Harirama Jogaiah Vs Amarnath: ఏపీలో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాజకీయ పక్షాలకు గుర్తొచ్చేది కాపులు. నయానో..భయానో దారికి తెచ్చుకోవడం వారికి అలవాటు అయ్యింది. ఎదురుదిరిగితే వారి మధ్య చిచ్చు రగిల్చి చలిమంట కాచుకోవడం పరిపాటిగా మారింది. ఉమ్మడి ఏపీలోనైనా.. విభజిత ఆంధ్రప్రదేశ్ లోనైనా జరిగింది అదే. దాని ఫలితమే కాపులు రాజ్యాధికారానికి దూరం కావడం, అయితే ఈసారి కాపులు జెండా, అజెండాలు విడిచిపెట్టి ఒకేతాటి పైకి వస్తున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ క్రీనీడను గుర్తుచేసుకుంటున్నారు. పవన్ రూపంలో ఒక అరుదైన అవకాశం వచ్చిందని భావిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడు అన్న నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. పవన్ ను తమ భావి నాయకుడిగా.. తమ కలలను సాకారం చేసే నేతగా భావిస్తున్నారు. ఎద్దరో రాజకీయ ఉద్ధండులు సైతం అండగా నిలుస్తున్నారు. అటువంటి వారిలో చేగొండి హరిరామజోగయ్య ఒకరు. కాపు సంక్షేమ సంఘ నాయకుడిగా ఉన్న ఈ కురు వృద్ధుడు జనసేనలో చేరకపోయినా.. పవన్ నాయకత్వానికి మాత్రం బలపరుస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ సర్కారుకు కాపులు దూరంగా జరుగుతున్నారు. పవన్ కు మరింత దగ్గరవుతున్నారు. ఇది జగన్ సర్కారుకు మింగుడు పడడం లేదు. సహజంగా ఒంటరి పోరుతో అధికార వైసీపీకి లాభిస్తుందని తెలిసి పవన్ పొత్తుల కోసం పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తులుంటాయని సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో వైసీపీలోని కాపు మంత్రులు, నాయకులు పవన్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాపుల ఓట్లను చంద్రబాబు కు హోల్ సేల్ గా అమ్మే ప్రయత్నంలో పవన్ ఉన్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కాపు సంఘాల ప్రతినిధులు తిప్పికొడుతున్నారు. కాపుల్లో ఐక్యత చాటే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చేగొండి హరిరామజోగయ్య పవన్ కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎనిమిది పదుల వయసులో కాపు రిజర్వేషన్ కోసం దీక్షకు దిగిన ఆయన వైసీపీలోని కాపు మంత్రులు, నేతలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఘాటైన లేఖ రాశారు.
పవన్ పై అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో హరిరామజోగయ్య లేఖ రాశారు. ‘డీయర్ అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పాడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా’ అంటూ లేఖలో పేర్కొన్నారు. దీనికి అదే స్థాయిలో మంత్రి అమర్నాథ్ రిప్లయ్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ కి చెప్పాల్సినవి నాకు చెబుతున్నారు. కాపుల విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ కు రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు మీరు మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అమర్నాథ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు లేఖలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ రెండు లేఖలు ఇప్పుడు కాపు సామాజికవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. హరిరామజోగయ్య ఇప్పుడు ఏ పార్టీలో లేరు. కానీ ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర చూసుకుంటే చేయని పదవి లేదు. ఒక్క సీఎం పదవి తప్ప. సమితి ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర హోం మంత్రి వరకూ వివిధ పదవులు అలంకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా కూడా గెలుపొందారు. అటువంటి నాయకుడు ఇప్పుడు పవన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కాపుల ఆకాంక్ష, గొంతుక పవన్ అని నమ్ముతున్నారు. అటువంటి రాజకీయ కురువృద్ధుడ్ని చులకన చేస్తూ మంత్రి అమర్నాథ్ లేఖలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాపు సామాజికవర్గ ప్రజలు ఖండిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ తో పాటు వైసీపీలో ఉన్న కాపు నేతలlఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.