Telugu News Papers : 2024 కల్లా తెలుగు వార్త పత్రికలన్నీ మూత

Telugu News Papers : వార్తాపత్రికలు… పెట్టుబడిదారుల విషపుత్రికలని వెనుకటికి ఓ దిగ్గజ పాత్రికేయుడు సెలవిచ్చారు.. అప్పట్లో దీనిపై చాలామంది నొసలు చిట్లించుకున్నారు.. కానీ వాస్తవ పరిస్థితి అదే. రాజకీయ పార్టీలకు ఎన్ని రంగులు ఉన్నాయో.. అంతకు మించిన రంగులు వార్తాపత్రికలు ఉన్నాయి.. నచ్చినవాన్ని నెత్తిన పెట్టుకోవడం.. నచ్చనివాన్ని రాయి పెట్టి కొట్టడం తెలుగు వార్తాపత్రికలకు రివాజ్ గా మారింది.. ఏకంగా ప్రభుత్వాలను శాసించే స్థాయికి పత్రికాధిపతులు ఎదిగారంటే వారి పరపతి ఏ స్థాయిలో పెరిగిందో అర్థం […]

Written By: NARESH, Updated On : January 9, 2023 8:12 pm
Follow us on

Telugu News Papers : వార్తాపత్రికలు… పెట్టుబడిదారుల విషపుత్రికలని వెనుకటికి ఓ దిగ్గజ పాత్రికేయుడు సెలవిచ్చారు.. అప్పట్లో దీనిపై చాలామంది నొసలు చిట్లించుకున్నారు.. కానీ వాస్తవ పరిస్థితి అదే. రాజకీయ పార్టీలకు ఎన్ని రంగులు ఉన్నాయో.. అంతకు మించిన రంగులు వార్తాపత్రికలు ఉన్నాయి.. నచ్చినవాన్ని నెత్తిన పెట్టుకోవడం.. నచ్చనివాన్ని రాయి పెట్టి కొట్టడం తెలుగు వార్తాపత్రికలకు రివాజ్ గా మారింది.. ఏకంగా ప్రభుత్వాలను శాసించే స్థాయికి పత్రికాధిపతులు ఎదిగారంటే వారి పరపతి ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.. రామోజీరావు దగ్గరకు పెద్దపెద్ద రాజకీయ నేతల వెళ్తుంటారు కానీ… వారి వద్దకు ఆయన వెళ్లిన సందర్భాలు దాదాపు అరుదు.. ఇక రాధాకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా బోలెడు.

-డిజిటల్ మీడియా దూసుకొస్తోంది

మార్పునిత్యం, మార్పు సత్యం, మార్పు శాశ్వతం… ఇది మీడియా కూడా వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రింట్ మీడియాకు. ఉదయం లేస్తే ఏకపక్ష వార్తలతో పాఠకులను తప్పుదోవ పట్టిస్తుండడంతో పత్రికలపై ప్రజలకు ఏవగింపు కలుగుతోంది.. దీనికి కోవిడ్, రష్యా నుంచి పేపర్ దిగుమతి నిలిచిపోవడంతో పత్రికారంగం కుదేలయ్యే స్థాయికి వచ్చింది. అంతటి కోవిడ్ సమయంలో పత్రిక యాజమాన్యాలు ఖర్చు తగ్గింపు పేరుతో ఉద్యోగులను మెడపట్టి బయటకు గెంటేశాయి.. ఈ సమయంలో వారిని డిజిటల్ మీడియా ఆదుకుంది. అదే కనుక లేకుంటే చాలామంది జర్నలిస్టులు వీధిన పడేవారు. ఇక రోజు రోజుకు డిజిటల్ మీడియా విస్తృతి పెరిగిపోతుండడంతో ప్రింట్ మీడియా నేల చూపులు చూస్తోంది. ఈ పరిస్థితి అర్థమై పత్రిక యాజమాన్యాలు డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నాయి.

-తాజా నోటిఫికేషన్ అదే

ఈనాడులో ఇటీవల జర్నలిజం కళాశాల నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎందుకు సంబంధించి నియామక ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఇంటర్వ్యూ సమయంలో ఈనాడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఎడిటర్లు ” మీరు కచ్చితంగా డిజిటల్ మీడియాలో పని చేసేందుకు సంసిద్ధులు కావాలి. శిక్షణ కూడా మీకు అదే విధంగా ఉంటుందని” అభ్యర్థులకు వెల్లడించారు.. అయితే ఇప్పటి బ్యాచ్ లో ఐదు లేదా పది మందిని మాత్రమే జనరల్ డెస్క్ కి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విధంగా ఉంది. ప్రస్తుతం ఆ పత్రిక జనరల్ డెస్క్ లో సబ్ ఎడిటర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుత బ్యాచ్ లో కొంతమందికి శిక్షణ ఇచ్చి ఈ ఎన్నికలు జరిగే వరకు వారితో పని చేయించుకోవాలని యాజమాన్యం యోచిస్తోంది. ఇక ఈ బ్యాచ్ లో చాలామందిని కూడా డిజిటల్ జర్నలిజంలో శిక్షణ ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపాల్ కు యాజమాన్యం సూచించినట్టు సమాచారం.

-కోవిడ్ దెబ్బ కొట్టింది

ఇక కోవిడ్ కాలంలో ప్రింట్ మీడియా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది. ప్రకటనలు రాకపోవడంతో యాజమాన్యాలు జీతాల్లో అడ్డగోలుగా కోత విధించాయి. ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసాయి. జిల్లా ఎడిషన్ లను పూర్తిగా ఎత్తివేసాయి.. కవర్ ప్రైస్ ని కూడా భారీగా పెంచేశాయి.. ఎన్నికల సమయం వరకు పత్రికలను నడిపి తర్వాత మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు ప్రింట్ మీడియా జర్నలిజం లో ఈనాడును చూసి వాత పెట్టుకునే మిగతా పత్రికలు… ఇప్పుడు రామోజీరావు ఏం చేస్తాడా అని ఎదురుచూస్తున్నాయి.. ఇప్పటికే రామోజీరావు అన్నదాత మ్యాగ్జిన్ ను మూసేశాడు. ప్రస్తుతం ఆ కాంపౌండ్ లో ఈనాడు మాత్రమే ప్రింట్ అవుతోంది.. ఇక త్వరలో ఏం జరగబోతోంది? పెద్ద బేతాళ ప్రశ్న ఏం కాదు.