Railway Passengers: తక్కువ ఖర్చులో సుదూరం ప్రయాణించడానికి రైలు ప్రయాణమే ఉత్తమమైన మార్గం. కొన్ని ప్రాంతాల్లో కేవలం రైలు ప్రయాణాలపైనే ఆధారపడతారు. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఎలాంటి అలసట ఉండదు. అంతేకాకుండా చార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఎంత దూరమైనా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే రైలు ప్రయాణం చేసే సమయంలో రైల్వే బోర్డ్ విధించే నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల నియమాలను రైల్వే బోర్డ్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా టికెట్ల బుకింగ్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను తీసుకొస్తుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకోవడానికి మూడు నెలల ముందే సెర్చ్ చేస్తూ ఉండాలి. ఈ సమయంలో ఏ ట్రైన్ అవైలబుల్ ఉందో దానిని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుపతి, ముంబై, ఢిల్లీ వంటి ముఖ్యమైన ప్రాంతాలకు నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ రూట్లో ఎప్పుడూ టికెట్ల డిమాండ్ ఉంటుంది. ఆయా రూట్లో రిజర్వేషన్ టికెట్స్ రిలీజ్ చేసిన వెంటనే బుకింగ్ అయిపోతాయి. అయితే కొందరు అక్రమార్కులు కొన్ని సాఫ్ట్వేర్ల ద్వారా ఈ టికెట్లను బుక్ చేసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు వీటిని దక్కించుకునే అవకాశం లేకుండా పోయింది.
అయితే ఈ సమస్యను గుర్తించిన రైల్వే బోర్డ్ తాజాగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఎవరైతే రైల్వే టికెట్ బుక్ చేసుకుంటారో.. వారి ఆధార్ అతెంటికేషన్ తప్పనిసరిగా చేసింది. అంటే ప్రయాణికులు ఎవరైనా IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలని అనుకుంటే తమ ఆధార్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఇప్పటివరకు తత్కాల్ టికెట్లకు ఉంది. ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ టికెట్లకు కూడా వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సాధారణ ప్రయాణికులు సైతం సొంతంగా టికెట్ బుక్ చేసుకుని అవకాశం ఉంటుంది. ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.
ఉదాహరణకు తిరుపతికి వెళ్లాలని అనుకునే వారు 60 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే.. తమ ఆధార్ ను తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొందరు ట్రావెల్స్ ఏజెన్సీలు టికెట్లను పక్కదారి పట్టించే అవకాశం ఉండదు. అంతేకాకుండా సాధారణ ప్రయాణికులు సైతం నేరుగా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్ బుకింగ్ లో ఆధార్ అథెంటికేషన్ లేకపోవడంతో కొంతమంది ఎక్కువగా టికెట్స్ బుక్ చేసుకుని ఇతరులకు బ్లాక్ లో అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి కొత్తగా ఈ నిబంధనలు తీసుకొచ్చింది.