CM Revanth Reddy: రేవంత్ ను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండయ్యా!

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మొత్తం కదిలి వచ్చింది. కానీ కాబోయే మంత్రులకు రేవంత్ రెడ్డి కాకుండా అధిష్టానమే ఫోన్ చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 8, 2023 1:03 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: అది 2004.. కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. అప్పటికే తన మంత్రివర్గంలో ఎవరు ఉండాలో రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారు. వ్యక్తిగతంగా వారికి సమాచారం కూడా పంపించారు. అయితే ఎవరు మంత్రులు అవుతున్నారనే విషయాన్ని అధిష్టానానికి చెప్పాలి కాబట్టి.. తన అంతరంగికుడు కెవిపి రామచంద్రరావు ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మంత్రివర్గ కూర్పును పూర్తిగా వివరించారు. ప్రమాణస్వీకారం రోజున నేరుగా బేగంపేట విమానాశ్రయం వద్దకు వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి వారిని తోడుకొని వచ్చారు.. తన ప్రమాణ స్వీకార సందర్భంగా వారందరి ఆశీస్సులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆనాటి సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి మీద చాలా ఫిర్యాదులు చేసినప్పటికీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఉచిత విద్యుత్తు, ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి పథకాలకు రాజశేఖర్ రెడ్డి రూపకల్పన చేశారు. ఆ పథకాలు నేడు దేశం మొత్తం అమరవుతున్నాయంటే దానికి రాజశేఖర్ రెడ్డి నాడు తీసుకున్న చొరవే కారణం.. అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోజు రాజశేఖర్ రెడ్డిని స్వేచ్ఛగా పని చేసుకోనిచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆ స్వేచ్ఛ ఉందా అంటే ఒకసారి ఆలోచించుకోవలసి వస్తోంది.

నిన్నంతా ఏం జరిగిందంటే..

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మొత్తం కదిలి వచ్చింది. కానీ కాబోయే మంత్రులకు రేవంత్ రెడ్డి కాకుండా అధిష్టానమే ఫోన్ చేసింది. అంతేకాదు ప్రమాణ స్వీకారం లో ఎవరెవరు ముందుకు రావాలో అధిష్టానమే నిర్ణయించింది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించి సోషల్ మీడియాలో నిన్న కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే చివరికి అధిష్టానం రంగంలోకి దిగి ఎవరికీ శాఖలు కేటాయించలేదని పేర్కొంది. మరోసారి అందర్నీ ఢిల్లీకి పిలిపించి అక్కడ శాఖలు కేటాయిస్తామని అధిష్టానం ప్రకటించింది. అంతేకాదు ప్రకటించని కొన్ని శాఖలు కూడా అక్కడే ఖరారు చేస్తామని వివరించింది.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రుల కేటాయింపులు కూడా అధిష్టానం వేలు పెట్టడం ఏంటని వారు తమ అంతరంగీకుల వద్ద వాపోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేది కాదని.. ఇప్పుడు అధిష్టానం ఇలా చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు వాపోతున్నట్టు సమాచారం. అధిష్టానం చర్యలతో రేవంత్ రెడ్డి కూడా ఒకింత ఆగ్రహం గానే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే రేవంత్ రెడ్డిని కూడా పనిచేసుకొనిస్తే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.