AP Politics: ఏపీలో పొత్తుల ఎత్తులు.. చిత్తయ్యేదెవరు? గెలిచేదెవరు?

Alliance Politics in AP : ‘పిల్ల పుట్టకముందే కుల్లకుట్టిన సాత్రం’గా మారింది ఏపీలోని పొత్తుల పరిస్థితి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పొత్తుల పేరిట పార్టీలు రాగం అందుకున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ తొలుత ఈ పొత్తుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జనసేన ఆవిర్భావ సభ సాక్షిగా.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. అవసరమైన వారందరినీ కలుపుకొని పోతానని ప్రకటించారు. అప్పుడు మొదలైన […]

Written By: NARESH, Updated On : June 8, 2022 6:17 pm
Follow us on

Alliance Politics in AP : ‘పిల్ల పుట్టకముందే కుల్లకుట్టిన సాత్రం’గా మారింది ఏపీలోని పొత్తుల పరిస్థితి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పొత్తుల పేరిట పార్టీలు రాగం అందుకున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ తొలుత ఈ పొత్తుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జనసేన ఆవిర్భావ సభ సాక్షిగా.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. అవసరమైన వారందరినీ కలుపుకొని పోతానని ప్రకటించారు. అప్పుడు మొదలైన ఈ ‘పొత్తుల’ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో ముఖ్యంగా అధికార వైసీపీలో ఆందోళన మొదలైంది. దమ్ముంటే ఒంటరిగా పోటీచేయాలని పవన్ కు, చంద్రబాబుకు సవాల్ చేస్తూ వీరు కలవకుండా బాగానే విమర్శలు గుప్పించింది. అయితే మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ పై ‘వన్ సైడ్ లవ్’ చేసిన చంద్రబాబు ఎందుకో పవన్ ముందుకొచ్చినా కూడా కాస్త తటపటాయించారు. ‘మహానాడు’లో టీడీపీకి వచ్చిన ఆదరణ, ఊపు చూశాక అసలు మనకు పొత్తులే వద్దు అని చంద్రబాబు, టీడీపీ నేతలు డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే జనసేనతో పొత్తుల విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేక చంద్రబాబు సైలెంట్ అయ్యారు. ఇక బీజేపీ ఒకసారి మోసం చేసిన చంద్రబాబుతో కలిసేది లేదని.. కేవలం జనసేనాని పవన్ తోనే తమ పొత్తు అని కుండబద్దలు కొట్టేసింది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా కూడా ఒకానొక సందర్భంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే తాజాగా బీజేపీ పెద్దలు ఈ ప్రతిపాదనే లేదని షాకిచ్చారు. దీంతో ఏపీలో పొత్తుల అత్యుత్సాహంలో ఎవరెవరు బలయ్యారు? ఎవరికి ఎఫెక్ట్ అయ్యిందన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-ఏపీలో పొత్తుల గురించి మీడియా అత్యుత్సాహం
ఆంధ్రాలో జనసేన-బీజేపీతో కలిసి టీడీపీ వచ్చేసారి కూటమిగా పోటీచేస్తాయని అధికార వైసీపీ ఓడిపోవడం ఖాయమని కొద్దిరోజులుగా మీడియా హైప్ క్రియేట్ చేస్తోంది. దీంతో జనాలు అంతా ఏపీ రాజకీయాన్ని వైసీపీ వర్సెస్ టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి పోరుగానే అనుకుంటున్నారు. ఈ విషయంలో ఈ నాలుగు పార్టీలు కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే పొత్తులు కుదిర్చి వైసీపీని ఓడిస్తానని అన్నారు. అప్పటి నుంచి మీడియాలో ఒకటే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైసీపీని ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలుస్తాయని.. పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గా బరిలోకి దిగుతారని ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన,టీడీపీ, బీజేపీలో ఐక్యత లేకపోవడం కనిపిస్తోంది.

-ఏపీలో పొత్తులను రాజేసిన పవన్ కళ్యాణ్
ఏపీలో పొత్తుల ఎత్తులను మొదట కదిపించి జనసేనాని పవన్ కళ్యాణ్. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్నారు. టీడీపీని కాదని.. బీజేపీని ఎదురించి బీఎస్పీ, కమ్యూనిస్టులలాంటి వారితో అవగాహన చేసుకొని వెళ్లగా ఓడిపోయారు. ఇక వైసీపీ విధానాలను ఆ పార్టీని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ ను, జనసేనను టార్గెట్ చేసి వేధించడంతో ఇక జగన్ ను గద్దెదించేందుకు ఒక అడుగు వెనక్కి వేసి మరీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఏపీలో ప్రతిపక్షాలను ఒక్కటి చేస్తానని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. జనసేన ఆవిర్భావ సభావేదిక సాక్షిగా వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను కలుపుకుపోతానని ప్రకటించారు. దీంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీలో గుబులు మొదలైంది.

