Kaleshwaram Project: కాళేశ్వరంపై కేసీఆర్ వన్నీ కట్టు కథలే.. అసలు వాస్తవాలు ఇవీ

ముఖ్యమంత్రి చెప్పినట్టు కాలేశ్వరం ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్ లు 2018 లో పూర్తయ్యాయి. అప్పటినుంచి ఈనెల 25వ తేదీ వరకు అంటే ఐదు సంవత్సరాలలో ఎత్తిపోసిన నీరు 168 టీఎంసీలు. ఇందులో మళ్లీ వరదల కారణంగా తిరిగి గోదావరిలోకి వదిలేసిన నీళ్లు 118 టీఎంసీలు. ఈ ప్రకారం మిగిలింది 50 టీఎంసీలు.

Written By: Bhaskar, Updated On : July 27, 2023 8:39 am

Kaleshwaram Project

Follow us on

Kaleshwaram Project: “80 వేల కోట్ల ఖర్చుపెట్టి కాళేశ్వరం కడితే దాని బాకీ ఎప్పుడో తీరిపోయింది. వడ్లు ఉస్కె లెక్క పుట్లకు పుట్లు పండుతున్నాయి. కాలేశ్వరం వల్ల కొత్తగా మాగాణి కూడా అందుబాటులోకి వచ్చింది” ఇవీ సోమవారం కెసిఆర్ మాట్లాడిన మాటలు. నిజానికి ఈ మాటలు నమస్తే తెలంగాణకు, పింక్ మీడియాకు, భజనకు అలవాటుపడ్డ భారత రాష్ట్ర సమితి నాయకులకు రుచించవచ్చుగాక.. పాలాభిషేకాలు చేసేందుకు, జయహో అంటూ నినదించేందుకు కారణమవ్వచ్చుగాక.. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి అలా కాదు. నిజానికి కాలేశ్వరం బాకీ ఇప్పట్లో తీరేది కాదు. ఎవరు ఏమనుకున్నా అది ముమ్మాటికి తెలంగాణ ఆర్థికానికి ఒక తెల్ల ఏనుగు.. ప్రాజెక్టు కట్టేందుకు ప్రభుత్వం తాను తీసుకున్న అప్పు మొత్తాన్ని తిరిగి కట్టేసిందా? ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సరఫరా చేసిన నీటితో పండిన పంటలతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అందనంత స్థాయిలో పెరిగిందా? సదరు పంటల ద్వారా రైతులు పడ్డారా? ఇన్ని మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానాలు భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్పగలరా? ముమ్మాటికీ చెప్పలేరు. ఎందుకంటే క్షేత్రస్థాయి పరిస్థితి అలా లేదు కాబట్టి.

ప్రభుత్వం చెల్లించలేదు

పంటల ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరిగినప్పటికీ దానికి కాలేశ్వరం ప్రాజెక్టు కారణం కాదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాతిపదిక కూడా ఏమిటనే దానికి జవాబు లేదు. ముఖ్యమంత్రి అలా ప్రకటించగానే ఆ డబ్బా నమస్తే తెలంగాణ పేజీలకొద్దీ వార్తలు ప్రచురించింది కానీ.. అందులో స్తుతి కీర్తనలు తప్ప అసలు విషయం లేదు. ఎన్నికలు వస్తున్నందున అసత్యాలు, అర్ధ సత్యాలు మొదలయ్యాయి. ఇవి ఇంకా పెరుగుతాయి, ఇందుకు కాలేశ్వరం మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్య నిదర్శమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పదిసార్లు గుర్రం, గుర్రం అనడం ద్వారా గాడిదను గుర్రం చేయాలనే ఎత్తుగడలో ఇది కూడా భాగమని, కాలేశ్వరం ప్రాజెక్టును అద్భుతం అని అభివర్ణించడానికి పడుతున్న పాట్లు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నిజానికి ఏం మాట్లాడారంటే..

సోమవారం కేసీఆర్ మాట్లాడుతూ “తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడిప్పుడే బాగుపడింది. రైతు దగ్గర పంట బాగా పండి, షావుకార్ల గల్లా కళకళలాడుతోంది. డ్రెస్ కొనుక్కునేవాడు రెండు డ్రెస్సులు కొంటడు. అన్ని రకాల డబ్బు మార్కెట్లోకి వస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి అంతా రిటర్న్ వచ్చింది” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం కెసిఆర్ వ్యాఖ్య పాక్షికంగానే సత్యం. నాలుగైదు సంవత్సరాలుగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసిన సంఘటన తెలిసిందే.. దీనికి తోడు, మిషన్ కాకతీయ కారణంగా రాష్ట్రంలో పంటలు పడ్డాయి. జీఎస్ డి పి పెరిగింది. ఇందుకు కాలేశ్వరం ప్రాజెక్టు కారణం కాదు. మరీముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.. వ్యాపారుల గల్లా కళకళలాడుతోందన్నది పూర్తిగా నిజం. కానీ రైతు బాగుపడ్డాడు అన్నది మాత్రం అర్ధ సత్యం. ఎందుకంటే వరి రైతును ధాన్యం తరుగు పేరిట అడ్డగోలుగా దోపిడీ చేశారు. రైతు అమ్మేసుకున్న తర్వాత మిర్చి రేటు పెంచారు. పసుపు పూర్తిగా వ్యాపారుల చేతిలోకి వెళ్లిన తర్వాత ధర అమాంతం పెరిగింది. ఇక పత్తి రైతు అధిక సాంద్రత విధానంలో సాగు చేసినప్పటికీ ఒడ్డున పడలేదు. ఇస్తామని చెప్పిన పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు. వర్షాలు, వరదలు సరేసరి. ఇక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరిగేందుకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసే నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ఎంతవరకూ కారణమని ప్రశ్నిస్తే.. దానికి సంతృప్తికరమైన సమాధానం దొరకదు.

