Excise Department Transfers: దండిగా ఆదాయం లభించే శాఖలో ఎక్సైజ్ శాఖ ఒకటి. అందుకే ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే అధికారులు, సిబ్బంది బదిలీ చేసుకుంటారన్న అపవాదు అయితే ఉంది. ప్రస్తుతం ఓ వైపు సాధారణ బదిలీలు కొనసాగుతుంటే ఎక్సైజ్‌శాఖలో అంతర్గత బదిలీలంటూ ప్రభుత్వం మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఒకే శాఖలో స్థానచలనం కల్పించడం కాకుండా రెండు ముక్కలైన ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ల మధ్య బదిలీల పేరుతో ఉన్నతాధికారులు హడావిడి చేస్తున్నారు. ఈ బదిలీల వ్యవహారాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తుంటే, కొందరు అధికారులు ఎలాగైనా నిబంధనలు సడలించి మరీ రెండు శాఖల మధ్య బదిలీలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఒక్కటిగా ఉన్న ఎక్సైజ్‌ను వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు ముక్కలు చేసింది. ఉద్యోగులను విభజించి 30:70 నిష్పత్తిలో ఎక్సైజ్, సెబ్‌లకు పంపిణీ చేసింది. గత మే నెలతో సెబ్ ఏర్పాటై రెండేళ్లు పూర్తయ్యింది.
చేతివాటం..
ఎక్సైజ్‌శాఖ ఉద్యోగుల బదిలీలను ఒకరిద్దరు అత్యున్నత అధికారులు ఆర్థికంగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూల్స్‌కి విరుద్ధంగా బదిలీల ప్రక్రియను చేపట్టినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కోశాఖకు ఒక్కో నిబంధన ఉంది. ఐదేళ్లు ఒకే చోట పని చేస్తూ వుంటే తప్పక బదిలీ జరగాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం ఎక్సైజ్‌శాఖలో బదిలీలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖలో బదిలీలను సొమ్ము చేసుకునే పనిలో ఒక ఉన్నతాధికారి ఉన్నట్టు విమర్శలున్నాయి. ఇంత వరకూ బదిలీలకు మూడేళ్ల కాలపరిమితి ఉండగా, తాజాగా దాన్ని రెండేళ్లకు కుదించడం ఆరోపణలకు బలం కలిగిస్తోంది.సెబ్ నుంచి ఎక్సైజ్‌కు వస్తామని అక్కడి ఉద్యోగులు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. పోలీసుల దగ్గర ఎక్సైజ్ సిబ్బంది ఇమడలేకపోతున్నారని తెలిసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా తాము సెబ్‌లో పని చేస్తున్నామని, కావున తమను ఎక్సైజ్‌కు పంపాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిజానికి మూడేళ్ల వరకూ ఎవర్నీ కదిలించకూడదు.
Also Read: Agneepath Scheme: అగ్నిపథ్’ అల్లర్లకు చెక్ చెప్పేదెలా? ఇలా చేయాలంటున్న నిపుణులు
సెబ్ నిబంధనల ప్రకారం ఏఈఎస్ నుంచి ఆ పై స్థాయి అధికారులను రెండేళ్ల తర్వాత బదిలీ చేయొచ్చు. దీంతో ఇప్పుడు కొందరు అధికారులు తాము ఎక్సైజ్‌లోకి వెళ్తామని, తమను బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఏఈఎస్ కింది స్థాయిలో బదిలీలు చేయాలంటే మూడేళ్లు పనిచేయాలనే నిబంధన ఉంది. దీంతో పై స్థాయి అధికారుల వరకే అయితే బదిలీలు చేయరేమోనని భావించిన కొందరు అధికారులు కింది స్థాయి అధికారుల బదిలీలు చేపట్టాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయిస్తున్నారు. తమ వరకే అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పక్కనపెట్టే అవకాశం ఉందని గమనించి, కిందిస్థాయి నుంచి అందరితోనూ ఈ డిమాండ్ పెట్టించారని ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. అధికారుల స్థాయిలో అయితే తక్కువ మందిని బదిలీ చేస్తే సరిపోతుందని, సీఐ నుంచి కింది స్థాయి అంటే వేల మందికి స్థానచలనం కల్పించాల్సి వస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ.. మొత్తం బదిలీలంటేనే ప్రభుత్వం స్పందించి, సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రమాణికం లేకుండా..
ఈ క్రమంలోనే ఎలాంటి డిమాండ్లు లేకపోయినా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, సీఐలు ఏ శాఖలో ఉంటారో నిర్ణయించుకోవాలంటూ సెబ్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం సెబ్ స్టేషన్ల వారీగా ఆప్షన్లు తీసుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతమందిని బదిలీ చేస్తారు? దానికి ప్రామాణికం ఏంటి? అనేది ఇంకా ఖరారు కాలేదు. కాగా 50ఏళ్లు దాటిన వారికి మాత్రమే బదిలీ అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సెబ్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున వయసు మళ్లిన వారిని ఎక్సైజ్‌కు పంపాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.ఈ మొత్తం వ్యవహారం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎక్సైజ్‌లో ఖాళీగా ఉన్న డిస్టిలరీ జాయింట్ కమిషనర్ పోస్టు కోసం ఇద్దరు అధికారులు పోటీపడుతున్నారు. ప్రస్తుతం సెబ్‌లో ఉన్న ఓ అధికారిణి ఎలాగైనా ఎక్సైజ్‌లోకి రావాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆమె సొంత లాభం కోసం డిమాండ్‌ను శాఖాపరంగా మొత్తంగా పెట్టించారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల పలు విషయాల్లో ఆ అధికారిణి శాఖలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కొత్తగా రాబోయే బార్ పాలసీలో ప్రయోజనం ఉంటుందనే కోణంలోనూ ఈ బదిలీల కోసం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఇక బదిలీల క్రమంలో ముడుపుల వ్యవహారం కూడా ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తనకు అధికార పార్టీ నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉందని, తాను ఏం చెబితే అది జరుగుతుందని, ఆ మహిళా అధికారి.. ఉన్నతాధికారులను కూడా పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
భారీగా సొమ్ము..
ఈ నేపథ్యంలో మూడేళ్ల నుంచి రెండేళ్లకు నిబంధన సడలించడం వెనుక భారీ మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.75 లక్షలు హోదాను బట్టి అధికారులకు ముట్టజెప్పినట్టు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. బదిలీ కోసం ఎవరెవరు ఎంతెంత మొత్తం ఇచ్చారనే చర్చ ఎక్సైజ్‌శాఖలో విస్తృతంగా జరగడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే నిబంధనలు మార్చారనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖకు పట్టిన అవినీతి మత్తును వదిలించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలనేది ప్రభుత్వ ఆశయం. ఎక్సైజ్‌శాఖలో బదిలీలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Also Read:Presidential Election: బీజేపీ అకర్ష్ మంత్రం.. సొంత బలంతోనే రాష్ట్రపతి ఎంపికకు యత్నం
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Allegations over transfer guidelines in the excise department
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com