MP MVV Satyanarayana Family Kidnapped: విశాఖ నగరంలో తెర వెనుక ఏదో జరుగుతోందా? ఎంపీ వ్యాపారాలు మానుకొని హైదరాబాద్ వెళ్లిపోతానని ఎందుకు చెప్పారు? ఎప్పుడూ ఇవ్వని విధంగా సాక్షి మీడియా ఒక్కదానికే రూ.5 కోట్ల యాడ్ ఎందుకిచ్చారు? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కలకలం తరువాత ఈ పరిణామాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అంత పెద్ద బిల్డర్ అయినా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన కంపెనీ తరుపున యాడ్లు ఇచ్చింది తక్కువే. పోనీ తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే అన్ని పత్రికలకు యాడ్లు ఇస్తారు. కానీ కేవలం సాక్షికి మాత్రమే రెండు ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. దీని వెనుక ఏదో మంత్రాంగం ఉందన్న అనుమానం సాగరనగరం జనాల్లో ఉంది.
భూ యజమానులకు ఒక్కటంటే ఒక్క శాతం ఇచ్చి మిగతా 99 శాతం తన వాటాగా ఉంటేనే ఎంపీ ఎంవీవీ నిర్మాణాలు చేపడుతుంటారు. ఆదివారం సాక్షిలో యాడ్ ఇచ్చిన ప్రాజెక్టులు ఇటువంటి జాబితాలోనివే. గతంలో ఈ ఒప్పందాలను ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఎంపీ ఎంవీవీ చర్యలు మింగుడుపడక నేరుగా విజయసాయిరెడ్డి ప్రకటనలే చేశారు. అప్పట్లో ఎంపీ ఎంవీవీ సైతం విజయసాయిరెడ్డిపై విమర్శలకు దిగారు. పార్టీలో పెద్ద దుమారానికి దారితీశాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టుల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు సాక్షికి యాడ్లు ఇచ్చారు. కానీ ఒక వ్యాపారిగా బహుళ ప్రాచుర్యం పొందాలని ఆశిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఒకే ఒక మీడియాకు యాడ్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది.
అధికార పార్టీ ఎంపీగా ఉంటూ.. తన ఫ్యామిలీ కిడ్నాప్ నకు గురికావడంతో ఎంవీవీ సత్యనారాయణ సఫరవుతున్నారు. పైకి డబ్బు కోసమే వివాదమని చెబుతున్నా.. ల్యాండ్ సెటిల్మెంట్లన్న ఆరోపణలున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఎంపీ రగిలిపోతున్నారు. సాక్షాత్ అధికార పార్టీ ఎంపీకే రక్షణ లేకుండా పోతుండడంపై ఆవేదన చెందుతున్నారు. అయితే కిడ్నాపర్లకు ఎంపీకి మించి రాజకీయ అండదండలున్నాయని ప్రచారం జరుగుతోంది. సహజంగానే ఇది ఎంపీకి భయపెట్టే విషయం. అందుకే విశాఖ నగరంలో వ్యాపారాలు మానుకోని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని డిసైడయ్యారు.
ఇప్పుడు సాక్షికి రూ.5 కోట్ల యాడ్లు ఇవ్వడం, వెనువెంటనే సీఎం జగన్ కు కుటుంబంతో కలవడం, అంతకంటే ముందే తాను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఇదేదో అంతర్గత సమస్యే అన్న అనుమానం నిజమవుతోంది. వాస్తవానికి ఎంపీకి విజయసాయిరెడ్డి రూపంలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన్ను రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగించిన తరువాత తగ్గాయి. కానీ ఇటీవల మరింత ఎక్కువయ్యాయి. దీంతో విసిగివేశారిపోయిన ఎంపీ ఎంవీవీ అమీతుమీకి సిద్ధపడుతున్నారు. కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసిన తరువాత ప్రతాపం చూపాలని చూస్తున్నారు. అంతవరకూ కొంచెం తగ్గి ఉండాలని భావిస్తున్నారు.