Rajanna Dora: రాజన్న దొరకు ఝలక్ ఇచ్చిన జగన్

ఇటీవల వైసిపి దూకుడు పెంచింది. ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు నియోజకవర్గాల వారీగా రివ్యూలు పెట్టి అభ్యర్థి పై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అటు సీఎం జగన్ సైతం జిల్లాలో పర్యటించి సంక్షేమ పథకాలను బటన్ నొక్కి ప్రారంభిస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 28, 2023 5:20 pm

Rajanna Dora

Follow us on

Rajanna Dora: రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సీనియర్లకు జగన్ ఝలక్ ఇవ్వనున్నట్లు సమాచారం. వై నాట్ 175 అన్న నినాదం రాజకీయ ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలకి షాక్ ఇస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో దించే క్రమంలో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో పలువురు సీనియర్ మంత్రులు సైతం ఉన్నారు. తాజాగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం రాజన్న దొరకు జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఇటీవల వైసిపి దూకుడు పెంచింది. ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు నియోజకవర్గాల వారీగా రివ్యూలు పెట్టి అభ్యర్థి పై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అటు సీఎం జగన్ సైతం జిల్లాలో పర్యటించి సంక్షేమ పథకాలను బటన్ నొక్కి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడే అభ్యర్థుల విషయంలో స్పష్టతనిస్తున్నారు. అయితే ఇటీవల ఉమ్మడి విజయనగరంలో పర్యటించిన జగన్ డిప్యూటీ సీఎం రాజన్నదొర విషయంలో కనీస స్పష్టత ఇవ్వకపోవడం విశేషం.

గతంలో ఇదే జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ మాజీ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి విషయంలో స్పష్టతనిచ్చారు. ఆమెనే అభ్యర్థిగా ప్రకటించారు. ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజా పర్యటనలో సుమారు 35 నిమిషాల పాటు జగన్ ప్రసంగించారు. కానీ ఎక్కడ రాజన్న దొర గురించి మాట లేదు. దీంతో అప్పటి నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐపాక్ నివేదికలో రాజన్న దొర వెనుకబడ్డారని.. పార్టీలో అంతర్గత సమస్యలను అధిగమించలేకపోతున్నారని.. క్యాడర్ పై పొట్టు సాధించలేకపోతున్నారని స్పష్టమైన నివేదికలు జగన్ కు అందాయట. అందుకే రాజన్న దొర విషయంలో పెండింగ్లో పెట్టినట్లు సమాచారం.

ఇటీవల జగన్ జిల్లాల పర్యటనల్లో వీలైనంతవరకు అభ్యర్థుల విషయంలో స్పష్టతనిస్తున్నారు. అభ్యర్థుల పేర్లను ప్రస్తావించి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. అటు రీజనల్ కోఆర్డినేటర్ల సైతం చాలా వరకు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమై అభ్యర్థి విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు నియోజకవర్గాల్లో స్పష్టత ఉంది. దాదాపు 75 నియోజకవర్గాల్లో మాత్రం పెండింగ్లో పెడుతున్నారు. ఇలా పెట్టిన వాటిలో సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు సైతం ఉండడం విశేషం.