Gandhi Jayanti 2024: మహాత్మా… మహర్షి.. స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు.. నేడు గాంధీ జయంతి!

మన జాతిపిత మహాత్మాగాంధీ. భారత స్వాతత్య్రం కోసం యావత్‌ దేశాన్ని ఏకం చేసి మహోన్నత వ్యక్తి. తెల్లదొరలపై ఒక్క రక్తపు బొట్టు చిందకుండా పోరాటం చేసిన శాంతమూర్తి. నేడు గాంధీ జయంతి.

Written By: Raj Shekar, Updated On : October 2, 2024 8:37 am

Gandhi Jayanti 2024(1)

Follow us on

Gandhi Jayanti 2024: భారత స్వాతంత్య్రం కోసం అనేక మంది పోరాటాలు చేశారు. ప్రాణాలు సైతం అర్పించారు. గెలిల్లా పోరాటాలు చేశారు. జైలుకు వెళ్లారు. బ్రిటిష్‌ సైన్యం కాల్పుల్లో ప్రాణాలు వదిలారు. అయితే.. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా.. శాంతి మార్గంలో ఉద్యమాన్ని నడిపిన మహోన్నత వ్యక్తి మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. భారత స్వాతంత్య్రోద్యంలో కీలక పాత్ర పోషించారు గాంధీ అనేక పోరాటాలు చేశారు. ఇదుకోసం భారతీయులందరినీ ఏకం చేశారు. అహింసే తన సిద్ధాంతంగా, ఉద్యమాలను నడిపించారు. భారతీయతను అన్నివర్గాల్లో రగిలించాడు. అందరూ స్వాతంత్య్రం కోసం పోరాడేలా స్ఫూర్తి నింపారు. వివిధ మార్గాల్లో స్వాతంత్య్రోద్యమం సాగించిన అనేక మంది చివరకు గాంధీ మార్గంలోనే సాగారు. 1869, అక్టోబర్‌ 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో పుటిన గాంధీ పూర్తిపేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి బాపూజీగా, జాతి పితగా, మహాత్ముడిగా కీర్తి ఘగించారు. గాంధీ తన ప్రాథమిక విద్యను పూర్తిచేసిన అనంతరం ఇంగ్లండ్‌కు వెళ్లారు. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. దక్షిణాఫ్రికా వెళ్లి.. వలసదారుల హక్కుల కోసం పోరాడారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని ఆ మహనీయుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

జాతిపిత ఎలా అయ్యారు..
మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ స్వాతత్య్రం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇందులో సత్యాగ్రహం, ఖిలాఫత్‌ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్‌ తదితరాలు ఉన్నాయి. పూర్తిగా అహింసా సిద్ధాంతంతోనే గాంధీజీ అనేక పోరాటాలను నడిపించారు. హిందూ,ముస్లింల మధ్య సామరస్యం, ఐక్యత పెంచేందుకు కృషి చేశారు. సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం పని చేశారు. సత్యం, సంయమనం, అహింస మార్గాన్ని అనుసరించారు. ఇక దేశం కోసం గాంధీజీ సర్వం త్యాగం చేశారు. సాదాసీదా జీవితమే గడిపారు. గాంధీజీ ఒక అన్వేషకునిగానూ ప్రసిద్ధి చెందారు. గాంధీజీ సరళత, నిర్లిప్తత ఆత్మతో అనుసంధానం అనే భావనలతో జీవించారు. ధోతి ధరించి ఎక్కడికైనా కాలినడకనే ప్రయాణించారు. ఆశ్రమాలలో కాలం గడిపిన గాంధీ భారతీయులకు తండ్రిలా మారారు. ఈ కారణంగానే ఆయనను ప్రజలు బాపూజీ అని పిలవడం ప్రారంభించారు.

మొదట పిలిచింది ఆయనే..
ఇక మహాత్మా గాంధీని జాతి పితామహుడు అని పిలిచన మొదటి వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్‌. గాంధీజీ భారత స్వాతంత్య్ర పోరాటంలో విశేష కృషి చేసిన కారణంగానే బోస్‌ జాతి పితామహుడు అని సంబోధించి గౌరవించాడు. ఆ తర్వాత నుంచే అందరూ గాంధీజీని జాతిపిత అని పిలుస్తున్నారు.

గీతే.. ఆయన కరదీపిక..
భగవద్గీత ఓ వజ్రాల గని, 18 అధ్యాయాలు చదివి, వాటి సారాన్ని ఆకళింపు చేసుకోవడం ద్వారా జీవితం ఆనందమయం అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు నాకు పౌరాణిక పాత్రలా కాకుండా ఓ మహాగురువుగా, దివ్య జ్ఞాన యోగీశ్వరుడిగా దర్శనమిస్తాడు అని గాంధీ తెలిపారు. ‘దీక్ష, కర్తవ్యం, విశ్వాసం, సత్యం, కృషి, గమ్యం వంటి ఉదాత్త అంశాల ప్రాతిపదికగా చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి సాధించాలి అనే సిద్ధాంతాన్ని భగవద్గీత సంపూర్ణంగా బలపరుస్తుందని తెలిపారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ దీక్షకు కావలసిన శక్తియుక్తుల్ని, దృఢచిత్తాన్ని, సానుకూల దృక్పథాన్ని భగవద్గీత నుంచి పొందానని గాంధీజీ తెలిపేవారు. గీత’ లేని నా జీవితాన్ని ఊహించలేను అని పేర్కొన్నారు.