Aam Aadmi Party : అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ విజయాలపై ఆహా ఓహో అంటూ కీర్తిస్తున్నవారే. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ పక్కనున్న పంజాబ్ లోనూ గెలిచేసరికి ఆకాశానికెత్తేశారు. ఇంట గెలిచి రచ్చ కూడా గెలిచిందని రచ్చరచ్చ చేశారు. కానీ మరికొన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిందని.. కనీసం నోటాకు వచ్చినన్నీ ఓట్లు కూడా రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టు.. ఒక రాష్ట్రంలో గెలవగానే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అనుకోవడానికి లేదని దీన్ని బట్టి తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావించాయి. దీంతో ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. తీరా ఎన్నికల ఫలితాల రోజు మాత్రం అందరినీ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించింది. రాజకీయంగా తమకు ఎదురులేదని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో మరోసారి బీజేపీ నిరూపించింది.
బీజేపీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎవరి మద్దతు లేకుండానే అధికారంలోకి రావడం విశేషం. ఉత్తరాఖండ్, పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, గోవాలో హంగ్ ఏర్పాటవుతుందని విశ్లేషణలు వచ్చాయి. అయితే ఆ రాష్ట్రాల్లోనూ కషాయ జెండా రెపరెపలాడింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరాశే ఎదురైంది. అనుహ్యంగా పంజాబ్ లో మాత్రం ఆప్ 92 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది.
ఐదింటిలో నాలుగు స్థానాల్లో బీజేపీ అధికారంలోకి రాగా ఒక పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చింది. దీనిని కొన్ని మీడియా ఛానళ్లు ఆప్ జాతీయ పార్టీగా మారబోతుందని, బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందంటూ ఊదరగొడుతున్నాయి. నిజానికి ఆప్ మొత్తంగా నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఆప్ 400 స్థానాల్లో, ఉత్తరాఖండ్ లో 70 స్థానాల్లో, గోవాలో 38 స్థానాల్లో ఆప్ డిపాజిట్లు కొల్పోయింది. ఈ రాష్ట్రాల్లో స్వతంత్రుల కంటే కూడా ఆప్ కు తక్కువ ఓట్లు రావడం విశేషం.
పంజాబ్ ఆప్ విక్టరీని చూపిస్తూ మిగిలిన రాష్ట్రాల్లో ఆపార్టీ దుస్థితిని మాత్రం మీడియా చూపించలేదు. పంజాబ్ లో ఆప్ వైపు ప్రజలు మొగ్గుచూపడానికి అనేక కారణాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు చట్టాలు చేయడాన్ని పంజాబ్ లోకి కమ్మిలు కలిస్తానీలు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. వీరికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ రైతుల ధర్నాకు అన్ని విధలా సహాయ సహకారాలు అందించింది. ఈ అంశాన్ని వారికి పంజాబ్ ఎన్నికల్లో కలిసొచ్చింది.
మరోవైపు కాంగ్రెస్ పంజాబ్ లో ముఖ్యమంత్రులను మార్చడం, ప్రజా సమస్యల కంటే ఎన్నికల్లో గెలుపు కోసం ఆపార్టీ జిమ్మిక్కులు చేయడంతో ప్రజలు ఆప్ వైపు మొగ్గుచూపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. తెలంగాణ కోసం పోరాడింది టీఆర్ఎస్సే అని ప్రజలు బలంగా నమ్మడంతో ఆ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలో వచ్చారు. పంజాబ్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది.
పంజాబ్ ఆప్ అధికారంలో రావడం మున్నాళ్లే ముచ్చటే అన్న అభిప్రాయం వ్యకమవుతోంది. ఎందుకంటే రాబోయే ఐదేళ్ల పంజాబ్ లోని కమ్మీలు కలిస్థానీల ధర్నా వల్ల దేశ వ్యతిరేక కార్యక్రమాలు పెద్దఎత్తున కార్యక్రమాలు వచ్చే అవకాశం కన్పిస్తోంది. బీజేపీని ఆప్ బూచిగా చూపి పంజాబ్ యువతను చేజేతులారా బలిచ్చినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ఈ విషయాన్ని పంజాబ్ ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారో వేచిచూడాల్సిందే..!