Homeఆంధ్రప్రదేశ్‌Alliances in AP: ఏపీలో పొత్తులు లెక్క పక్కా.. వైసీపీకి లాభమా..నష్టమా?

Alliances in AP: ఏపీలో పొత్తులు లెక్క పక్కా.. వైసీపీకి లాభమా..నష్టమా?

Alliances in AP: ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉంది. అప్పుడే పొత్తులపై చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షాల చర్యలు అధికార పక్షంలో హీట్ ను పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దాదాపు కలిసి నడవాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునివ్వడం ద్వారా పొత్తులు ఉంటాయని చంద్రబాబు సంకేతాలు పంపారు. అదే సమయంలో పవన్ పదేపదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వననడం ద్వారా తాను పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెబుతున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు డంబీరకాలు పలుకుతున్నారు. కానీ ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయని, ఒంటరిగా ఎందుకు పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేతలు పదేపదే ప్రశ్నించడం ద్వారా వారిలో నెలకొన్న భయాన్ని సూచిస్తున్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల పొత్తులపై వైసీపీలో రేగుతున్న ప్రకంపనలకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రెండు భిన్నమైన రాజకీయ వ్యూహాలతో ముందుకొచ్చాయి. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో టీడీపీ పోటీ చేయగా జనసేన పార్టీ వాటికి బయట నుంచి మద్దతు ఇచ్చింది. వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగాయి. 2019 ఎన్నికల సమయానికి టీడీపీ కూటమి విచ్ఛిన్నమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఒంటరిగానే పోటీ చేశాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా పొరుగున అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అన్ని రకాలుగా సహకారం అందిందన్నది బహిరంగంగానే కనిపించింది. ఈ కారణంతోనే ఆ రెండు పార్టీలతో వైసీపీ నాయకత్వం ఎప్పుడూ మిత్రత్వ ధోరణితోనే వ్యవహరిస్తూ వస్తోంది. కింది స్థాయిలో ఎప్పుడైనా చిటపటలు వ్యక్తమైనా పై స్థాయిలో సంబంధాల్లో తేడా రాకుండా అధినాయకత్వం చూసుకొంటోంది.

Alliances in AP
Pavan, Somu, Chandra Babu

గత ఎన్నికలకు భిన్నంగా..

గత రెండు ఎన్నికలకు భిన్నంగా 2024 ఎన్నికల్లో ముందస్తు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే పొత్తుల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వైసీపీతో బద్ధవైరంతో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మధ్య సయోధ్య పెరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ పార్టీల శ్రేణులు కలసి పోటీ చేశాయి. విషయం ఆయా పార్టీల నాయకత్వాలకు తెలిసినా అడ్డుపెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య పరస్పర విమర్శలు కూడా బాగా తగ్గిపోయాయి. పొత్తు విషయమై ఇప్పటికిప్పుడు నిర్దిష్టంగా చెప్పలేకపోయినా ఆ వాతావరణం ఏర్పడేలా ఉభయ పార్టీల నాయకత్వాల నుంచి స్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల బహిరంగ ప్రకటన చేశారు. రాజకీయాల్లో పొత్తులనేవి ఉంటూనే ఉంటాయని ఆదివారం చిత్తూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీని ఓడించడానికి టీఆర్‌ఎస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోటీచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ

అయితే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. గుంభనంగా వ్యవహరిస్తోంది. కేవలం జనసేనతో మాత్రమే తమ స్నేహం ఉంటుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. జనసేన కూడా బీజేపీతో మైత్రి కొనసాగిస్తామనే అంటోంది. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం తమపట్ల సానుకూల వైఖరితో ఉందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, జనసేన కూటమిగా పోటీచేస్తే తమకు లాభమని.. టీడీపీతో కలిస్తే కష్టమని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే సీఎం బీజేపీ, జనసేన కూటమి పోటీచేసే వీలుగా కేంద్ర పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల నాటికి అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి తమ కేంద్ర నాయకత్వం తగిన నిర్ణయం తీసుకొంటుందని, దాని ప్రకారమే పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజకీయంగా తాము బలహీనపడితే బీజేపీ తమవైపు ఉంటుందని తాము అనుకోవడం లేదని, మళ్లీ టీడీపీ వైపు మొగ్గుచూపినా ఆశ్చర్యం లేదని అధికార పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంకు గురించి కాకుండా ఎన్నికల్లో వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశముంది. గత ఎన్నికల్లో టీడీపీ కేంద్రంతో అదే నష్టం చేసింది. అటువంటి పరిస్థితి రాకూడదని తప్పించితే.. బీజేపీ ఓటు బ్యాంకు కలిసిపోతుందని వెంపర్లాడడం లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Alliances in AP: ఏపీలో పొత్తులు లెక్క పక్కా.. వైసీపీకి లాభమా..నష్టమా?

ఒంటరైన వైసీపీ

Alliances in AP
Y S Jagan

పోనీ.. మిగతా రాజకీయ పక్షాలతో వెళదామన్నా.. వైసీపీతో కలిసి నడిచేందుకు ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితి. మిగిలిన రాజకీయ పార్టీలు వైసీపీ పట్ల అంత సానుకూలంగా లేవు.దీంతో ఆ పార్టీకి ఒంటరి పోరు తప్పని పరిస్థితి నెలకొంది. తాము ఒంటరిగా ఉండి ప్రతిపక్షాలు ఏకమైతే వాటి బలం పెరుగుతుందన్న ఆందోళనతో వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పొత్తు ఆలోచనలపై దాడి చేస్తున్నారు.దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అంటూ సవాల్ విసురుతున్నారు. పొత్తులతో తప్ప మాపై పోరాడలేరా అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనల్లో భయమే ఎక్కువ కనిపిస్తోందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏకమైతే పైచేయి సాధిస్తాయన్న అనుమానమే వారితో ఈ ప్రకటనలు చేయిస్తోందని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా పైకి ఎలాంటి ప్రకటనలు ఇస్తున్నా అంతర్గతంగా మాత్రం తమ పార్టీ నాయకులు మరీ స్పీడుగా వెళ్లకుండా చూసుకొంటున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ముందు మనం బలపడటం ముఖ్యం. దానిపై దృష్టి పెట్టి పనిచేయండి. పొత్తులపై ఎక్కడా చర్చలు పెట్టవద్దు. ఆ సమయం వచ్చినప్పుడు వాటి విషయం చూసుకొందాం అని అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు.

Also Read: Janasena: స్పీడ్ పెంచిన జనసేనాని.. పవన్ ప్రసంగాల్లో పెరిగిన వాడీవేడీ

Recommended Videos:

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular