Advocate Akhilesh Dubey Scam: వ్యవస్థ పకడ్బందీగా ఉంటే ఎవరైనా సరే హద్దూ అదుపులో ఉంటారు. అదే వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను ఆధారంగా చేసుకొని.. అందులో ఉన్న లొసుగులను చూసుకునేవారు అడ్డగోలుగా సంపాదిస్తారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో వ్యక్తి అటువంటి వాడే. అతడు ఉన్నత చదువులు చదివాడు.. న్యాయవాది అయ్యాడు. ఒంటికి నల్ల కోటు వేసుకుని.. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి మాఫియా డాన్ అయిపోయాడు. వ్యవస్థలో లొసుగుల ఆధారంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా సమాంతర శక్తిగా మారిపోయాడు.
అతడి పేరు అఖిలేష్ దూబే.. ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్ పూర్ ప్రాంతం. చదువుకున్నది లాయర్ కోర్స్ అయినప్పటికీ.. చేసేవి మొత్తం గలీజ్ దందాలే. ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ టైం లాయర్.. ఫుల్ టైం మాఫియా డాన్ అనుకోవచ్చు. ఇతడు ప్రతి వ్యాపారిని బెరిస్తాడు. డబ్బులు ఇవ్వాలని అడుగుతాడు. ఇతడు చెప్పిన డబ్బు ఇవ్వకపోతే.. ఇతడికి తగ్గట్టుగా నడుచుకోకపోతే అతడు తన స్టైల్ మొదలుపెడతాడు . మైనర్ అమ్మాయిల తో మానభంగం కేసులు పెట్టిస్తాడు. ఆ తర్వాత తనదైన క్రిమినల్ బుర్రతో కోర్టులో వాదించి జైలు శిక్ష పడేలా చేస్తాడు. అప్పుడు వాళ్లను తన కాళ్ళ దగ్గరకి వచ్చేలా చేసుకుంటాడు. అప్పుడు తను అడిగినంత డబ్బులు తీసుకుంటాడు. బీహార్, యూపీ, జార్ఖండ్ నుంచి మైనర్ బాలికలను తీసుకొచ్చి ఈదందా నడిపిస్తుంటాడు. హోటల్స్ నుంచి మొదలుపెడితే షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ప్రతి ఏడాది రెన్యువల్ కూడా చేస్తుంటాడు. ఇతడి దందా ఇక్కడితోనే ఆగిపోలేదు. తన క్రిమినల్ బుర్రతో ఏకంగా 1500 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జా పెట్టాడు. తన మాఫియా ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదించాడు.
తెర వెనక చాలామంది సహాయం
ఇతడికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెడితే సీఎంఓ వరకు సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇతడికి సహకారం అందిస్తూనే ఉంటారు. అందువల్లే ఇతడి ఆగడాలు అంతకుమించి అనేలాగా పెరిగిపోయాయి. ఇతడు ఇటీవల బీజేపీ నాయకుడు రవి సతీజాను ఇలాగే బెదిరించాడు. అతనిపై బలవంతపు ఫోక్సో కేసు నమోదు చేయించాడు. రాజకీయంగా పలుకుబడి కలిగిన రవి ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశాడు. అసలు విషయం మొత్తం చెప్పాడు. రవి చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకున్న యోగి.. ఆ తర్వాత విచారణ మొదలు పెట్టించాడు. గత జనవరిలో యూపీ పోలీసులు అఖిలేష్ పై దృష్టి పెట్టారు. ప్రతి కేసును విచారించారు. వారి విచారణలో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు కనిపించాయి. కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఐపీఎస్ వరకు ప్రతి ఒక్కరి సహకారం అఖిలేష్ కు ఉంది. దీంతో పగడ్బందీ ఆధారాలను సేకరించిన అక్కడి పోలీసులు..అఖిలేష్ కు సహకరించిన వారందరిపై కేసులను అమలు చేశారు.. అంతేకాదు అఖిలేష్ ను జైలుకు తరలించారు..అఖిలేష్ వల్ల ఎంతోమంది ఏళ్లపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అతడికి కూడా ఆ బాధ తెలిసి రావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జైల్లో వేసింది..
30 సంవత్సరాల సంబంధం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వికాస్ దుబే అనే మాఫియా డాన్ కు అఖిలేష్ దూబే కు 30 సంవత్సరాలుగా సంబంధం ఉంది. వీరిద్దరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. 2020లో వికాస్ ను యూపీ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. ఆ ఘటన జరిగినప్పటికీ అఖిలేష్ తన తీరు మార్చుకోలేదు. పైగా మరిన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. చివరికి పోలీసులకు చికాడు. ప్రస్తుతం జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్నాడు.