Bihar : అది బీహార్ రాష్ట్రం.. బీహార్ అంటేనే దరిద్రానికి కేరాఫ్ అడ్రస్.. అక్కడ పేదరికం ఎక్కువగా ఉంటుంది.. ఉన్నత చదువులు చదివే సంఖ్య తక్కువగా ఉంటుంది. పురుషుల సంగతి ఇలా ఉంటే.. ఇక ఆడవాళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఉపాధి లభించక.. దారిద్రం తాండవిస్తుండగా.. పిల్లల్ని చదివించే స్తోమతలేక.. ఆర్థిక స్థిరత్వం అంతగా లేక చాలామంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని పెద్దగా చదివించరు. ఒక స్థాయి వచ్చే వరకే వారితో చదువు మాన్పించి పనులకు పంపిస్తారు. పనులకు వెళ్లడం అలవాటు కావడంతో ఆ యువతకు చదువుకునే అవకాశం ఉండదు. ఇలాంటి వారి సంఖ్య బీహార్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి కుటుంబాలలో అరుదుగా మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తుంటారు. అలాంటి వారిలో ఆదర్శ్ ముందు వరుసలో ఉంటారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ఆయన సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఏకంగా న్యాయమూర్తిగా ఉద్యోగం సాధించాడు.. ఇప్పుడు అతడి విజయగాథ బీహార్లో మార్మోగిపోతోంది.
తండ్రి కోడిగుడ్ల వ్యాపారి
బీహార్ రాష్ట్రంలో శివగంజ్ అనే ఒక ప్రాంతం ఉంది.. ఇది కోడిగుడ్ల మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది. ఈ మార్కెట్లో విజయ్ సావ్ అనే వ్యక్తి కోడిగుడ్ల వ్యాపారం చేస్తుంటాడు. అయితే అతనికి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దాంతోనే కుటుంబాన్ని సాకుతుంటాడు. ఇలా విజయ్ సావ్ కుమారుడు ఆదర్శ్ తన తండ్రి పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూశాడు. ఇలాంటి ఆర్థిక కష్టాల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలని భావించాడు. దీనికోసం చదువుకునే ఆయుధంగా మలచుకున్నాడు. తన కుటుంబానికి పేదరిక నేపథ్యం ఉన్నప్పటికీ చదువును మాత్రం వదిలిపెట్టలేదు. పుస్తకాలు కొనే స్తోమత లేకపోయినప్పటికీ.. ఖరీదైన కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకునే స్థాయి లేకపోయినప్పటికీ.. ఆదర్శ్ బలంగా ముందడుగు వేశాడు. తన వద్ద ఉన్న మామూలు స్మార్ట్ ఫోన్ తో రోజు యూట్యూబ్లో వీడియోలు చూసేవాడు. అలా నోట్స్ సొంతంగా ప్రిపేర్ చేసుకునేవాడు. ప్రతిరోజు 18 గంటలు చదివేవాడు. అలా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ పరీక్షలు ఉత్తీర్ణుడయ్యాడు. ఏకంగా న్యాయమూర్తి ఉద్యోగాన్ని సాధించాడు. పేద కుటుంబంలో పుట్టి.. కష్టాలను ఎదుర్కొంటూ చదువుకొని.. ఏకంగా న్యాయమూర్తి దాకా తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆదర్శ్. ఆదర్శ్ సాధించిన విజయం బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రధాన మీడియా మొత్తం ఆదర్శ్ పోటీ పరీక్షలకు సిద్ధమైన విధానాన్ని కథలు కథలుగా ప్రసారం చేస్తోంది. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. ” నేను పేద కుటుంబంలో పుట్టాను. మా నాన్న పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూశాను. ఆ కష్టాన్ని దూరం చేయాలని కంకణం కట్టుకున్నాను. దానికి చదువు అనే ఆయుధాన్ని పట్టుకున్నాను. అంతిమంగా విజయం సాధించానని” ఆదర్శ్ చెబుతున్నాడు.