Chief Justice BR Gavai: మన దేశ చరిత్రలో ఒక సుప్రీంకోర్టు జడ్జి పై దాడి జరగడం.. అది కూడా విచారణ జరుగుతుండగానే ఈ సంఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ ఒక కేసును విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లిన ఒక లాయర్ తాను ధరించిన షూ ను విప్పి ఆయనపై విసిరి వేయడానికి ప్రయత్నించారు. భద్రత సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆ న్యాయవాదిని బయటకి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు లో ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే ఈ సంఘటన చోటు చేసుకోవడం విశేషం. అయితే ఆ న్యాయవాది విసిరిన షూ బెంచ్ వరకు వెళ్లలేదు.
ఈ ఘటన సుప్రీంకోర్టులో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వాస్తవానికి గవాయి న్యాయవాదులతో స్నేహంగా ఉంటారు. వివాదాస్పద అంశాల జోలికి అంతగా వెళ్లరు. కానీ ఆయన ఇటీవలఒకే విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇటీవల మధ్యప్రదేశ్ ఖజురహో దేవాలయ సముదాయంలో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణ పై పిటిషన్ దాఖలయింది. జస్టిస్ కే వినోద్ చంద్రన్ తో కలిసి గవాయ్ విచారణ చేపట్టారు. సెప్టెంబర్ 16న ఖజురహో దేవాలయ సముదాయంలోని జవారి అనే ఆలయంలో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం పునర్నిర్మాణం కోసం పిటిషన్ దాఖలు అయింది. దీనిని విచారించిన బెంచ్.. కీలక వ్యాఖ్యలు చేసింది.. “ఈ వ్యవహారం మొత్తం ప్రచారం కోసం చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది. మీరు వెళ్లి ఆ దేవుడిని అడగండి. ఏం చేయాలో మీరే తెలుసుకోండి. మీరు విష్ణుమూర్తి భక్తుడు కాబట్టి ప్రార్థనలు చేయండి. ధ్యానం కూడా చేయండి” అని గవాయ్ కఠినంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన వివరణ కూడా ఇచ్చారు.. నేను అన్ని మతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన ఈ తీర్పును రాకేష్ కిషోర్ మయూర్ అనే అడ్వకేట్ తీవ్రంగా తప్పుపట్టారు. అప్పటినుంచి ఆయన ఆగ్రహంగా ఉన్నారు. సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో ప్రోసిడింగ్ జరుగుతుండగానే తన స్పోర్ట్స్ షూ బయటికి తీసి గవాయి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో భద్రత సిబ్బంది అడ్వకేట్ ను పట్టుకున్నారు. సుప్రీంకోర్టు భద్రత విభాగానికి అప్పగించారు. రాజేష్ కిషోర్ ఢిల్లీలోని మయూరివిహార్ ప్రాంతానికి చెందినవారు. ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో కూడా సభ్యుడిగా ఉన్నారు. సనాతన ధర్మంపై అవమానం చేస్తున్నారని.. అదే జరిగితే తాము ఊరుకోబోమని రాకేష్ నినాదాలు చేశారు. అతడు ఆ నినాదాలు చేస్తుండగానే గవాయ్ స్పందించారు.. ఇటువంటి దాడులు తనను ప్రభావితం చేయబోవని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీసులు చేరుకొని ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టారు.
విష్ణుమూర్తి విగ్రహ పునర్ నిర్మాణం పై గవాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం గురించి తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అయినప్పటికీ గవాయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. పైగా తాను అన్ని మతాలను గౌరవిస్తానని పేర్కొనడం విశేషం.