North-Andhra Ministers: అధికారం చేతిలో ఉన్న రోజులు ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొవచ్చు. కానీ అధికారం దూరమైతే మాత్రం చిన్న తప్పిదాలు కూడా మెడకు చుట్టుకుంటాయి. ప్రతిబంధకంగా మారాతాయి. ఒక్కోసారి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాయి. సమస్యలు చుట్టుముడతాయి. అధికార వైసీపీ నేతలు కొందరికి ఇప్పుడు అధికారం పోయే సరికి తత్వం బోధపడుతుంది. ఉత్తరాంధ్రలో డిప్యూటీ సీఎంలుగా పదవులు చేపట్టిన ధర్మాన క్రిష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణిలు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సొంత కుటుంబం నుంచే వారి సవాళ్లు ఎదురవుతున్నాయి. జగన్ తొలి కేబినెట్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన క్రిష్ణదాస్ చోటు దక్కించుకున్నారు. సోదరుడు ధర్మాన ప్రసాదరావును కాదని క్రిష్ణదాస్ కే జగన్ ప్రాధాన్యమిచ్చారు. కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించడమే కాకుండా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. అయితే ఈ పరిణామాలను ధర్మాన ప్రసాదరావు తట్టుకోలేకపోయారు. తాను నిర్మించిన రాజకీయ పునాదిపై వచ్చిన క్రిష్ణదాస్ ను అందలం ఎక్కించడంపై కీనుక వహించారు. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు నిర్వర్తించారు. జిల్లాలో కీ రోల్ పోషించారు. అప్పటి వరకూ తాను ప్రాతినిధ్యం వహించిన నరసన్నపేటను సోదరుడు క్రిష్ణదాస్ కు విడిచిపెట్టి శ్రీకాకుళం నియోజకవర్గానికి మారారు. పెద్ద సాహసమే చేశారు. కానీ ధర్మాన క్రిష్ణదాస్ ఈ విషయాన్ని మరిచి తన తోవలో నడుచుకున్నారు. సోదరుడు ప్రసాదరావు త్యాగాన్ని మరిచిపోయారు. మూడేళ్ల పాటు అతడితో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. క్రిష్ణదాస్ కుమారుడు క్రిష్ణ చైతన్య కూడా చిన్నాన్న ప్రసాదరావు వర్గాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. తమకు అయిదేళ్ల పాటు పదవి ఉంటుందని భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే ఈ ధోరణి ధర్మాన సొంత కుటుంబంలో చిచ్చు రేపింది. అసలు రాజకీయ పునాది ఎవరు వేశారు? ఇంతటి ప్రాధాన్యత ఎక్కడి నుంచి దక్కింది? అన్నది ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారని కాస్తా ఆగ్రహంతోనే మూడేళ్ల పాటు గడిపారు. నరసన్నపేట నియోజకవర్గంలో మెజార్టీ మండలాలు ధర్మాన ప్రసాదరావు వర్గీయుల చేతిలోనే ఉన్నాయి. అయితే మూడేళ్ల తరువాత క్రిష్ణదాస్ పదవి ఊడిపోయింది. ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో ధర్మాన వర్గం అటు శ్రీకాకుళం, ఇటు నరసన్నపేట నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యింది. క్రిష్ణదాస్ వర్గాన్ని తొక్కడం ప్రారంభించారు. దీంతో క్రిష్ణదాస్ తో పాటు కుటుంబసభ్యుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ఇంతవరకూ చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ లపై నోరు పారేసుకున్న క్రిష్ణదాస్ సొంత కుటుంబసభ్యులపై ధ్వజమెత్తుతున్నారు.
క్రిష్ణదాస్ హాట్ కామెంట్స్
ఇటీవల నరసన్నపేట నియోజకవర్గ ప్లీనరీలో కీలక వ్యాఖ్యలు చేశారు. నన్నెవరూ ఏమీ పీకలేరని కూడా చెప్పుకొచ్చారు. రాసిపెట్టుకోండి నేనే నరసన్నపేట ఎమ్మెల్యేను, రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందని వాకబు చేయడం ప్రారంభించారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు క్రిష్ణ చైతన్య బరిలో దిగుతారని.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చాలా సందర్భాల్లో క్రిష్ణదాస్ ప్రకటించారు. కానీ ఇంతలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుతో పాటు ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు నరసన్నపేటలో రీయాంట్రీ ఇచ్చారు. పరామర్శలు, సందర్శనల పేరిట తిరగడం ప్రారంభించారు. కీలక నేత కావడంతో మెజార్టీ కేడర్ ధర్మాన ప్రసాదరావు వెంట నడిచింది. దీంతో క్రిష్ణదాస్ లో కలవరం ప్రారంభమైంది కుమారుడు బరిలో దిగితే ఓటమి ఖాయమన్న సంకేతాలు వచ్చాయి. దీంతో జాగ్రత్త పడిన క్రిష్ణదాస్ మాట మార్చారు. తానే నరసన్నపేటలో బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.
సోషల్ మీడియాలో హల్ చల్
కానీ మూడేళ్ల పాటు ఇబ్బందిపడిన ధర్మాన కుటుంబసభ్యులు, ధర్మాన ప్రసాదరావు అనుచరులు వచ్చే ఎన్నికల్లో క్రిష్ణదాస్ ను తప్పించి ధర్మాన కుటుంబంలో వేరొకరికి టిక్కెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ధర్మాన ప్రసాదరావు, క్రిష్ణదాసుల మేనల్లుడు, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంటూ జోరుగా ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే నరసన్నపేట వైసీపీ ప్లీనరీకి కూర్మినాయుడు గైర్హాజరయ్యారు. దీంతో తన వెనుక కుట్ర జరుగుతుందని భావించిన క్రిష్ణదాస్ కీలక కామెంట్స్ చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్న తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మరో సోదరుడు రాందాస్ ను క్యాండిడేట్ గా పెట్టి గెలిపించుకోలేకపోయారని.. ఇప్పుడు ఏంచేస్తారని ప్రశ్నించడం ద్వారా ధర్మాన కుటుంబంలో ఉన్న విభేదాలను బయటపెట్టారు. మొత్తానికి డిప్యూటీ సీఎంగా, జగన్ వద్ద మంచి మార్కులు సంపాదించుకున్న క్రిష్ణదాస్ కు గడ్డు రోజులు ఎదురయ్యాయనే చెప్పొచ్చు.
Also Read: Regional Parties: ప్రాంతీయ పార్టీలకు నంబర్ 2లతో డేంజర్.. ఉద్దవ్ ఠాక్రే వెనుక జరిగిందిదే
కురుపాం రాణికి ఇబ్బందులు..
కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి సైతం సొంత కుటుంబం నుంచే సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆమె స్వయాన సీనియర్ నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు చంద్రశేఖర్ రాజు కోడలు. విజయరామరాజు టీడీపీలో ఉన్నా ఆయనతో విభేదించి సోదరుడు చంద్రశేఖర్ రాజు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కోడలు పుష్పశ్రీవాణిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో సైతం పుష్పశ్రీవాణి గెలుపు వెనుక చంద్రశేఖర్ రాజు కీ రోల్ పాత్ర పోషించారు. అటు తరువాత జగన్ తన కేబినెట్ లోకి పుష్ఫశ్రీవాణిని తీసుకున్నారు. గిరిజన సంక్షేమంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. అటు తరువాత పుష్పశ్రీవాణి స్వతంత్రంగా వ్యవహరించారు. మామ చంద్రశేఖర్ రాజు ను సైతం లెక్క చేయలేదు. దీంతో విభేదాలు పొడచూపాయి. చంద్రశేఖర్ రాజు తన కుమార్తె పల్లవిని తీసుకొని టీడీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పల్లవిని దించి కోడలు పుష్పశ్రీవాణిని చెక్ చెప్పాలని భావించారు. అయితే చంద్రశేఖర్ రాజు అనారోగ్యంతో హఠాన్మరణం పొందారు. కానీ కుమార్తె పల్లవి మాత్రం పట్టు వీడడం లేదు. డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ వద్ద సాక్షాధారాలు సైతం ఉన్నాయని ప్రకటించారు. అయితే ఈ పరిణామాలతో పుష్ప శ్రీవాణి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నియోజకవర్గంలో ఆమె ఏమంత అనుకూల పరిస్థితులు లేవు. గడపగడపకూ మన ప్రభుత్వంలో సైతం ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఇన్నాళ్లు మంత్రి పదవి చేపట్టి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అటు ఇంటా.. ఇటు బయటా ప్రతికూల పరిస్థితులను పుష్పశ్రీవాణి ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు అధికారం చేతిలో ఉండడంతో ఇటువంటి విమర్శలు కొట్టుకుపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం అటువంటివి కుదరడం లేదు.
Also Read: Sammathame 3rd Day Collections: ‘సమ్మతమే’కి రికార్డ్ కలెక్షన్స్.. ఇది షాకింగే !