Agneepath Row: అగ్నిపథ్.. సైన్యంలో కేవలం 4 ఏళ్లు మాత్రమే చేసి ఆ తర్వాత వారిని ఇంటికి పంపే కొత్త నియామక పద్ధతి. ఇన్నాళ్లు సైన్యంలో చేరితో రిటైర్ మెంట్ వరకూ జీతం, బెనిఫిట్స్ వచ్చేవి. రిటైర్ అయ్యాక పెన్షన్ సహా ఎన్నో పథకాలు, వ్యవసాయ భూములు, పెట్రోల్ బంకులు కేంద్రం కేటాయించింది. కానీ ఇప్పుడవన్నీ తీసేసి తాత్కాలిక ప్రాతిపదికన నాలుగేళ్లు సైన్యంలో యువతను వాడుకొని ఇంటికి పంపే ఈ పథకంపై దేశంలోని నిరుద్యోగులు భగ్గుమన్నారు.
-అసలేంటి ‘అగ్నిపథ్’
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో కేవలం 4 ఏళ్లు సర్వీస్ మాత్రమే యువత చేయాలి. ఆ తర్వాత వారికి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా కావాలనుకుంటే బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. పై చదువులు చదవాలనుకునే వారికి 12వ తరగతి సమానమైన సర్టిఫికేట్ ప్రధానం చేస్తుంది. తర్వాత బ్రిడ్జి కోర్సును ఆఫర్ చేస్తుంది. ఇతర ఉద్యోగాలకు ‘అగ్నిపథ్’ అనేది ఒక సోపానంలా ఉపయోగపడుతుంది. ఇక అగ్నిపథ్ లో పనిచేసిన యువతకు సీఏపీఎఫ్, రాష్ట్ర పోలీస్ నియామకాల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తారు. ఇక ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. వారి భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు.
Also Read: Bendapudi Students: వారంతా ఫెయిలయ్యారా? బెండపూడి విద్యార్థులపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?
-కేంద్రం ఏం చెబుతోంది?
సైన్యంలో కొన్నేళ్ల పాటు పనిచేస్తే వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయని.. పైగా కొంత వయసు వచ్చాక సైన్యంలో చురుకుగా ఉండరని కేంద్రం భావిస్తోంది. అందుకే నాలుగేళ్ల పాటు మాత్రమే దేశానికి సేవలందించే యువతీ యువకులు ఆ నాలుగేళ్లు యాక్టివ్ గా పనిచేస్తే దేశానికి భద్రత. వారికి ఈ నాలుగేళ్ల తర్వాత అవకాశాలు ఇస్తామని కేంద్రం అంటోంది. దీనివల్ల అత్యుత్తమ యువత ఎంపికై సాయుధ బలగాలకు మరింతగా బలం సమకూరుతుంది. ఇలాంటి స్వల్పకాలిక నియామకాలు చాలా దేశాల్లో ఉన్నాయి.అక్కడ విజయవంతమయ్యాయి. యువత, శక్తివంతమైన సైన్యం కావలంటే ఈ పద్ధతి అత్యుత్తమం అని కేంద్రం చెబుతోంది.
-అగ్నిపథ్ పై భగ్గుమన్న యువత..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంది. రక్షణ శాఖలో అగ్నిపథ్ నియామకాలపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. త్రివిధ దళాల్లో స్వల్పకాలిక ప్రాతిపదికన సైనికులను నియమించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరుద్యోగుల నుంచి నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సైన్యంలో ఉద్యోగాల కోసం ఏళ్లతరబడి సన్నద్ధమవుతున్న యువకులు ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ పేరిట బ్యానర్లతో ఆందోళనకు దిగారు. ఈ పథకాన్ని వెంటనే ఉపసంహరించాలని నినాదాలు చేశారు.
బిహార్‌లోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండో రోజూ రైళ్లు, బస్సుల రాకపోకలను యువత స్తంభింప చేశారు. రైళ్లకు నిప్పంటించారు. బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనల నేపథ్యంలో 34 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 8 రైళ్లను కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత నిలిపివేసింది. అలాగే, 72 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిపింది. కాగా, భభువా రోడ్ రైల్వేస్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రె్‌సకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో ఒక బోగీ పూర్తిగా దహనమైంది. నవాడాలో బీజేపీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ధ్వంసం చేశారు. అదే నగరంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అరుణాదేవి తన కారులో కోర్టుకు వెళ్తుండగా, ఆందోళనకారులు రాళ్లతో దాడి చేయడంతో ఆమెతోపాటు డ్రైవర్, ఇద్దరు భద్రతా సిబ్బంది, మరో ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారు.
– ఆందోళనలో వేలాది మంది..
