
ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్లపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు ప్రారంభమైనప్పుడు పోలీసులు సమయోచితంగా వ్యవహరించినట్లైతే ఆ అల్లర్లు హింసాత్మకంగా మారేవి కావని ఆయన అభిప్రాయ పడ్డారు.
అల్లర్లను అదుపుచేయడానికి పార్లమెంటులో ఆమోదించబడిన అనేక చట్టాలున్నాయని వాటిని సక్రమంగా ఉపయోగించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆయన తెలిపారు. దేశ పౌరుల క్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ఉపయోగించటంలో పోలీసులకు సర్వ హక్కులు ఇవ్వబడ్డాయని వాటిని సక్రమంగా అమలపర్చడంలో విఫలమైన పోలీసుల వల్ల 48 మంది బలి కావాల్సివచ్చిందని దోవల్ వ్యాఖ్యానించారు.
పౌరుల క్షేమం కోసం అమలు చేయబడిన చట్టాలను అమలు చేయలేకపోతే, ఆ చట్టాల సత్ఫలితాలను ప్రజలు ఎలా ఆస్వాధిస్తారని అజిత్ అన్నారు. ఢిల్లీ అల్లర్లు హింసాత్మకంగా మారి అనేకమందిని బలి తీసుకుంటుంటే.. పోలీసు బలగాలు ప్రేక్షక పాత్ర పోషించడం పై అజిత్ దోవల్ మండిపడ్డారు.