Telangana- National Parties: దసరా నాడు జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొత్తం పూర్తి చేశామని ఆయన చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో షర్మిల పార్టీ మినహా మిగతా వన్నీ జాతీయ పార్టీలే. ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీలు ఉండటం, మరికొన్ని పార్టీలు తమకు తాముగా జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ప్రాంతీయ పార్టీగా పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది..కొత్త పేరు, కొత్త అజెండాతో ముందుకు వస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత కెసిఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇక ఈ పరిణామంతో తెలంగాణలో దాదాపుగా అన్ని పార్టీలూ జాతీయ పార్టీలే కానున్నాయి. బిజెపి, కాంగ్రెస్, సీపిఐ, సిపిఎం ఇప్పటికే జాతీయ పార్టీలుగా చలామణి అవుతున్నాయి. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నవే. అయితే వీటిలో కొన్నింటికి ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వకున్నా.. అవి ఒకటికి మించిన రాష్ట్రాల్లో పోటీ చేస్తూ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నాయి.

ఇంతకీ గుర్తింపు పొందాలంటే ఏం చేయాలో తెలుసా
జాతీయ పార్టీలుగా పేర్కొంటూ ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించవచ్చు. జాతీయ పార్టీగా రిజిస్టర్ చేయించుకోవచ్చు. రాష్ట్రాల్లో పోటీ కూడా చేయవచ్చు. వాటిని ఎన్నికల సంఘం గుర్తించాలంటే నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి. ఒక రిజిస్టర్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లను సంపాదించాలి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గాని, లోక్సభ ఎన్నికల్లో గాని పోలై చెల్లిన ఓట్లల్లో ఈ మేరకు ఓట్లు రావాలి. అంతేకాకుండా నాలుగు ఎంపీ సీట్లు కూడా గెలవాలి. దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలవాలి. ఈ రెండు శాతం సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడో నిబంధన ప్రకారమే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉంది. ఇక ఒక రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఉండటం కూడా అంత తేలిక కాదు. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 6% ఓట్లు తెచ్చుకోవాలి. రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి. 6% ఓట్లతో పాటు ఒక ఎంపీ స్థానం గెలిచి ఉండాలి.. ఇవే కాక ఇలాంటివే మరికొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధన ప్రకారం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందితే జాతీయ పార్టీగా కూడా గుర్తింపు వస్తుంది. మొత్తంగా చెప్పాలంటే జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో నిర్దేశించిన ప్రజాబలం ఉండాలి.
Also Read: JanaSena-TDP: ఏపీలో జనసేన గెలవబోయే సీట్లు ఇవే.. లీక్ చేసిన టీడీపీ
ప్రయోజనం ఏమిటి
జాతీయ పార్టీగా గుర్తింపు పొందితే ప్రయోజనం ఏంటంటే.. దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోటీ చేసినా అన్నిచోట్ల ఒకే గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయిస్తుంది. అంటే ఒకే గుర్తుపై దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవచ్చు. పోటీ కూడా చేయవచ్చు. ఇదే క్రమంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలలో ఉచితంగా ప్రచారం లభిస్తుంది.. ఓటర్ల జాబితాను కూడా ఉచితంగా అందజేస్తారు. అంతేకాకుండా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి తక్కువ ధరకు భూమిని కేటాయిస్తారు.
ఇప్పటివరకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఇవే
ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు 8 ఉన్నాయి.. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సీపీఎం, బీఎస్పీ, తృణముల్ కాంగ్రెస్, ఎన్ సి పి, నేషనల్ పీపుల్స్ పార్టీ… నేషనల్ పీపుల్స్ పార్టీ ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పీకే సంగ్మా గతంలో మేఘాలయ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈయన దివంగత పీకే సంగ్మా కుమారుడు. గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వారిలో శరద్ పవార్ తో పాటు సంగ్మా కూడా ఒకరు. అయితే సంగ్మా కూడా ఎన్సీపీ నుంచి వచ్చి ఎన్ పీపీ పెట్టారు.

ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొందింది. ఈ కారణం వల్లే ఆ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. కాంగ్రెస్ నుంచి విడిపోయి ఏర్పాటైన ఎన్సిపి, ఎన్పీపీ రెండూ జాతీయ పార్టీ సాధించడం విశేషం. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ గతంలో ఎప్పుడో జాతీయ పార్టీ హోదా సాధించాయి. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనంతరం సాధించే ఓట్లను బట్టి గుర్తింపు పై ఎన్నికల సంఘం సమీక్ష చేయనుంది. అప్పటివరకు ఇవి జాతీయ పార్టీలుగానే కొనసాగుతాయి. అయితే ఈ జాబితాలో చేరాలని కెసిఆర్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీని ప్రకటించాలని ఉవ్విళ్ళురుతున్నారు. ఇప్పటికైతే పెద్దగా ఇబ్బంది లేకున్నా.. మునుముందు రోజుల్లో ఎన్నికల సంఘం ఎటువంటి నిబంధనలు తీసుకుంటుందో.. దానిపైన టిఆర్ఎస్ జాతీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
Also Read:5G Revolution: క్రేజీ 5 జీ వచ్చింది; దీనివల్ల ఏం మార్పులు జరుగుతాయో తెలుసా?