
Mohan Babu- ABN RK: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ‘‘ ఆ రెండు పత్రికలు’’ అనే వారు. అసెంబ్లీ వేదికగా కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని కథనాలు వండి వార్చుతున్నారంటూ మండిపడేవారు. ఆ రెండు పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణను రెండుసార్లు పిలిచి మాట్లాడారట. అయితే అది సమరానికి కాదు.. సంధికే.. మరి వైఎస్ఆర్కే సంధి కుదర్చుకున్నారా? లేక సమరం కొనసాగించారా? అన్నదానిపై ఆర్కే తాజాగాబయటపెట్టాడు. అవే సంచలనమయ్యాయి.
ఏబీఎన్ ఛానల్లో ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో గెస్ట్ గా సినీ నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చంద్రబాబుతో సన్నిహితంగానే ఉండేవాడినని, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎదురైనప్పుడు నమస్తే బాబు అంటే… ఆయన కూడా చక్కగా పలికరించేవారని మోహన్ బాబు అన్నారు. తన పెద్ద కొడుకుతో వైఎస్ కుటుంబలోని అమ్మాయిని చేసుకున్న తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావగా మారారు.
కాగా, ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై వస్తున్న వరుస కథనాలపై మోహన్ బాబు ప్రశ్నించారు. కోడికి కత్తినట్లు ఎందుకు ఆయనపై కత్తి కట్టారు అన్నారు. దీనిపై ఆర్కే సమాధానమిస్తూ.. ‘‘ కోడి కట్టలేదు.. బరిసె కట్టలేదు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వస్తున్న కథనాలన్ని అక్షర సత్యం. ఓబులాపురం మైనింగ్ వ్యవహారంపై వరుస కథనాలు ప్రచురించాం. దానివల్లే గాలి జనార్థన రెడ్డి జైలు పాలయ్యారు. మీరు చూసే ఉంటారుగా. ఇంకా చాలా మంది అదే వరుసలో ఉన్నారు’’ అని అన్నారు.

ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను పిలిచి మాట్లాడారని ఆర్కే అన్నారు. ‘‘సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, గౌరవంగా వెళ్లా. రైతు ఆత్మ హత్యలపై వరుస కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అంటే… రైతుల ఆత్మలు జరగకుండా చూడండి అన్నా… అంతే. ఇక రెండోసారి కొంతమంది మధ్యవర్తులతో రాయబేరం పంపితే వెళ్లా.. వ్యతిరేక కథనాలు ఆపేయాలని సూచించారు. పావు పేజీ భాగం మీ(వైఎస్) గురించి రాయమంటే రాస్తా… మిగతా భాగం మాత్రం మీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు గురించే ఉంటాయి.. దాని రాయవద్దని చెప్పే హక్కు మీకు లేదని అన్నా.’’ అని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, జీవో 2430 తీసుకువచ్చింది.