-టీడీపీతో కలిసేందుకు బీజేపీ నై.. వైసీపీపై డబుల్ స్టాండ్
ఇక జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విపక్షాల పొత్తుల్లో టీడీపీని కలుపుకొని పోయేందుకు సిద్ధంగా లేదు. 2019 ఎన్నికల్లో మోడీని గద్దెదించడానికి రాహుల్ గాంధీని పీఎం చేయడానికి చంద్రబాబు వేసిన కుప్పగంతులన్నీ బీజేపీ మదిలో ఇప్పటికీ కదులుతున్నాయి. అందుకే మోసం చేసిన చంద్రబాబుతో ఆ పార్టీతో కలిసేందుకు సిద్ధంగా లేమని బీజేపీ చెబుతోంది. జనసేనతో ఓకే కానీ.. టీడీపీతో మాత్రం నాట్ ఓకే అంటోంది. ఇక కేంద్రంలో వైసీపీతో జగన్ తో సాన్నిహిత్యంగా ఉంటున్న బీజేపీ పెద్దలు.. ఇక్కడ ఏపీకి వచ్చేసరికి అదే వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. జనసేనతో సారూప్యంగా ఉంటూ టీడీపీని, వైసీపీని వ్యతిరేకిస్తున్నారు.ఈ రెండు రకాల స్ట్రాటజీతో బీజేపీ కేవలం జనసేనతో మాత్రమే పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

-పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిత్వం సందిగ్ధం
అప్పట్లో సోము వీర్రాజు స్వయంగా పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా కూడా తెరపైకి తెచ్చారు. అలా ఒప్పుకుంటేనే టీడీపీతో పొత్తు అని ప్రచారం సాగింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జీవీఎల్ లు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిత్వంపై ఇంకా ఖరారు కాలేదని.. అమిత్ షా చూసుకుంటారని ట్విస్ట్ ఇచ్చారు. సో బీజేపీ స్టాండ్ అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. టీడీపీతో కలిసి సాగేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. అలాగే జనసేనాని పవన్ ను సీఎం క్యాండిడేట్ గా అంగీకరించడం లేదని తెలుస్తోంది.

-పవన్ ‘సీఎం’ అభ్యర్థిత్వంపై ట్విస్ట్.. అమిత్ షా తేలుస్తాడన్న జేపీ నడ్డా.. 
ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఇదే సూటి ప్రశ్న ఎదురైంది. బీజేపీ-జనసేన కూటమి తరుఫున సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారా? అని ప్రశ్నించగా.. అసలు అలాంటి ఆలోచన ఏమీ లేదని.. అమిత్ పొత్తులు.. సీఎం క్యాండిడేట్ పై నిర్ణయిస్తారని సమాధానాన్ని దాటవేశారు. ఇక బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ అయితే అసలు పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గా ఇప్పుడే అనుకోవడం లేదంటూ మాట్లాడారు.. దీన్ని బట్టి బీజేపీ అసలు పవన్ కళ్యాణ్ ను తమ కూటమి సీఎం క్యాండిడేట్ గా గుర్తించడం లేదని జనసైనికుల్లో ఆందోళన మొదలైంది. బీజేపీతో కలిసి సాగుదామా? బయటకు వద్దామా? అని కొందరు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. ఇక జేపీ నడ్డాను కొందరు బీజేపీ నేతలు ప్రభావితం చేశారని.. పవన్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించకుండా కుట్ర చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. బీజేపీ పెద్దల రూట్ మ్యాప్ ప్రకారం పవన్ వెళతాడాని ఇప్పుడు ఇలా మాట్లాడడం వెనుక కొందరి హస్తం ఉందని జనసేన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

-బీజేపీ -టీడీపీతో జతకడుతారా?
ఇక ఏపీలో బీజేపీ వ్యవహార శైలి చూస్తుంటే.. పవన్ ను సీఎం క్యాండిడేట్ గా అంగీకరించడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కలుస్తుందా? అంటే డౌటేనంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో చంద్రబాబు ఆసక్తి చూపించినా.. ఆయన చేసిన మోసం.. వ్యవహారశైలి చూసి టీడీపీకి బీజేపీ దగ్గరవ్వడం కష్టమేనంటున్నారు. చంద్రబాబు నాటి ఎన్నికల పరిస్థితులు చూసి ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చే రకం. ఆయనను నమ్మి బీజేపీ ఏపీలో పొత్తు పెట్టుకోవడం కష్టమేనంటున్నారు.

-వైసీపీతో బీజేపీ జతకడుతుందా?
పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించడంలో తాత్సారం చేస్తున్న బీజేపీ చూపు వైసీపీ వైపు ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కేంద్రంలోని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో ఏపీ సీఎం జగన్ సాన్నిహిత్యంగా ఉంటున్నారు. బిల్లులు, ఇతర విషయాల్లో వైసీపీ మద్దతును పార్లమెంట్ లో బీజేపీ తీసుకుంటోంది. కేంద్రంలో సాన్నిహిత్యంగా ఉంటున్న వీరు.. ఏపీలో మాత్రం కలహించుకుంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రతీసారి జగన్ ను టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే కేంద్రంలో వచ్చేసారి సీట్లు తగ్గితే.. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం.. అందుకే వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకున్నా ఏపీ రాజకీయాల్లో మాత్రం వైసీపీతో సాన్నిహిత్యమే కోరుకుంటుందని చెబుతున్నారు. అది ఏపీలో పొత్తుకు దారితీయకపోయినా వైసీపీకి వ్యతిరేకంగా మాత్రం బీజేపీ ఉండదన్న సంకేతాలు అందుతున్నాయి. దీంతో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ వ్యవహార శైలి మారడం వెనుక కారణం ఇదేనని అనుకుంటున్నారు.

మొత్తంగా రాజకీయ అవసరాలే పార్టీలను పొత్తులకు పురిగొల్పుతున్నాయి. ఏపీలో వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేయాలని పవన్ కళ్యాణ్.. ఇక ఒంటరిగా పోటీచేస్తే గెలుస్తామని టీడీపీ.. అవసరార్థం బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు బీజేపీ కాచుకు కూర్చుంది. ఈ క్రమంలోనే ఏపీలో పొత్తు పొడుపులు ఇప్పుడే పొడవడం కష్టమేనంటున్నారు. వచ్చే ఎన్నికల వేళ బలబలాలను బట్టి ఈ పొత్తులు ఎత్తులు చోటుచేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Videos: