Jaya Prada: జయప్రద.. తెలుగు నాట సినిమా, రాజకీయ రంగంలో కొన్నేళ్ల పాటు ఏలిన మహిళ. ఈ తరం వారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ.. 1970-80 మధ్య కాలంలో యువకుల కలల రాణిగా నిలిచింది. అప్పట్లోని స్టార్ హీరోలందరితో నటించారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఏపీలో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించారు. అటు తరువాత జాతీయ రాజకీయాల్లో కూడా రాణించారు. అక్కడ ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సుదీర్ఘ కాలం ఆ పార్టీలో పనిచేశారు. క్రియాశీలక పదవులు చేపట్టారు. ఆ తర్వాత పార్టీని వీడి.. 2019లో బీజేపీలో చేరారు.. ప్రస్తుతం పార్టీలో క్రియశీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటినప్పటికి.. ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని పలుమార్లు వెల్లడించారు. తాజాగా మరోసారి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జయప్రద.

రాజమహేంద్రవరంలో బీజేపీ గర్జన పేరిట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన నిర్వహించిన సభకు హాజరైన సందర్భంగా జయప్రద ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే తాను రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల ప్రజలకు జయప్రద క్షమాపణ చెప్పారు. రాజమండ్రి తన స్వస్థలమని.. ఇక్కడి నుంచే దేశ రాజకీయాల్లోకి వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. మన ఊరు, మనవాళ్లను వదిలి వెళ్లినందుకు క్షమించండి అంటూ తెలుగు ప్రజలను కోరారు.
Also Read: Pawan Kalyan 3 Options పవన్ కళ్యాణ్ ముందు చేయాల్సిన పని ఇదే!
ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మారుస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళుతున్నాయని ఆమె చెప్పారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆమె ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండాపోయిందని జయప్రద ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద.. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేయాలని ఉందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఏపీ బీజేపీలో కీలకపాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా రాజమండ్రి సభలో చేసిన వ్యాఖ్యలతో ఆమె ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్లు తన మనసులో మాట చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.
Also Read:YCP Govt- Police: ఖాకీలైతే గొప్ప? పోలీసులనూ వదలని వైసీపీ సర్కారు