TDP Janasena BJP Alliance: రాజకీయాల్లో హత్యలకంటే ఆత్మహత్యలు ఎక్కువ. ఇప్పుడు అటువంటి పరిస్థితినే చంద్రబాబు, పవన్ ఎదుర్కొంటున్నారు. టిడిపి,జనసేన కూటమిలోకి బిజెపి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తు వైసిపికి ఉపయోగపడుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు టిడిపి, జనసేనల నుంచి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ తో జత కట్టడం ద్వారా చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు బలం లేని బీజేపీని నమ్ముకోవడం వృధా ప్రయాస అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ రాజకీయాల్లో బిజెపి ఉనికి అంతంత మాత్రమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఒక్కచోట సైతం డిపాజిట్లు దక్కించుకోలేదు. పోనీ ఈ ఐదేళ్లలో ఏమైనా బలపడింది అంటే అదీ లేదు. పొరుగున తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో పుంజుకుంది కానీ.. ఏపీలో మాత్రం కనీస స్థాయిలో కూడా విస్తరించలేకపోయింది. అటువంటి పార్టీతో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడం లాభం కంటే నష్టమే అధికం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీ ఓటు బ్యాంక్ టిడిపి జనసేనలకు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి జగన్ కు ముస్లిం, మైనారిటీలు అండగా నిలుస్తూ వస్తున్నారు. అయితే జగన్ నాయకత్వాన్ని ఇష్టపడని తటస్తులు టిడిపి వైపు చూసేవారు. ఇప్పుడు అదే టిడిపి బిజెపితో జత కలవడం ద్వారా వీరిని దూరం చేసుకోవడం ఖాయం. మత రాజకీయాలకు పాల్పడే బిజెపితో జత కట్టిన వారిని ఈ వర్గాలు క్షమించే అవకాశం లేదు. అయితే ఇప్పుడు టిడిపి, జనసేన బిజెపి పంచన చేరడంతో మైనారిటీ వర్గాలు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపే ఛాన్స్ ఉంది.ఇదే సమయంలో జగన్ సైతం మైనారిటీలను ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తారనటంలో అతిశయోక్తి కాదు.
ఇప్పటివరకు తెలుగుదేశం విషయంలో వామపక్షాలు సానుకూలంగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు బిజెపితో జతకట్టడంతో తెలుగుదేశం పార్టీని శత్రువుగా చూడాల్సిన అనివార్య పరిస్థితి వామపక్ష పార్టీలకు ఏర్పడింది. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడంతో జగన్ ను వామపక్షాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ విషయంలో తమ అభిప్రాయాన్ని వామపక్షాలు మార్చుకునే అవకాశం ఉంది. నిన్నటి వరకు జగన్ ఓడించాలని పిలుపునిచ్చిన వామపక్షాల నేతలు.. ఇప్పుడు ఆ మాటను నేరుగా అనేందుకు సాహసించరు. అదే సమయంలో టిడిపి, జనసేన తీరును సైతం ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి. వామపక్షాలకు క్షేత్రస్థాయిలో బలం లేకున్నా ప్రజాసంఘాల రూపంలో మాత్రంవాటి బలం పుష్కలం. చంద్రబాబు ఎన్డీఏతో కలవడం ద్వారా ప్రజాసంఘాలలో సైతం మార్పు తప్పదు. చాలావరకు జగన్ వైపు ప్రజా సంఘాలు టర్న్ అయ్యే అవకాశం ఉంది.
ఏపీలో మత ప్రాతిపదికన ఓటు వేయడం అనేది ఎన్నడూ లేదు. హిందుత్వ పేరుతో రాజకీయాలు చేసే బిజెపిని ఏపీ ప్రజలు అంతగా విశ్వసించరు. బిజెపి మతం పేరిట చేసే రాజకీయాలకు హర్షించేవారు చాలా తక్కువ. వ్యతిరేకించేవారు చాలా ఎక్కువ. ఆ వ్యతిరేకులంతా ఇప్పుడు టిడిపి, జనసేనకు తప్పకుండా దూరమవుతారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడికి ముందే పొత్తు కుదరడం ద్వారా వైసీపీకి ప్రయోజనం చేకూరినట్టే. పొత్తు ముమ్మాటికీ టిడిపి, జనసేన లకు పెద్ద దెబ్బ అని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.