Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ చర్యలను ఎండగట్టడంలో జనసేన అధినేత పవన్ ముందంజలో ఉంటారు. ప్రభుత్వంపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తారు. కొద్ది నెలల కిందట వలంటీర్ల విషయంలో పవన్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు పవన్ తీరుపై ఆందోళనలు చేపట్టారు. దీనికి వైసిపి నేతలు సంఘీభావం కూడా వ్యక్తం చేశారు. ఏకంగా ఓ వలంటీరు తమ మనోభావాలను పవన్ దెబ్బతీశారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు నమోదు కావడం.. కోర్టు విచారణకు రావడం జరిగిపోయింది. తాజాగా అదే కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది.
విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసు రెండుసార్లు విచారణ కూడా జరిగింది. అప్పట్లో కేసు పై విచారణ జరిపిన కోర్టు వలంటీర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను ఏవైనా ఆధారాలు ఉన్నాయా? అని అప్పట్లో ప్రశ్నించింది. ఫిర్యాదు రాలి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయా? దానికి తగ్గ ఆధారాలు సమర్పించగలరా? అని కూడా ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో తాజాగా విచారణ చేపట్టిన కోర్టు ఫిర్యాదురాలు సమర్పించిన రికార్డులన్నీ పరిశీలించింది. ఈనెల 27 కు విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నాడు పవన్ వలంటీర్ వ్యవస్థపై పై మాట్లాడారు. రూ.5 వేలు జీతం ఇచ్చి వలంటీర్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని.. ప్రజల వ్యక్తిగత గోప్యత సమాచారాన్ని సేకరిస్తున్నారని.. మనుషుల అక్రమ రవాణాకు ఇదే కారణమని.. ముఖ్యంగా మహిళల అదృశ్యం వెనుక సమాచార సేకరణ ఉందని.. రకరకాల వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణాలు ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని ఆరోపణలు చేశారు. అక్కడకు కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం గణాంకాలను ప్రకటించింది. పవన్ ఆరోపణల్లో నిజం ఉందని తేలింది. ఇప్పుడు అవే ఆరోపణలపై వలంటీర్ పెట్టిన కేసులో పురోగతి కనిపిస్తోంది. మరి అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.