటువంటి నిర్ణయాలు కచ్చితంగా చేటు తెస్తాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ వైఖరి మారుతుందో? లేదో? చూడాలి.