ACB COURT: ఫైబర్ నెట్’ వైర్ ను బాబుకు బిగిస్తున్న జగన్

ఏపీ ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి ఏ 1 గా వేమూరి హరిశ్చంద్ర ప్రసాద్, ఏ 25 గా చంద్రబాబును చూపుతూ సిఐడి కేసు నమోదు చేసింది. కార్పొరేషన్ లో 114 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు అభియోగం మోపారు.

Written By: Dharma, Updated On : October 12, 2023 10:53 am

ACB COURT

Follow us on

ACB COURT: కేసులతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఏపీ సిఐడి. చేయిస్తోంది మాత్రం జగన్ సర్కారే. స్కిల్ స్కాం కేసు విచారణ అత్యున్నత న్యాయస్థానంలో కొనసాగుతుండగా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసు.. ఇలా వరుస కేసులతో వీలైనంతవరకు చంద్రబాబును రిమాండ్ లోనే ఉంచాలని భావిస్తున్నారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకల్లో చంద్రబాబు ప్రమేయం ఉందని సిఐడి బలంగా వాదిస్తోంది. ఆయనను తప్పకుండా విచారించాల్సిందేనని పట్టుబడుతుంది. ఇందుకు సంబంధించి పీటీ వారెంట్లను దాఖలు చేసింది. ఫైబర్ నెట్ వైరుతో చంద్రబాబు ఉచ్చును బిగించే ప్రయత్నం జగన్ చేస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏపీ ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి ఏ 1 గా వేమూరి హరిశ్చంద్ర ప్రసాద్, ఏ 25 గా చంద్రబాబును చూపుతూ సిఐడి కేసు నమోదు చేసింది. కార్పొరేషన్ లో 114 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు అభియోగం మోపారు. చైర్మన్ గా హరిశ్చంద్ర ప్రసాద్ నియమించాలని సీఎంగా ఉన్న చంద్రబాబు లేఖ రాశారని.. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని సిఐడి చెబుతోంది. అందుకే చంద్రబాబు, నాటి చైర్మన్ హరిశ్చంద్రప్రసాద్ మధ్య ఉన్న బంధాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని సిఐడి వాదనలు వినిపించింది. బ్లాక్ లిస్టులో ఉన్న టెరా సాఫ్ట్ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా.. కనీస నిబంధనలు పట్టించుకోకుండా టెండర్లు కట్టబెట్టారన్నది సిఐడి అభియోగం.

సాధారణంగా ప్రభుత్వపరంగా ఎటువంటి నియామక ప్రక్రియ అయినా అధికారులే చేపడతారు. సీఎంతో పాటు మంత్రులు సిఫారసు చేస్తారు. వాస్తవానికి జరిగేది ఇదే. జగన్ సైతం కార్పొరేషన్ చైర్మన్ లను ఈ విధంగానే నియామకాలు చేశారు. కానీ చంద్రబాబుపై అభియోగాలు మోపుతూ.. కేసుల్లో పట్టు బిగించాలనుకుంటున్న సిఐడి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకంలో చంద్రబాబు అధికారులపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేయడం విశేషం. మరోవైపు ఎప్పుడో నమోదైన కేసులో కొత్తగా నిందితుడిగా పేరు చేర్చిన వారి అరెస్టు విషయంలో న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న ఏసీబీ కోర్టులో దీనిపైనే సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ప్రభుత్వం చూస్తుంటే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును కోర్టు బోనులోకి తేవాలని కృత నిశ్చయంతో ఉంది. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.