ఆందోళనలో వేలాది మంది నిరుద్యోగ యువత పాల్గొంటున్నారు. రైల్వే ట్రాక్‌లపై పుష్-అప్ లు చేస్తూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్రాహ్ రైల్వేస్టేషన్‌లో ఫర్నీచర్‌ను దహనం చేయగా, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియ ర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. పోలీసులపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. జెహనాబాద్‌లో రైల్వేట్రాక్‌లపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందు కు పోలీసులు రాగా రాళ్లతో దాడి చేశారు. పోలీసులూ వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసులు సహా అనేకమందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులను భయపెట్టేందుకు పోలీసులు తుపాకులను ఎక్కుపెట్టారు. సహస్ర రైల్వేస్టేషన్‌లోనూ విద్యార్థులు రాళ్లు రువ్వగా పోలీసులు చెదరగొట్టారు. చాప్రా పట్టణంలో ఆందోళనకారులు రైలు, బస్సులకు నిప్పు పెట్టారు. ముజఫర్‌పూర్, బక్సర్‌లలోనూ ఆందోళనలు కొనసాగా యి. బిహార్‌లోని జెహనాబాద్, బక్సర్, కతిహర్, సరన్, భోజ్‌పూర్, కైముర్ జిల్లాల్లో ఆందోళనలతో రోడ్లపై రాకపోకలు స్తంభించిపోయాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, సికర్, జైపూర్, నగౌర్, అజ్మేర్, ఝున్‌ఝును జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.
-కేంద్రంపై ఆగ్రహం
దేశ వ్యాప్తంగా సైన్యంలో చేరేందుకు వేలాది మంది నిరుద్యోగ యువత వేచిచూస్తుంటారు. అందుకుగాను ఏళ్ల తరబడి సన్నద్ధం అవుతుంటారు. ఉద్యోగం లభిస్తే 15-20 ఏళ్ల పాటు దేశ రక్షణ విధుల్లో ఉంటారు. జీతం కూడా బాగానే ఉంటుంది. రిటైరయ్యాక పింఛన్‌తోపాటు గ్రాట్యుటీ లభిస్తుంది. అయితే, రక్షణ బడ్జెట్‌లో సైన్యం జీతాలు, పింఛన్లకే ఎక్కువగా కేటాయించాల్సి వస్తోందనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తెచ్చింది. ఈ పథకం కింద ఏటా 45 వేలమంది సైనికులను నియమించుకుంటారు. నాలుగేళ్ల తర్వాత వారిలో మూడొంతుల మందిని ఇంటికి పంపించేస్తారు. వీరికి పింఛన్, గ్రాట్యుటీ చెల్లించరు. 25 శాతం అగ్నివీరులకు మాత్రమే పర్మినెంట్ కమిషన్ ద్వారా మరో పదిహేనేళ్లు నాన్-ఆఫీసర్ హోదాలో సైన్యంలో కొనసాగే అవకాశం దక్కుతుంది. జీతాలు నెలకు రూ.30 వేలతో మొదలై, నాలుగో ఏడాది రూ.40 వేలు అవుతుంది. ఈ జీతంలోనూ మూడో వంతు కార్పస్ ఫండ్‌కు జమచేస్తారు. నాలుగేళ్లకు ఆ కార్పస్ ఫండ్ రూ.5 లక్షలు అవుతుంది. ప్రభుత్వమూ దీనికి సమాన మొత్తాన్ని కలిపి వడ్డీతో సహా రూ.11-12 లక్షలు రిటైర్మెంట్ సమయంలో ఇస్తుంది. ఈ మాత్రం దానికేనా తాము ఏళ్ల తరబడి సన్నద్ధమవుతోందంటూ నిరుద్యోగుల్లో ఆందోళన పెల్లుబుకింది. నాలుగేళ్ల తర్వాత తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు నిలదీస్తున్నారు.
-అగ్నిపథ్ తో దేశానికి మంచిదే..
సాయుధ దళాల్లో యువతను పెంచడం.. శక్తిసామర్థ్యాలను పెంచడమే ధ్యేయంగా అగ్నిపథ్ ను మిలటరీ ఆఫీసర్స్ డిపార్ట్ మెంట్ ఆలోచించే ప్రతిపాదించింది. దీనివల్ల ప్రయోజనాలు బోలెడు ఉంటాయి. సైన్యంలో ఎక్కువ కాలం పనిచేయడం వల్ల నిరాశ నిసృహ, వ్యక్తిగత జీవితం కోల్పోయిన బాధ ఉండదు. యువత నాలుగేళ్లు పటిష్టంగా పనిచేస్తారు. ఆ తర్వాత రిటైర్ అయిపోతారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవాళ్లు కొనసాగుతారు. సాయుధ బలగాల పటిష్టతకు ఈ పథకం గొప్పదని కేంద్రం, మేధావులు చెబుతున్నారు.
Also Read:BJP Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనలో బీజేపీ భారీ స్కెచ్.. చివరివరకూ సస్పెన్సే