ఎంతవరకు పూర్తయినట్టు?

ముఖ్యమంత్రి చెప్పినట్టు కాలేశ్వరం ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్ లు 2018 లో పూర్తయ్యాయి. అప్పటినుంచి ఈనెల 25వ తేదీ వరకు అంటే ఐదు సంవత్సరాలలో ఎత్తిపోసిన నీరు 168 టీఎంసీలు. ఇందులో మళ్లీ వరదల కారణంగా తిరిగి గోదావరిలోకి వదిలేసిన నీళ్లు 118 టీఎంసీలు. ఈ ప్రకారం మిగిలింది 50 టీఎంసీలు. సగం అంటే 25 టీఎంసీలు మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ, నాయక సాగర్ లో నిల్వ ఉన్నాయి. అంటే కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఐదు సంవత్సరాలలో సాగుకు అందించిన నీళ్లు 25 టీఎంసీలు. ఒక్క టిఎంసితో పదివేల ఎకరాలు పండుతాయి అనుకుంటే మొత్తం సాగైన భూమి 2.5 లక్షల ఎకరాలు. ఇందులో వరి పంట సాగు చేస్తే పెట్టుబడి పోను ఎకరాకు రైతుకు మిగిలేది 20,000. అంటే ఆ నీటి ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 500 కోట్లు. కానీ వాస్తవంలో రెండున్నర లక్షల ఎకరాలకు నీరు చేరలేదు. ప్రాజెక్టు ద్వారా సృష్టించిన కొత్త ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలని తేలింది. 2020_21 రబీ ప్రణాళిక ప్రకారం కాలేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన 35,838 ఎకరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చారు. యాసంగి సీజన్లో కాలేశ్వరం ప్రాజెక్టు కింద 74,200 ఎకరాలకే సాగునీరు అందించారు. అయితే అందులో 19,700 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యాయి. 54 వేల 500 ఎకరాల్లో వరికి నీళ్ళు ఇచ్చారు. అంతా కూడా సివమ్(రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ) తేల్చిన లెక్క. ఈ ప్రకారం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా లభించిన ప్రయోజనం నామమాత్రమే. స్థిరీకరణ ఆయకట్టు కింద ఖాతాలో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, సింగూరు, నిజాంసాగర్, మిడ్ మానేరు, కడెం ప్రాజెక్టు వంటి వాటి లెక్కలు వేసుకున్నారు.. అసలు సింగూరుకు కాలేశ్వరం నీరే చేరలేదు.. మిగిలిన ప్రాజెక్టులన్ని ఐదేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తి నిండుతున్నాయి. కాలేశ్వరం నుంచి పొరపాటున వీటిలోకి ఎత్తిపోసిన గోదావరి నీటిని తిరిగి మళ్లీ నదిలోకే వదిలేయాల్సి వస్తోంది.

సాగయింది 1.25 లక్షల ఎకరాలే

“కాలేశ్వరం రుణాలకు నాలుగు సంవత్సరాలలో చెల్లించిన వడ్డీ 9,098 కోట్లు. కరెంటు బిల్లుల ఖర్చు 6500 కోట్లు. ఇవి రెండూ కలిపితే 16,928 కోట్ల ఖర్చు. కానీ సాగయింది 1.25 లక్షల ఎకరాలు. ఒక ఎకరంలో వరి పండించేందుకు 13 లక్షల మూడువేల 840 రూపాయలు ఖర్చయింది”. ఇటీవల తెలంగాణ జేఏసీ లెక్క తేల్చింది..ఇక కాగ్ కూడా కాలేశ్వరం బండారాన్ని బయటపెట్టింది.. స్థాయిలో నీటిని ఎత్తిపోస్తే కాలేశ్వరంలో ఈట విద్యుత్ చార్జీలకే 11359 కోట్లు ఖర్చు అవుతుందని, రుణాల చెల్లింపుకు ఏటా సరాసరిన 14 వేల కోట్లు ఖర్చవుతుందని, మొత్తం 25 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని లెక్క తేల్చింది.. మరి దీని ప్రకారం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెరిగే ఆర్థిక అభివృద్ధి మాత్రమే నిపుణులు చెప్తున్నారు.

ఆదాయం లెక్క తప్పింది

ఇక కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం పారిశ్రామిక అవసరాలకు నీరు అందించడం ద్వారా 4530.56 కోట్లు, ప్రాజెక్టు వెంట తాగునీటి అవసరాలకు అందించడం ద్వారా 56.63 కోట్లు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీరు అందించడం ద్వారా 424.74 కోట్లు కలిపి ఏటా 5,011.93 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈ ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి 250 కోట్ల ఆదాయం కూడా రాలేదు. అందుకే ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వం తన ఖాతా నుంచి చెల్లిస్తోంది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో కాలేశ్వరం ప్రాజెక్టు వట్టిపోయింది. కేంద్రం విధించిన నిబంధన వల్ల ఆర్ఇసి, పీఎఫ్సీ సంస్థల నుంచి రుణాలు ఆగిపోయాయి. అటు ఆదాయం లేకపోవడం, ఇటు అప్పులు పుట్టకపోవడంతో కాలేశ్వరం కార్పొరేషన్ పరిస్థితి దయనీయంగా మారింది. క్షేత్రస్థాయిలో ఇంతటి దుస్థితి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తీరిపోయిందని చెప్పడం నిజంగా హాస్యాస్పదం.