AP Cabinet Expansion: ఆయన ఏంచేసినా మంచే చేస్తారు. మంచిగానే ఆలోచిస్తారు. తమకు రాజకీయ జీవితం ఇచ్చారు. ఊహించని స్థానమిచ్చారు…రెండు రోజుల కిందట తాజా మాజీలు మీడియా ముందు ఇచ్చిన బిల్డప్ ప్రకటనలివి. సీఎం జగన్ పై విపరీతమైన స్వామిభక్తిని చాటుకున్నారు. కానీ వారు మనుషులే కదా. రెండు రోజులు చేతిలో పదవి లేకపోయేసరికి వారికి తత్వం బోధపడింది. పదవి పోయే సరికి మైండ్ బ్లాక్ అయ్యింది.నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి అలకలో ఉన్నారు, బొత్స నొచ్చుకుంటున్నారు, బుగ్గన బుంగమూతి పెట్టారు, బూతులు వల్లించే కొడాలి మౌనం దాల్చారు, వ్యంగ్యాలు సంధించే పేర్ని బాధ పడుతున్నారు, మౌన ముని బాలినేని భగ్గుమన్నారు, కురసాల కలత చెందారు.

క్రిష్ణదాస్ కటకటలాడుతున్నారు. అవంతి ఆనందంలో లేరు. అంతేగా..అంతేగా.. మూడు రోజుల్లో ఏం మార్పు అంటూ సహచర ఎమ్మెల్యేలే ఎద్దేవా చేసుకునేటంతగా మన తాజా మాజీల పరిస్థితి తలకిందులైంది. మూడేళ్ల పాటు నేల విడిచి సాము చేసిన ఈ మాజీలకు ఇప్పుడు సహచర ఎమ్మెల్యేలు గుర్తుకొస్తున్నారు. అన్న ఎలా ఉన్నావ్? ఏమిటి పరిస్థితి అంటూ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. మూడేళ్లలో ఎక్కడ పలకరిస్తే ఏ పనిచేయాల్సి ఉంటుందో? ఏ ఫెవర్ ఆశిస్తున్నారో? అంటూ వారితో మాట్లాడేందుకే ఇష్టపడ లేదు. అటువంటిది ఉన్నపలంగా ప్రేమను ఒలకబోస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు పట్టించుకునే వారు భుజంపై చేయివేసి మాటామటా కలుపుతున్నారు. మనమంతా ఒకటేనని చెబుతున్నారు. ఓరీ నీ యేషాలు.. అంటూ సహచర ఎమ్మెల్యేలు ఆవాక్కవుతున్నారు. ఏది జరిగిన మన మంచికేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: AP CM Jagan: వెంట్రుక కూడా పీకలేరు.. జగన్ ధైర్యం వెనుక కారణమేంటి?
సీఎంలోనూ అంతర్మథనం
అటు సీఎం జగన్ లో కూడా అంతర్మథనం ప్రారంభమైంది. ‘అంతా నా ఇష్టం. నాకు తిరుగే లేదు. నేను చెప్పిందే వేదం. చేసిందే శాసనం’..మూడేళ్లుగా సీఎం జగన్ తీరును ఒక్కసారిగా మారిపోయిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలు పెట్టినప్పుడు, ‘అంతా నా చేతిలోనే ఉంది. అందరూ నా దారిలోనే ఉన్నారు’ అని జగన్ భావించారని… ఆ తర్వాత సీన్ మారిపోయిందని చెబుతున్నారు. కొందరు సీనియర్ల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురయ్యే సరికి.. జగన్కు దిమ్మదిరిగినంత పనైందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట తీరు మారింది. అందరితో రాజీనామాలు చేయిస్తూనే…. ‘2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. అనుభవం కలిగిన నేతల సేవలు పార్టీకి అవసరం. అలాగే… మంత్రివర్గంలోనూ సీనియర్ల సేవలు కావాలి. సామాజిక సమీకరణలూ చూడాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రులుగా కొంతమంది పాతవారికీ అవకాశం ఉంటుంది’’ అని జగన్ చెప్పారు. ‘కొందరు’ అన్నారేగానీ… ఎందరనేది చెప్పలేదు. కానీ… సీనియర్ల ఒత్తిడికి తలొగ్గినట్లు స్పష్టమైన సంకేతాలు పంపారు. అంతకుముందే… సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, గుమ్మనూరి జయరామ్తోపాటు జగన్కు ప్రత్యేక ఆపేక్ష ఉన్న ఆదిమూలపు సురేశ్ మళ్లీ మంత్రులు అవుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు… వీరితోపాటు పలువురు సీనియర్లకూ కేబినెట్లో ‘మళ్లీ చాన్స్’ దక్కుతుందని తెలుస్తోంది.

ఎమ్మెల్యేల్లో చులకన
ఆయన చెబుతున్నదేమిటి? చేస్తున్నదేమిటి? అని సీఎం జగన్ తీరును సొంత పార్టీ ఎమ్మెల్యేలేప్రశ్నిస్తున్నారు. తొలుత రెండున్నరేళ్ల కాలమే మంత్రి పదవులని జగన్ సెలవిచ్చారు. ఆ రెండున్నరేళ్లు కాస్తా… మూడేళ్లయింది! యాభై శాతం మంది.. 90 శాతానికి, ఆ తర్వాత మొత్తం అందరినీ తీసేస్తామనే దాకా వెళ్లింది. ఆ తర్వాత… నలుగురైదుగురు కొనసాగుతారనే గుసగుస మొదలైంది. ఇప్పుడు… ఏకంగా పది మందిదాకా పాత ముఖాలే కేబినెట్లో ఉంటారనే మాట వినిపిస్తోంది. రాజకీయాల్లో నేనే అనే మాటకు చోటుండదని…
మనం అంటేనే కాస్తా బలముంటుందన్నవాస్తవాన్ని, కఠోర సత్యాన్ని జగన్ తెలుసుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలే సూచిస్తున్నారు. ‘ఒక్క వేటుతో అందరినీ తీసెయ్యడం’ మాటల్లో చెప్పినంత ఈజీ కాదని చెబుతున్నారు. మూడేళ్ల కిందట పాలన ప్రారంభించినప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అటు మంత్రులు, ఇటు సీఎం తీరును అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ‘పులి భయపడుతోంది. శాకాహారిగా మారిపోయి వంకాయ కూర తింటోంది’ అని రాజకీయ విశ్లేషకులు, నెటజెన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
[…] Also Read: తెగ బిల్డప్ ఇచ్చారు.. రెండు రోజులకే తె… […]
[…] Also Read: తెగ బిల్డప్ ఇచ్చారు.. రెండు రోజులకే తె… […]