అన్నాడీఎంకే అంటే జయలలిత. అంతకు మించి వేరే మాట లేదు. ఏడాది కిందటి వరకూ ఇదే పరిస్థితి. కానీ.. ఆమె వెళ్లిపోవడంతో మొత్తం తలకిందులైంది. పార్టీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా తయారైంది. ‘అమ్మ’ నిలబెట్టిన నేతలుగా తప్ప.. పళని, పన్నీరుకు రాష్ట్రాన్ని ఆకర్షించే చరిష్మా లేదనే అభిప్రాయం అప్పట్నుంచే ఉంది. ఈ ఎన్నికల ఫలితాలతో క్లియర్ అయిపోయింది. కానీ.. స్టాలిన్ లెక్క అలా కాదు. తండ్రి వారసత్వంతోనే వచ్చినా.. తనదైన ప్రతిభను నిరూపించుకున్నాడు.
దీంతో.. పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే.. చిన్నమ్మను లైన్లోకి దించాల్సిందేనని అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు మిత్రపక్షం బీజేపీకి సైతం పిక్చర్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తమిళనాట పాతుకుపోవడం అంత ఈజీకాదని ఆ పార్టీ గుర్తించినట్టుంది. అందుకే.. శశికళను ముందు పెట్టేందుకు కాషాయదళం కూడా అంగీకారం తెలుపుతున్నట్టు సమాచారం.
ఆస్తుల కేసులో జైలుకు వెళ్లివచ్చిన శశికళ.. వచ్చీరాగానే పార్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. తానే పార్టీ ప్రధాన కార్యదర్శినని కూడా ప్రకటించుకున్నారు. కానీ.. ఆ తర్వాత ఏమైదో ఏమో.. ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలాంటి శశికళను మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా పళనిస్వామి ఉన్నారు. ఆయన్ను అలా కొనసాగిస్తూనే.. పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను శశికళకు అప్పగించాలని డీఎంకే శ్రేణులు కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాన నేతల్లోనూ చాలా మంది ఈ తరహా ఆలోచనే చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి, ఇందులో వాస్తవం ఎంత? కార్యరూపం దాలుస్తుందా? అన్నది చూడాలి.