Supreme Court : భారత దేశంలో వైవాహిక బంధానికి మంచి గుర్తింపు ఉంది. మన బంధాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి విదేశీయులు భారత్‌కు వస్తున్నారు. కొందరు విదేశీయులు భారత్‌కు చెందిన యువతీ యువకులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక మన వివాహ బంధాలు ఎక్కువకాలం ఉంటాయని భావిస్తారు. అందుకే మన సంప్రదాయాన్ని చాలా మంది విశ్వసిస్తున్నారు. భారతీయులు కూడా ప్రేమ పెళ్లి కన్నా పెద్దలు కుదిర్చిన వివాహాలు ఎక్కువ కాలం నిలబడతాయంటారు. అయితే ఇటీవల పాశ్చాత్య పోకడతో మన యువత కూడా దారి తప్పుతోంది. పెళ్లికి ముందే ప్రేమ, దోమ, లివింగ్ టుగెదర్, డేటింగ్ అంటూ పెళ్లి తర్వాత జరగాల్సివి పెళ్లికి ముందే కానిచ్చేస్తున్నారు. దీంతో పెళ్లి తర్వాత కూడా కొందరు పాత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇవి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. దాడులకు, హత్యలకు, విడాకులకు దారి తీస్తున్నాయి అయితే వివాహేతర సంబంధం విషయంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఇష్టమైన బంధం నేరం కాదు..
పెళ్లి తర్వాత వివాహిత తన ఇష్టంతో మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే తప్పుగా పరిగణించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈమేరకు ముంబై ఖార్గార్ స్టేషన్‌లో ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తిపై వితంతువు పెట్టిన రేప్ కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. అది తప్పుడు కేసని కొట్టేసింది. రిలేషన్ బాగున్నప్పుడు శృంగారంలో పాల్గొని.. విభేదాలు వచ్చాక కక్షతో రేప్ కేసులు పెట్టడం సరికాదని పేర్కొంది. ఇది మగవాళ్లకు ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ బీవీ. నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్‌సింగ్ ధర్మాసనం తెలిపింది. కొందరు పెళ్లి చేసుకుంటామనే ఒప్పందంతో సన్నిహితంగా ఉంటారని, కచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేసింది.
ఐపీసీ 497 కొట్టివేత..
వివాహేతర సంబంధంపై గతంలో కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని, వివాహేతర బంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 497ను కొట్టేసింది. 2018 సెప్టెంబర్‌లో వెలువడిన తీర్పు ప్రకారం మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న 497 కు కాలం చెల్లిందని అభిప్రాయపడింది. అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటిన వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని పేర్కొంది. ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని అభిప్రాయపడింది. ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం మహిళల హక్కు అని తెలిపింది. ఆమెకు షరతులు విధించలేమని స్పష్టం చేసింది. వివాహేతర బంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పు. దీనిని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చు అని కూడా ధర్మాసనం తెలిపింది.