Agneepath Scheme Advantages Disadvantages: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాల్సిన యువకులు విధ్వంసకారులుగా ఎందుకు మారారు..? ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి జైల్లోకి ఎందుకు వెళ్లారు..? వారి ఆందోళనకు కారణమేంటి..? కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది..? దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ ఇదే. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘అగ్నిపథ్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో తాము తీవ్రంగా నష్టపోతామని సైనిక అభ్యర్థులు అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం యువకులను ప్రయోజకులను చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం రక్షణ వ్యవస్థపై ఖర్చు తగ్గించుకునేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. అసలు అగ్నిపథ్ పథకంతో సైన్యంలో చేరాలనుకునేవారికి లాభమా..? నష్టమా..?
-అగ్నిపథకం తీరేంటి?
అగ్నిపథ్ పథకం ద్వారా 17 నుంచి 21 ఏళ్ల వయసున్న యువకులను నియమిస్తారు. వీరిలో 25 శాతం మంది అత్యధిక ప్రతిభ కలిగిన వారిని పర్మినెంట్ సైనికులుగా గుర్తిస్తారు. సాధారణ సైనికులలాగే వారు పదవీ విరమణ పొందే వరకు ఉంటారు. రిటైర్ మెంట్ తరువాత పింఛన్, తదితర సౌకర్యాలు అనుభవిస్తారు. మిగతా 75 శాతం సైనికులు నాలుగేళ్లపాటు సైన్యంలో పనిచేస్తారు. ఆ తరువాత ఈ నాలుగేళ్ల పాటు వారికి 11 లక్షల 70 వేల జీతం.. గ్రాడ్యూటీ 11 లక్షల 70 వేలు.. మొత్తం 23,43,160 రూపాయలు అందిస్తారు. ఈ మొత్తంతో 25 ఏళ్ల వయసులో వ్యాపారం లేదా.. ఈ సొమ్మును డిపాజిట్ చేసుకొని ఇతర ఉద్యోగాలను వెతుక్కోవచ్చు. ఇక పోలీసు నియామకాల్లో వీరికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 25 సంవత్సరాల యువకులకు 23 లక్షల నగదుతో పాటు ఆర్మీ శిక్షణ పొందిన వారుగా ఉంటారు. వారికి వ్యాపారం చేయాలనుకుంటే రుణ సౌకర్యం కూడా కల్పిస్తారని తెలుపుతోంది.
Also Read: Agnipath Scheme: ఉక్రెయిన్ ప్రేరణగానే అగ్ని పథ్ పుట్టిందా?
-పథకంపై ఆందోళన ఎందుకు?
అయితే అగ్నిఫథ్ పథకంతో నాలుగేళ్లపాటు సైన్యంలో పనిచేస్తారు. ఆ తరువాత మేమేం చేయాలి..? అని ప్రశ్నిస్తున్నారు. సాధారణ నియామకాలతో పదవీ విరమణ పొందేవరకు దేశ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉత్సాహం ఉన్న యువకులను కొద్దికాలానికి వాడుకొని ఆ తరువాత ఇంటికి పంపడం వల్ల యువకుల్లో ఆశలు సన్నగిల్లుతాయి. దీంతో సైన్యంలో చేరడానికి ఎవరూ ముందుకు రారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సైన్యాన్ని తగ్గించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు సైతం రక్షణ వ్యవస్థపై బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతలా ఆలోచించడం అవివేకమని ఆరోపిస్తోంది.
-కేంద్రప్రభుత్వం ఏమంటోంది?
కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. నాలుగేళ్ల తరువాత అత్యుత్తమ అగ్ని వీరులు సైన్యంలో కొనసాగుతారు. వీరు దేశానికి ప్రాణాలను ఫణంగా పెడుతారు. ఇప్పుడున్న వ్యవస్థతో పింఛన్ల చెల్లింపుకే అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ఈ సొమ్మును అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటోంది. అంతేకాకుండా ఇదే విధానాన్ని చాలా దేశాలు పాటిస్తున్నాయని తెలుపుతోంది. మొన్నటికి మొన్న ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఇప్పటికే ఉక్రెయిన్ వెనుకడుగు వేయలేదు. అందుకు అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉండడమే. భారీగా మిలటరీ వ్యవస్థ ఉన్న రష్యాను ఉక్రెయిన్ ముప్పు తిప్పలు పెడుతోందని.. అందుకే సైన్యం కన్నా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడమే మిన్న అని కేంద్రం వాదిస్తోంది.
అగ్నిపథ్ పథకంలో మాజీ సైనికులు కొందరు వ్యతిరేకిస్తున్నా.. మేధావులను సంప్రదించిన తరువాత ఈ పథకాన్ని తీసుకొచ్చామని కేంద్రం అంటోంది. ఈ విధానం చాలా దేశాల్లో అమలవుతోందని అంటున్నారు. అంతేకాకుండా అగ్నిపథ్ ద్వారా చురుకైన యువకులు సైన్యంలో ఉంటారని, దీంతో దేశానికి రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుదన్నారు. ఇతర దేశాల్లో దీనిని అమలు చేసి సక్సెస్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం అంటోంది.
మొత్తంగా కేంద్రం దృష్టిలో.. దేశ రక్షణ వ్యవస్థ.. ఆర్థికంగా చూస్తే ‘అగ్నిపథ్’ మంచిదే. కానీ నిరుద్యోగుల కోణంలో మాత్రం ఇది వారికి పర్మనెంట్ ఉద్యోగం లేకుండా చేస్తుంది. వారి భవిష్యత్తును అంధకారం చేస్తుంది. అందుకే యువకులకు ఈ పథకం నష్టమే. మరి ఈ విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్నది వేచిచూడాలి.
Also Read:Center Govt- Agneepath Scheme: అగ్నిపథ్ పై కేంద్రం పీచేముడ్