https://oktelugu.com/

CM KCR: పార్టీతోపాటే.. పదవీ గోవిందా.. జాతకం ప్రకారం కేసీఆర్‌కు పరాభవం తప్పదా!?

కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికలను టీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన ఈ తెలంగాణ రాష్ట్రసమితి... కేసీఆర్‌కు అచ్చొచ్చిందట.

Written By: , Updated On : August 24, 2023 / 08:32 AM IST
CM KCR

CM KCR

Follow us on

CM KCR: ముహూర్తాలు చూసికుని పనులు చేసే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2018 తన గ్రహాలు బాగున్నాయన్న ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అనుకున్నట్లే అన్నీ కలిసి వచ్చాయి. 2014 కంటే ఎక్కువ సీట్లు గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చారు. తాజాగా మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి పూర్తిస్థాయి పాలన చేసిన కేసీఆర్‌ మరోమారు కూడా తానే అధికారంలోకి వస్తాననే ధీమాతో ఉన్నారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికలకు ముహూర్తాలు కూడా చూసుకుంటున్నారు. ఆ ప్రకారమే సోమవారం శ్రావణ పంచమి ధనుర్‌ లగ్నంలో ఒకేసారి 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక రాబోయే రోజుల్లో యజ్ఞాలు, యాగాలు, పూజలు చేయడం పక్కా. అయితే ఈసారి కేసీఆర్‌ జాతకం ఎలా ఉండబోతుంది. బీఆర్‌ఎస్‌ ఎన్ని సీట్లలో గెలవబోతోంది.. కేసీఆర్‌కు మూడోసారి సీఎం అయ్యే యోగం ఉందా అన్న చర్చ జరుగుతోంది.

లక్కీ నంబర్‌ ప్రకారమే సీట్లు..
కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6 ఆయన ఏ పని చేసినా ఆరు కలిసి వచ్చేలా చేస్తారు. 2018లో అసెంబ్లీ రద్దు, ఎన్నికలు కూడా 6 సంఖ్య కలిసి వచ్చేలా చూసుకున్నారు. తాజాగా అసెంబ్లీ టికెట్లు కూడా తన అదృష్ఠ సంఖ్య ప్రకారమే ప్రకటించారు. వాస్తవానికి 115 స్థానాలకు టికెట్లు ప్రకటించినా.. అభ్యర్థులు మాత్రం 114 మాత్రమే. ఎందుకంటే కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేయనున్నారు. దీంతో 115 నియోజవర్గాల్లో 114 అభ్యర్థులకే టికెట్లు ఇచ్చినట్లయింది. దాని ప్రకారం 1 + 1 + 4 = 6 అంటే సారు అదృష్ట సంఖ్య వచ్చినట్లే.

జాతకం ఎట్లుందో తెలుసా..
మంచి రోజు.. మంచి ముహూర్తాన త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ జాతకం ఎలా ఉందో తెలుసా.. పంచాంగ కర్తలు కూడా 2018 ఎన్నికల సమయంలో గ్రహాలు, నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయని, రాజయోగం ఉందని అంచనా వేశారు. కర్కాటక రాశి అయిన కేసీఆర్‌ జాతకం ప్రకారం వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రముఖ జోతిష్య పండితులు మంతా సూర్యనారాయణ శర్మ తొలిసారి కేసీఆర్‌ జాతకం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో తెలిపారు. ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ భవిష్యత్‌ ఎలా ఉండబోతుంది అనే వివరాలు వెల్లడించారు.

పేరు మార్పే పెద్ద పొరపాటు..
కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికలను టీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన ఈ తెలంగాణ రాష్ట్రసమితి… కేసీఆర్‌కు అచ్చొచ్చిందట. కానీ, 2023 ఎన్నికలను గులాబీ బాస్‌ భారత రాష్ట్ర సమితి పేరిట ఎదుర్కొనబోతున్నారు. దీంతో సూర్యనారాయణ శర్మ పార్టీ పేరు మార్పు కేసీఆర్‌ చేసిన పెద్ద పొరపాటు అంటున్నారు. బాగా కలిసి వచ్చిన టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసే అభ్యర్థులు చాలా మంది ఓడిపోతారని వెల్లడించారు.

గ్రహాల కూడా అనుకూలంగా లేవట..
తాజాగా కేసీఆర్‌ జాతకం ప్రకారం.. గ్రహాలు కూడా పెద్దగా అనుకూలంగా లేవని సూర్యనారాయణ శర్మ తెలిపారు. కేసీఆర్‌ విజయం వరకు జాతకం అనుకూలంగా ఉన్నా.. ముఖ్యమంత్రి అయ్యేంతగా గ్రహాలు, నక్షత్రాలు అనుకూలంగా లేవని వెల్లడించారు. వ్యక్తిగతం కేసీఆర్‌ జాతకం బాగున్నా.. పార్టీ పరంగా మాత్రం బాగాలేదని తెలిపారు. వ్యక్తిగత రాజయోగం ఉంటేనే సీఎం అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా రోశయ్య గురించి చెప్పారు. వైఎస్సార్‌ మరణం తర్వాత ఎక్కడో మూలన ఉన్న రోశయ్య ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు రాజయోగం రావడమే కారణమని వెల్లడించారు. యోగం కలిసి వస్తే.. ఎక్కడ ఉన్నా పదవి వెతుక్కుంటూ వస్తుందని తెలిపారు. 2014, 2018లో అలాంటి మహర్జాతకం ఉన్న కేసీఆర్‌కు ఈసారి మాత్రం అంత అనుకూలంగా లేదని స్పష్టం చేశారు.

మొత్తంగా పార్టీ పేరు మార్చడం ద్వారా పార్టీకి అనుకూలతలు 40 శాతం తగ్గాయని వెల్లడించారు. ఇక వ్యక్తిగత అనుకూలతలు కూడా కొంత అనుకూలంగా లేవని వెల్లడించారు. చివరగా ఎదుటి వ్యక్తి జాతకం, గ్రహాల అనుకూలతలు, విపక్షాల సీఎం అభ్యర్థి జాతకాలు, అనుకూలతల ఆధారంగా కేసీఆర్‌ సీఎం అయ్యే అవకాశాలు మెరుగవ్వడమో.. బలహీనమవ్వడమో జరుగుతుందని వివరించారు.