https://oktelugu.com/

Power Cuts In Telangana: కేసీఆర్ సార్.. ఇలా ‘కరెంట్’ షాకిస్తాడని అనుకోలేదు..!

Power Cuts In Telangana:  ‘రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాం.. రెప్ప పాటు కూడా కరెంటు పోదు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందన్న రాష్ట్రమే నేడు అంధకారంలో ఉంది.. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే’ ఇవీ నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, నాయకులు చెప్పుకునే గొప్పలు.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2022 1:43 pm
    Follow us on

    Power Cuts In Telangana:  ‘రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాం.. రెప్ప పాటు కూడా కరెంటు పోదు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందన్న రాష్ట్రమే నేడు అంధకారంలో ఉంది.. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే’ ఇవీ నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, నాయకులు చెప్పుకునే గొప్పలు.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ రాష్ట్రం మళ్లీ విద్యుత్‌ సంక్షోభంలో కూరుకుపోతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోతలపై దృష్టిపెట్టింది. వేసవి మొదట్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగితే విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుంది. సరఫరా లేకపోతే.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు అంటున్నారు నిపుణులు..

    Power Cuts In Telangana

    Power Cuts In Telangana

    అసలే వేసవి. ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలు విద్యుత్‌ కోతల విషయంలో పోటీ పడుతున్నాయి. ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన కరెంట్‌ కోతలు తెలంగాణలోనూ మొదలయ్యాయి. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరగడం, సరిపోయేంత కరెంటు నిల్వలు లేకపోవడం, కొనుగోలు సమస్య ఉండటంతో వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాలో కోతలు విధిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు.

    Also Read: RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్

    -దేశవ్యాప్తంగా
    ప్రస్తుతం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పవర్‌ కట్స్‌ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. గత 38 ఏళ్లల్లో చూస్తే ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగిందని, దీనికి తోడు వేసవికి ముందు చూస్తే తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి బొగ్గు నిల్వలు పడిపోయాయి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు పరిశ్రమలు మూతపడిన సంగతి తెలిసిందే. కానీ కోవిడ్‌ ఆంక్షలన్నీ పూర్తిగా ఎత్తేయడంతో భారతీయ పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కానీ బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్‌ కోతలు తప్పట్లేదు.

    -కోతలు విధిస్తున్న రాష్ట్రాలు ఇవే..
    దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, గుజరాత్, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ తోపాటు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 8.7 శాతం విద్యుత్‌ లోటును ఎదుర్కొంటోంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

    గత కొన్ని రోజులుగా పరిశ్రమలు 50 శాతం సరఫరాతో నడుస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ కోతలు తప్పట్లేదు. విద్యుత్‌ కోతలపై ప్రతిపక్షాలు నిరసనలకు దిగుతున్నాయి. ఈ పరిస్థితి తాత్కాలికం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొంటున్నారు. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 50–55 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటోందని సమాచారం.

    Power Cuts In Telangana

    Power Cuts In Telangana

    దేశంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో విద్యుత్‌ కోతలు ఎదుర్కోక తప్పే పరిస్థితి లేదు. గత వారంలో డిమాండ్‌లో విద్యుత్‌ కొరత 1.4 శాతానికి పెరిగింది. గత అక్టోబర్‌లో భారతదేశంలో తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న సమయంలో ఉన్న 1 శాతం లోటు కంటే ఇది ఎక్కువ. దీంతో విద్యుత్‌ సరఫరా కన్నా డిమాండ్‌ ఎక్కువ ఉన్నందున మహారాష్ట్ర చాలా సంవత్సరాల తర్వాత నిర్బంధ విద్యుత్‌ కోతలను చూస్తోంది. విద్యుత్‌ కొరత 2,500 మెగావాట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర డిస్కమ్‌ ప్రకటించింది. మహారాష్ట్రలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు అమలులో ఉంటాయని మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్, బొగ్గు కొరత ఫలితంగా 2,500–3,000 మెగావాట్ల విద్యుత్‌ లోటు ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే 4,000 మెగావాట్లు ఎక్కువగా ఈ ఏడాది 28,000 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది.

    కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం జార్ఖండ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 3 శాతానికి పైగా విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణకు పొరుగున ఉన్న, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న జార్ఖండ్‌ రాష్ట్రంలోనూ విద్యుత్‌ కొరత ఉండడంతో తెలంగాణ కూడా కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు.

    -తెలంగాణలోనూ వ్యవసాయానికి 7 గంటలే..
    డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో తెలంగాణలో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. శుక్రవారం నుంచి రోజుకి 7 గంటలు మాత్రమే త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరగడం, సరిపోయేంత కరెంటు నిల్వలు లేకపోవడం, కొనుగోలు సమస్య ఉండటంతో వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాలో కోతలు విధిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. గురువారం రోజున రాత్రంతా సింగిల్‌ ఫేజ్‌ మాత్రమే విద్యుత్‌ సరఫరా చేయాలని టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని ఆయా జిల్లాల ఎస్‌ఈలు, డీఈలకు ఆదేశాలు జారీ చేసింది.

    Power Cuts In Telangana

    Power Cuts In Telangana

    -జిల్లాల వారీగా సరఫరా షెడ్యూల్‌..
    తాజాగా జిల్లాల వారీగా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాకు సంబంధించి విద్యుత్‌ శాఖ షెడ్యూల్‌ ప్రకటించింది. ఖమ్మం జిల్లాకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు, జగిత్యాల జిల్లాకు 8.30 నుంచి 3.30 వరకు, మహబూబాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు 8.15 గంటల నుంచి 3.15 గంటల వరకు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు 9 నుంచి 4 వరకు, కామారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాలకు 8.45 నుంచి 3.45 వరకు, హన్మకొండ వరంగల్‌ జిల్లాలకు 9.40 నుంచి 4.40 వరకు, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు 9.15 నుంచి 4.15 వరకు, జనగాం, కొత్తగూడెం జిల్లాలకు 9.30 నుంచి 4.30 వరకు, నిజామాబాద్‌ జిల్లాకు 9.50 నుంచి 4.50 వరకు, కరీంనగర్‌ జిల్లాకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఇకమీదట ఏ రోజుకి ఆరోజే విద్యుత్‌ సరఫరా వేళలు ప్రకటించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకపోవడంతోనే వ్యవసాయ కరెంట్‌కి కోతలు విధించాల్సి వస్తోందని, రైతులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులు కోరుతున్నారు. మరో 10రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు.

    -రైతుల కంట కన్నీరు..
    రాష్ట్రంలో ఈ యాసంగిలో రైతులు ఆలస్యంగా వరి సాగుచేశారు. యాసంగిలో వరి వేయొద్దని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో డోలాయమానంలో ఉన్న రైతులు.. కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో వరి వేసిన విషయం బయటపడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆలస్యంగా వరి సాగు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంటలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం పంటలు చాలా వరకు ఈత దశలో ఉన్నాయి. ఈ సమయంలో వరికి నీరు చాలా ముఖ్యం. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుతలు షురూ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. పంటల చేతికందొచ్చే సమయంలో కరెంటు కోతలు విధించడం, అదికూడా పగటిపూట మాత్రమే విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు.

    -కావాలనే కోతలా?
    రాష్ట్ర ప్రభుత్వం కావాలనే వ్యవసాయానికి కరెంటో కోత విధిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసలు లేనందున ప్రస్తుతం కోత దశలో ఉన్న వరికి నీరందకుండా చేయాలనే ముఖ్యమంత్రి అనధికారికంగా కరెంటు కోతలు విధించాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటున్నారు. ఈ మేరకు అధికారులు త్రీఫేజ్‌ విద్యుత్ కోతలు విధిస్తూ రైతులను గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా దాచడం మూలంగానే ఇలాంటి పరిస్థితి వస్తోందని పేర్కొంటున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, డిమాండ్, సరఫరాపై స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    Also Read:Paddy Issue AP, Telangana: కొత్త పంచాయితీ : ఆంధ్రా -తెలంగాణ సరిహద్దులో చెక్‌ పోస్టులు

    Tags